ప్రజాప్రతినిధుల ‘భావప్రకటన’పై అదనపు పరిమితులు విధించలేం : సుప్రీంకోర్టు

ప్రజాప్రతినిధుల ‘భావప్రకటన’పై అదనపు పరిమితులు విధించలేం  : సుప్రీంకోర్టు

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) సెక్షన్ లో ఉన్న నిబంధనలు మినహా ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై అదనపు పరిమితులను విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్  నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈమేరకు తీర్పు ఇచ్చింది. మంత్రులు చేసే వ్యాఖ్యలను నేరుగా ప్రభుత్వంతో ముడిపెట్టి చూడొద్దని.. ఎవరైనా మంత్రి ఏవైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే వాటికి ఆయనే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. 

ఈ కేసుకు సంబంధించి జస్టిస్ బి.వి.నాగరత్న ప్రత్యేకమైన తీర్పు కాపీని రాశారు. ‘‘ఎవరైనా ప్రజాప్రతినిధి ప్రభుత్వ వ్యవహారాల గురించి మాట్లాడితే.. అది ప్రభుత్వపరమైన అంశంగానే పరిగణించబడుతుంది. ఒకవేళ ఆయన ప్రభుత్వ వ్యవహారాలతో సంబంధం లేని టాపిక్ పై వ్యాఖ్యలు చేస్తే.. దాన్ని ఆయన వ్యక్తిగత అంశంగా పరిగణించాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఉంది. దేశంలోని పౌరులను కించపర్చే వ్యాఖ్యలు చేయకుండా ప్రజాప్రతినిధులను నియంత్రించేందుకు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే బాగుంటుంది’’ అని తీర్పు కాపీలో జస్టిస్ బి.వి.నాగరత్న వ్యాఖ్యానించారు. 

ఈ తీర్పు నేపథ్యం ఇదీ.. 

2016 జులైలో ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షెహర్ జిల్లాలో ఓ సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. అయితే దీనిపై అప్పట్లో రాష్ట్ర మంత్రిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను రాజకీయ కుట్రగా అభివర్ణించారు.  తన భార్య, కుమార్తెపై జరిగిన ఈ దారుణ ఘటనకు  సంబంధించిన కేసును ఢిల్లీకి బదిలీ చేయాలంటూ బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి అప్పట్లోనే  సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.  అయితే ఈ ఘటనను ఆజంఖాన్ రాజకీయ కుట్రగా అభివర్ణించడాన్ని ఆ వ్యక్తి తన పిటిషన్ లో తప్పుపట్టాడు. దీనికిగానూ ఆజంఖాన్ పై కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. అప్పట్లో ఈ కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. 2017 అక్టోబరులో ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది.