ఇండియాలోనూ ఐఫోన్​ 14 తయారీ

ఇండియాలోనూ ఐఫోన్​ 14 తయారీ

న్యూఢిల్లీ: ఇటీవలే లాంచ్​ అయిన ఐఫోన్​ 14ను ఇండియాలోనూ తయారు చేస్తామని అమెరికా టెక్​ కంపెనీ యాపిల్​ ప్రకటించింది. ప్రొడక్టుల తయారీని చైనా నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్న కంపెనీల లిస్టులో ఇది కూడా చేరింది. ఐఫోన్​ 14 సిరీస్​ ఫోన్లను యాపిల్​ ఈనెల ఏడున లాంచ్​ చేసింది. నిజానికి యాపిల్​ 2017లోనే ఐఫోన్​ ఎస్​ఈ మోడల్​ తయారీతో ఇండియాలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఐఫోన్​ ఎస్​ఈతోపాటు ఐఫోన్​12,13 మోడల్స్​ కూడా మనదేశంలో తయారవుతున్నాయి. ‘మేడిన్​ ఇండియా’ ఐఫోన్​14 మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానుంది. మన దగ్గర తయారైన ఫోన్లను విదేశాలకూ ఎగుమతి చేస్తారు.

చెన్నై శివార్లలోని శ్రీపెరుంబుదూర్​లో గల ఫాక్స్​కాన్​ ఫెసిలిటీలో ఐఫోన్​14ను తయారు చేస్తారు. ఈ సంస్థ యాపిల్​కు అతిపెద్ద కాంట్రాక్ట్​ మాన్యుఫాక్చరర్​. 2025 నాటికి ప్రతి నాలుగింటిలో ఒక ఐఫోన్​ ఇండియాలోనే తయారవుతుందని జేపీ మోర్గన్​ పోయిన వారం విడుదల చేసిన నోట్​లో పేర్కొంది. యాపిల్​ 2020లోనే మనదేశంలో రిటైల్​ స్టోర్​ను కూడా తెరిచింది. దీంతో ఇండియా మార్కెట్​ నుంచి వచ్చే ఆదాయం భారీగా పెరిగిందని  యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ ప్రకటించారు.