
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెల్లడించిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. నోటిఫికేషన్ ఈ నెల 9న వస్తుందన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫేజ్ 1కు సంబంధించి 9 నుండి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 12న పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటల తరువాత నామినేటెడ్ అభ్యర్థుల జాబిత విడుదల చేస్తామన్నారు. 13న అప్పీళ్లు, 14 న అప్పీళ్ల పరిష్కారం, 15న నామినేషన్ల ఉపసంహరణ, ఫైనల్ లిస్టు విడుదల చేస్తామన్నారు. సర్పంచ్ ఫేజ్ -1 ఎన్నికలకు సంబంధించి 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న ఉపసంహరణ, అదే రోజు ఫైనల్ లిస్టు విడుదల చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్మోహన్ పాల్గొన్నారు.