క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌ ఇవే

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్‌‌‌‌బీఐ కొత్త రూల్స్‌‌ ఇవే
  • లేటైతే బ్యాంక్​లు రోజుకి రూ. 500 పెనాల్టీ కట్టాల్సిందే..
  • ఏడాది పాటు క్రెడిట్ కార్డు వాడకపోతే ఆటోమెటిక్‌‌గా కార్డును క్లోజ్ చేయాలి

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: వెంటపడి మరీ క్రెడిట్  కార్డులను బ్యాంకులు  ఇస్తుంటాయి. కానీ, వాటిని క్లోజ్ చేయమని చెప్పేటప్పుడు మాత్రం  కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌కు కాల్ చేయాలనో లేదా బ్యాంక్ బ్రాంచుకు వెళ్లాలనో చెప్పి ఆలస్యం చేస్తుంటాయి. కస్టమర్‌‌‌‌కు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు ఆర్‌‌‌‌బీఐ క్రెడిట్‌‌కార్డులకు సంబంధించిన రూల్స్‌‌ను తాజాగా మార్చింది. కస్టమర్‌‌‌‌ తన క్రెడిట్‌‌కార్డును క్లోజ్ చేయమని ఇన్‌‌ఫామ్‌‌ చేస్తే చాలు బ్యాంక్‌‌లు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు వారం రోజుల్లోపు ఆ కస్టమర్ క్రెడిట్‌‌కార్డును క్లోజ్ చేయాల్సిందే. క్రెడిట్‌‌కార్డు బకాయిలను కస్టమర్ చెల్లిస్తే, ఆ కస్టమర్‌‌‌‌ ఎస్‌‌ఎంఎస్‌‌, ఈ–మెయిల్‌‌, ఫోన్‌‌ కాల్‌‌ ఏ విధంగానైనా క్రెడిట్‌‌కార్డును క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టినా,  బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు అది ఫాలో కావాల్సిందే.  

వారం రోజుల్లో  ఈ ప్రాసెస్ పూర్తికాకపోతే కార్డును ఇష్యూ చేసిన సంస్థలపై రోజుకి రూ. 500 చొప్పున పెనాల్టీ పడుతుంది. క్రెడిట్‌‌కార్డులకు సంబంధించిన ఆర్‌‌‌‌బీఐ (క్రెడిట్‌‌ కార్డ్‌‌, డెబిట్‌‌కార్డ్‌‌–ఇష్యూయెన్స్‌‌ & కండక్ట్‌‌) డైరెక్షన్స్‌‌ 2022 రూల్స్ అన్ని  షెడ్యూల్డ్‌‌ కమర్షియల్ బ్యాంకులకు, అన్ని ఎన్‌‌బీఎఫ్‌‌సీలకు వర్తిస్తాయి. కానీ, పేమెంట్స్ బ్యాంకులు, ప్రభుత్వ కో–ఆపరేటివ్ బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకు ఈ రూల్స్‌‌ వర్తించవు.  ఈ రూల్స్ ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 
కొత్త రూల్స్ ఇవే..
1) కస్టమర్ తన క్రెడిట్‌‌ కార్డు బకాయిలను చెల్లిస్తే,  క్రెడిట్ కార్డును క్లోజ్ చేయమని ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టుకున్నా,  కార్డును ఇష్యూ చేసిన సంస్థలు  వారం రోజుల్లో తప్పనిసరిగా ఆ క్రెడిట్‌‌ కార్డును క్లోజ్ చేయాలి.  
2) క్రెడిట్ కార్డును క్లోజ్ చేసుకునే రిక్వెస్ట్‌‌ను పోస్టులో లేదా ఇతర మార్గాల్లో పంపించాలని కార్డును ఇష్యూ చేసిన సంస్థలు డిమాండ్ చేయకూడదు. హెల్ప్‌‌లైన్‌‌, సంబంధిత ఈ–మెయిల్‌‌ అడ్రెస్‌‌, ఇంటరాక్టివ్‌‌ వాయిస్ రెస్పాన్స్‌‌ (ఐవీఆర్‌‌‌‌)..ఏ విధానంలోనైనాకస్టమర్‌‌‌‌ తన క్రెడిట్ కార్డు క్లోజ్‌‌ చేయమని రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇంక బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు కూడా దీనికి సంబంధించిన  లింక్‌‌ను తమ వెబ్‌‌సైట్‌‌లలో, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌, మొబైల్‌‌ బ్యాంకింగ్‌‌లలో కనిపించేలా డిస్‌ప్లే చేయాలి.  
3) వారం రోజుల్లోపు కస్టమర్ పెట్టుకున్న క్రెడిట్ కార్డు క్లోజర్ రిక్వెస్ట్‌‌ను బ్యాంకులు, ఎన్‌‌బీఎఫ్‌‌సీలు పూర్తి చేయకపోతే, ఈ సంస్థలపై ఫైన్ పడుతుంది. కార్డును క్లోజ్ చేసేంత వరకు రోజుకి రూ. 500 పెనాల్టీగా కస్టమర్‌‌‌‌కు చెల్లించాల్సి ఉంటుంది. 
4) కస్టమర్‌‌‌‌ తన క్రెడిట్‌‌కార్డును ఏడాది పాటు వాడకపోతే,   క్రెడిట్‌‌కార్డును ఇష్యూ చేసిన సంస్థ ఈ కార్డును క్లోజ్‌‌ చేయాల్సి ఉంటుంది. మొదట ఆ కస్టమర్‌‌‌‌కు కార్డు గురించి నోటిఫై చేయాలి. 30 రోజుల్లోపు ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే క్రెడిట్‌‌కార్డును క్లోజ్ చేయాలి. క్రెడిట్‌‌కార్డును క్యాన్సిల్ చేసిన విషయాన్ని క్రెడిట్‌‌ ఇన్‌‌ఫర్మేషన్ కంపెనీ దగ్గర 30 రోజుల్లోపు అప్‌‌డేట్  చేయాలి. 
5)  కార్డు హోల్డర్‌‌‌‌ అకౌంట్స్‌‌లో క్రెడిట్ అమౌంట్ మిగిలి ఉంటే, క్రెడిట్‌‌కార్డును క్లోజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్‌‌ కార్డు హోల్డర్ బ్యాంక్ అకౌంట్‌‌కు ట్రాన్స్‌‌ఫర్ చేయాలి. క్రెడిట్‌‌కార్డును ఇష్యూ చేసిన కంపెనీల దగ్గర కార్డు హోల్డర్ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ లేకపోతే  ఈ డిటైల్స్‌‌ను కచ్చితంగా 
తెలుసుకోవాలి.
అనుమతి ఉంటే ఎన్‌‌బీఎఫ్‌‌సీలూ కార్డులను ఇష్యూ చేయొచ్చు..
ఆర్‌‌‌‌బీఐ విడుదల చేసిన మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారం, ఆర్‌‌‌‌బీఐ అనుమతి లేకుండా ఎన్‌‌బీఎఫ్‌‌సీలు క్రెడిట్‌‌ కార్డులను ఇష్యూ చేయడానికి వీలులేదు. ‘ఆర్‌‌‌‌బీఐ నుంచి అనుమతులు లేకుండా డెబిట్‌‌కార్డ్‌‌, క్రెడిట్ కార్డ్‌‌ లేదా ఇలాంటి ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌‌లను వర్చువల్‌‌గా లేదా ఫిజికల్‌‌గా ఎన్‌‌బీఎఫ్‌‌సీలు ఇష్యూ చేయడానికి కుదరదు’ అని ఆర్‌‌‌‌బీఐ ప్రకటించింది.  కో–బ్రాండింగ్ కార్డులను ఇష్యూ చేసేటప్పుడు కూడా కార్డులను సొంతంగా ఇష్యూ చేస్తున్నట్టు ప్రచారం చేసుకోకూడదు. పార్టనర్‌‌‌‌ బ్యాంక్‌‌ పేరు క్లియర్‌‌‌‌గా కనిపించేలా క్రెడిట్‌‌ కార్డులను ప్రచారం చేసుకోవాలి.  కాగా,   రూ.100 కోట్లు కంటే ఎక్కువ బిజినెస్‌‌ చేసే కమర్షియల్ బ్యాంకులు మాత్రమే క్రెడిట్‌‌ కార్డు బిజినెస్‌‌ను చేయడానికి వీలుంటుంది. ఇటువంటి బ్యాంకులు సొంతంగా లేదా వేరే కంపెనీతో కలిసి క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయొచ్చు. 
రీజనల్‌‌ రూరల్ బ్యాంకులు తమ  స్పాన్సర్‌‌‌‌ బ్యాంక్ లేదా పార్టనర్‌‌‌‌ బ్యాంక్‌‌తో క్రెడిట్ కార్డులను ఇష్యూ చేయొచ్చు.  కస్టమర్ల అనుమతి లేకుండా కొత్తగా క్రెడిట్‌‌ కార్డులను ఇష్యూ చేయడం లేదా ఉన్న కార్డులను అప్‌‌గ్రేడ్ చేయడం వంటివి చేయకూడదని ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది. ఇలా చేసిన సంస్థలపై పెనాల్టీ పడుతుందని వివరించింది.  క్రెడిట్‌‌ కార్డు బకాయిలను వసూలు చేసేటప్పుడు కస్టమర్లను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకూడదని తెలిపింది.  ముఖ్యంగా థర్డ్ పార్టీ ఏజెంట్లను పెట్టి  బకాయిలను వసూలు చేసేటప్పుడు  ఏజెంట్లు కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదని వివరించింది.