సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌  టు యూట్యూబర్‌‌

సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌‌‌‌  టు యూట్యూబర్‌‌

బాగా చదువుకున్నాడు. మంచి జాబ్​ కొట్టాడు. కానీ.. సంతృప్తి లేదు. అందుకే యూట్యూబ్‌‌లోకి ఎంటరయ్యాడు. అమెరికాలో ఉద్యోగం వదిలి.. బ్లాగ్స్ రాయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇండియాలోనే ఫేమస్‌‌ యూట్యూబర్, బ్లాగర్‌‌‌‌గా ఎదిగాడు అరుణ్ ప్రభుదేశాయ్. ప్రస్తుతం ఆరు యూట్యూబ్‌‌ ఛానెల్స్​ రన్ చేస్తున్నాడు. 

అరుణ్ ప్రభుదేశాయ్ ఇండియాలోనే ఫేమస్ సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సర్. 2011లో ‘‘ట్రాకిన్ టెక్” పేరుతో యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ను మొదలుపెట్టాడు. ట్రాకిన్ టెక్‌‌ (Trakin Tech)కు ప్రస్తుతం 11 మిలియన్లకుపైగా సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. సోషల్‌‌ మీడియాలో కూడా కొన్ని లక్షల మంది ఫాలోవర్లతో ఇండియాలో లీడింగ్‌‌ టెక్‌‌ ట్యూబర్‌‌‌‌గా అరుణ్ గుర్తింపు పొందాడు. 

కెరీర్​ వదులుకుని...
అరుణ్ ప్రభుదేశాయ్ పుణెలో పుట్టి, పెరిగాడు. అక్కడే స్టెల్లా మారిస్ హైస్కూల్‌‌లో  చదువుకున్నాడు. 1992లో ఇంటర్ పూర్తి కాగానే ముంబైలోని డీవై పాటిల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌‌లో బీటెక్‌‌ చేశాడు. 2000 సంవత్సరం వరకు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్నెట్ సర్వీసెస్‌‌ మేనేజర్‌‌గా పనిచేశాడు. ఛానెల్‌‌కు ముందు అతను రెండు సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కంపెనీలను కూడా పెట్టాడు. చివరగా అరుణ్ 2007లో అమెరికాలో సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కన్సల్టెన్సీ కెరీర్‌‌‌‌ వదులుకుని ఇండియా వచ్చాడు. 2011లో యూట్యూబర్‌‌గా మారాడు. ట్రాకిన్‌‌ టెక్‌‌ ఛానెల్‌‌లో స్మార్ట్‌‌ఫోన్లు, గాడ్జెట్ రివ్యూలు, అన్‌‌బాక్సింగ్ వీడియోలు, బ్రేకింగ్ టెక్ స్టోరీస్, టెక్ న్యూస్‌‌ వీడియోలు పోస్ట్‌‌ చేస్తుంటాడు. 

ట్రాక్‌‌–ఇన్‌‌ గురించి.. 
అరుణ్​ యూట్యూబ్‌‌ ఛానెల్‌‌ని స్టార్ట్‌‌ చేయడానికి ముందే Trak.in పేరుతో ఒక పోర్టల్‌‌ని మొదలుపెట్టాడు. ఇది ఇండియాలోనే ఫేమస్‌‌ బిజినెస్‌‌, టెక్నాలజీ న్యూస్‌‌ బ్లాగ్‌‌గా గుర్తింపుపొందింది. దీనిని మే 1, 2007న మొదలుపెట్టాడు. అప్పటి నుండి ఈ పోర్టల్‌‌లో  20 వేలకు పైగా న్యూస్‌‌ స్టోరీస్‌‌, బ్లాగులు, ఒపీనియన్స్‌‌ పోస్ట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ఇందులోని బ్లాగ్స్‌‌ని చదువుతున్నారు. ఈ పోర్టల్‌‌లో ఎక్కువగా గవర్నమెంట్‌‌ పాలసీలు, స్టాక్ మార్కెట్, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్‌‌, స్టార్టప్‌‌లు, మొబైల్ ఎకో సిస్టమ్‌‌, ఇండియన్‌‌ రైల్వేస్‌‌, స్మార్ట్‌‌ఫోన్‌‌లు, గాడ్జెట్స్‌‌, ఇన్నొవేషన్స్‌‌ గురించి బ్లాగ్స్ పోస్ట్ చేస్తుంటారు. వీటితోపాటు టెక్ డొమైన్‌‌లోని వార్తలు కూడా పోస్ట్ చేస్తుంటారు.