సంక్రాంతికి ఏపీ ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పండగకు సొంతూళ్లకు వెళ్లి ఆనందంగా గడపాలని అనుకున్నవారికి ఆర్టీసీ అద్దె బస్సుల రూపంలో ఊహించని షాక్ తగిలింది. జనవరి 12 నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు. ఈ మేరకు గురువారం ( జనవరి 8 ) ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది నుంచి అమల్లో ఉన్న స్త్రీ శక్తి పథకం కారణంగా బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని.. అందుకు గాను ఒక్కో బస్సుకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు.
ఈ అంశంపై ఆర్టీసీ యజమాన్యం అద్దె బస్సుల యజమానులతో జరిపిన చర్చలు ఫలితం ఇవ్వలేదు. ఒక్కో బస్సుకు రూ. 5వేల 200 చొప్పున ఇచ్చేవిధంగా బుధవారం ( జనవరి 7 ) సర్క్యులర్ జారీ చేసింది ఆర్టీసీ. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది యజమానులు సంఘం. ఎంత పెంచాలన్న విషయం తమతో చర్చించకుండా డైరెక్ట్ గా సర్క్యులర్ జారీ చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. ఈ క్రమంలో 12వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించామని తెలిపారు అద్దె బస్సుల యజమానులు.
నిలిచిపోనున్న 2 వేల 419 ఆర్టీసీ అద్దె బస్సులు:
అద్దె బస్సుల యజమానులు సమ్మె బాట పట్టడంతో ఏపీ వ్యాప్తంగా 2 వేల 419 ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లాలని అనుకునేవారిపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. నిలిచిపోనున్న బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులు 2,419 ఉన్నట్లు సమాచారం.
