క‌రోనా పేషెంట్ల‌కు సేవ‌లందిస్తూ‌ డాక్ట‌ర్ మృతి.. ఇంటికెళ్లి రూ. కోటి సాయ‌మందించిన‌ ఢిల్లీ సీఎం

క‌రోనా పేషెంట్ల‌కు సేవ‌లందిస్తూ‌ డాక్ట‌ర్ మృతి.. ఇంటికెళ్లి రూ. కోటి సాయ‌మందించిన‌ ఢిల్లీ సీఎం

క‌రోనా వార్డులో సేవ‌లందిస్తూ.. ఆ మ‌హమ్మారి బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయిన డాక్ట‌ర్ కుటుంబానికి కోటి రూపాయ‌ల సాయం అందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. శుక్ర‌వారం నేరు ఆ వైద్యుడి ఇంటికెళ్లి స్వ‌యంగా ఆయ‌నే చెక్ అంద‌జేశారు. ఆ ప్ర‌జా వైద్యుడిని వెన‌క్కి తీసుకురాలేమ‌ని, అయితే ఆయ‌న కుటుంబానికి త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.

ఢిల్లీలోని లోకనాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ హాస్పిట‌ల్‌లో అన‌స్తీషియాల‌జిస్ట్‌గా పని చేసేవారు 52 ఏళ్ల‌ అసీమ్ గుప్తా. అక్క‌డ క‌రోనా వార్డులోని పేషెంట్ల‌కు చికిత్స అందించ‌డంలో ఆయ‌న‌ది కీల‌క పాత్ర‌. క‌రోనాతో ఊపిరాడ‌క ఆరోగ్య విష‌మించే స‌మ‌యంలో వెంటిలేట‌ర్ పెట్టాలంటే.. అన‌స్తీషియా వైద్యుడు ఉండాల్సిందే. నేరుగా పేషెంట్లతో కాంటాక్ట్ ఉండే జాబ్ కావ‌డంతో దుర‌దృష్టవ‌శాత్తు డాక్ట‌ర్ అసీమ్ గుప్తాకు వైర‌స్ సోకింది. జూన్ 6న ఆయ‌న‌కు కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. తొలుత మైల్డ్ సింప్ట‌మ్స్ ఉండ‌డంతో క్వారంటైన్‌లోకి వెళ్లారు. అయితే త‌ర్వాతి రోజుకే గుప్తా ఆరోగ్యం విష‌మించింది. దీంతో ఆయ‌న ప‌ని చేసే ఆస్ప‌త్రిలోనే ఐసీయూకి మార్చారు. ప‌రిస్థితి మ‌రింత క్షీణించ‌డంతో ఢిల్లీ సాకేత్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆయ‌న ప్రాణాల‌ను కోల్పోయారు.

క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు రూ.కోటి ప‌రిహారం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో సీఎం కేజ్రీవాల్ శుక్ర‌వారం ఉద‌యం డాక్ట‌ర్ అసీమ్ గుప్తా ఇంటికి వెళ్లి దానికి సంబంధించిన చెక్ అందించారు. ఈ సంద‌ర్భంగా అసీమ్‌కు నివాళి అర్పించిన ఆయ‌న.. కుటుంబ‌స‌భ్యుల‌కు సానుభూతి తెలిపారు. త‌న సేవ‌ల‌తో ప్ర‌జా వైద్యుడిగా పేరు పొందిన డాక్ట‌ర్ గుప్తాను వెన‌క్కి తీసుకుని రాలేమ‌ని, కానీ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తే ప్రాణాల‌ను అర్పించిన వారికి అండ‌గా నిల‌వ‌డం ప్ర‌భుత్వ బాధ్య‌త అని చెప్పారు.