అమెరికాలో ఆగని అల్లర్లు…

అమెరికాలో ఆగని అల్లర్లు…

వాషింగ్టన్‌‌‌‌: ‘ఐ కాంట్ ‌‌‌‌బ్రీత్‌‌‌‌’.. పోలీసు కాళ్ల కింద నలుగుతూ జార్జ్ ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ చెప్పిన చివరి మాట ఇది. ఇప్పుడు నినాదమైంది. అమెరికా వీధుల్లో మారుమోగుతోంది. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నా.. రబ్బర్ బుల్లెట్లతో కాలుస్తున్నా.. కర్ఫ్యూ విధించినా.. ఎమర్జెన్సీ ప్రకటించినా.. వేల మందిని అరెస్టు చేస్తున్నా ఈ నినాదం ఆగడం లేదు. ఇంకా పెరుగుతోంది. ఒక చోట మొదలైన ప్రొటెస్టులు మొత్తం అమెరికాకు వ్యాపించాయి. రాజధాని వాషింగ్టన్​నూ వదల్లేదు. ఆందోళనలు పెరగడంతో చివరికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ‌‌‌‌ట్రంప్‌‌‌‌కూడా ఓ బంకర్​లో తలదాచుకున్నారు. 1968లో మార్టిన్‌‌‌‌లూథర్ ‌‌‌‌కింగ్‌‌‌‌ హత్య తర్వాత మాత్రమే ఈ స్థాయి ఆందోళనలు జరిగాయని ‘న్యూయార్క్‌‌‌‌టైమ్స్‌‌‌‌’ రాసిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలేం జరిగింది?

మినియా పొలిస్‌‌‌‌సిటీలో మే 25న సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఓ షాపులో జార్జ్ ఫ్లాయిడ్ ఓ సిగరెట్ ప్యాకెట్ కొని.. 20 డాలర్ల నోటు ఇచ్చాడు. అయితే షాపులో పని చేసే ఉద్యోగికి ఆ నోటును నకిలీదని డౌట్ వచ్చింది. దీంతో పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడికి వచ్చిన పోలీసులు ఫ్లాయిడ్​ను రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చారు. డెరెక్ షావిన్ అనే ఓ తెల్ల జాతి పోలీస్ ఆఫీసర్.. ఫ్లాయిడ్‌‌‌‌మెడపై మోకాలితో బలంగా తొక్కిపట్టి కూర్చున్నారు. ‘ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు’ అంటూ జార్జ్ మొరపెట్టుకున్నాడు. అయినా డెరెక్ వినిపించుకోలేదు. దీంతో కొద్దిసేపటికి జార్జ్ స్పృహ కోల్పోయాడు. దాదాపు 8 నిమిషాల తర్వాత ఫ్లాయిడ్ మెడపై నుంచి షావిన్ తన మోకాలిని పక్కకు జరిపారు. ఏ కదలికలూ లేకుండా పడి ఉన్న ఫ్లాయిడ్‌‌‌‌ను దగ్గర్లోని మెడికల్ సెంటర్‌‌‌‌కు అంబులెన్స్‌‌‌‌లో తరలించారు. అయితే అప్పటికే ఫ్లాయిడ్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఫ్లాయిడ్ మెడపై మోకాలితో నొక్కిపెట్టిన వీడియో మీడియాలో వైరల్ అయ్యింది.

మినియా పొలిస్‌‌‌‌లో మొదలు

ఫ్లాయిడ్ చనిపోవడంతో మినియా పొలిస్‌‌‌‌లో తొలుత నిరసనలు మొదలయ్యాయి. తర్వాత దేశమంతా వ్యాపించాయి. ఇప్పటికే వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం (అక్కడి టైం ప్రకారం) వైట్ ‌‌‌‌హౌస్‌‌‌‌దగ్గర ప్రదర్శన చేస్తున్న వారిని పోలీసులు తరిమికొట్టారు. వారిపై టియర్‌‌‌‌‌‌‌‌గ్యాస్‌‌‌‌ఉపయోగించి చెదరగొట్టారు. అంతకుముందు ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కొద్దిసేపు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లోని బంకర్‌‌‌‌లో దాక్కున్నారు. వాషింగ్టన్ డీసీలో కొన్ని అల్లర్లు చెలరేగాయి. వైట్‌‌‌‌హౌస్‌‌‌‌కు సమీపంలోని భవనాలు దాడులకు గురయ్యాయి. న్యూయార్క్, షికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్, హూస్టన్ తదితర నగరాల్లో నిరసనకారులు పోలీసులతో గొడవలకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ బుల్లెట్లు ప్రయోగించారు. అట్లాంటా, బోస్టన్, మయామి, ఓక్లహామా సిటీల్లోనూ భారీ నిరసనలు జరిగాయి.

150 సిటీల్లో ఆందోళనలు

వాషింగ్టన్ సహా కనీసం 150 సిటీల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆరుకుపైగా రాష్ర్టాలు, 13పైగా ప్రధాన సిటీల్లో ఎమర్జెన్సీ విధించారు. 40కి పైగా సిటీల్లో కర్ఫ్యూ విధించారు. అమెరికాలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వినియోగించే ‘నేషనల్ గార్డ్’ తమ సిబ్బందిలో 67 వేల ట్రూప్స్​ను రంగంలోకి దింపింది. ప్రొటెస్టుల్లో కనీసం ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు కాల్పులు చనిపోయినట్లు అధికారులుచెప్పారు. 4 వేల మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

హూస్టన్​లో భారీ ర్యాలీ

జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా హూస్టన్​లో మంగళవారం (అక్కడి టైం ప్రకారం) జరిగే ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొననున్నారు. హూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, సిటీ పోలీస్ చీఫ్ ఆర్ట్ అకెవెడో కూడా ర్యాలీలో పాల్గొననున్నారు. ఈనెల 9న ఫ్లాయిడ్ అంత్యక్రియలు హూస్టన్​లోనే జరగనున్నాయి. అంత్యక్రియలకు కొన్ని వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. లెజెండరీ బాక్సర్ మే వెదర్ కూడా హాజరవుతారని సమాచారం. మరోవైపు అట్లాంటా మేయర్ కీయిషా లాన్స్ బాటమ్స్, చికాగో మేయర్ లోరి లైట్​ఫుట్, రోచెస్టర్ మేయర్ లవ్​లీ వారెన్, శాన్ ఫ్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్, వాషింగ్టన్ మేయర్ మురియల్ బోసెర్ తదితరులు ప్రొటెస్టులకు సపోర్ట్ తెలిపారు.

ఫ్లాయిడ్​ది హోమిసైడ్’!

జార్జి ఫ్లాయిడ్​ది హత్యేనని అధికారిక పోస్ట్​మార్టం రిపోర్టులో వెల్లడైంది. జార్జ్ చనిపోయిన తీరును బట్టి హోమిసైడ్(నర హత్య)​ అని మినియాపొలిస్‌‌లోని హెన్నెపిన్ కౌంటీ డాక్టర్లు పేర్కొన్నారు. మెడను మోకాలితో గట్టిగా నొక్కి పెట్టడం వల్ల ఊపిరాడక గుండె ఆగి మరణించాడని రిపోర్టులో వెల్లడించారు. ఇందుకు కారణమైన డెరెక్​పై థర్డ్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. వచ్చే వారంలో అతడిని కోర్టులో హాజరు పరచనున్నారు. అతడితోపాటు ఉన్న మిగతా ముగ్గురు ఆఫీసర్లను ఉద్యోగం నుంచి తొలగించారు.