బలముంటే ఓడించాలి.. అంతేగానీ అడ్డుపడకూడదు

బలముంటే ఓడించాలి..  అంతేగానీ అడ్డుపడకూడదు

న్యూఢిల్లీ:  నియమ, నిబంధలనకు అనుగుణంగా పార్లమెంటు ఎగువ‌స‌భ‌ను నడుపుతూ సభా గౌరవాన్ని కాపాడటం తన ధర్మమని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొందరు సభ్యులపై సస్పెన్షన్ విధింపు బాధాకరమే అయినప్పటికీ.. సభా నియమాలను ఉల్లంఘించడమే కాకుండా సభా మర్యాదాలను కాలరాసిన వారి విషయంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన స్పష్టం చేశారు. అనుకున్న కాలపరిమితి కంటే ఎనిమిది రోజుల ముందే రాజ్యసభను నిరవధిక వాయిదా వేసే ముందు చైర్మన్ సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. తమ నిరసనను తెలియజేసే హక్కు విపక్షాలకు ఉంటుందని అయితే ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారనే విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

మూడు శ్రామిక చట్టాలను ఆమోదించవద్దంటూ విపక్షనేత గులాంనబీ ఆజాద్, ఇతర సభ్యులు రాసిన లేఖను ఉటంకిస్తూ.. సభ చరిత్రలో సభ్యులు కార్యక్రమాలను బహిష్కరించినపుడు, వాకౌట్ చేసినపుడు కూడా సభాకార్యక్రమాలు యథావిధిగా జరగడం, వివిధ బిల్లులు ఆమోదం పొందిన సందర్భాలను గుర్తుచేశారు.

2013లో సభ్యుల సభా బహిష్కరణ నేపథ్యంలోనూ ఆర్థిక బిల్లు, వినియోగ బిల్లుల ఆమోదం పొందిన విషయాన్ని చైర్మన్ ప్రస్తావించారు. ఈ మూడు శ్రామిక బిల్లులను వాయిదా వేయాలని లేఖలో కోరారని, ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చించి ఉంటే బాగుండేదన్నారు. సభ్యులు సస్పెండ్ కావడం, ఆ తర్వాత బిల్లులు పాస్ కావడం, సభను బాయ్ కాట్ చేయడం అనే అంశాలు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం కాదని, గతంలో కూడా జరిగాయని, అయితే ఇలా జరగడం మాత్రం అభినందనీయం కాదని పేర్కొన్నారు. ‘నిబంధనల ప్రకారం బిల్లులకు ప్రాధాన్యత ఉంటుందని నచ్చకపోతే వ్యతిరేకించాలి, బలముంటే ఓడించాలి లేదంటే మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఇది ప్రజాస్వామ్య మూలసూత్రం. అంతేగానీ అడ్డుపడకూడదు’ అని చైర్మన్ తెలిపారు.

రాజ్యసభతో 22 ఏళ్ల అనుబంధం ఉందన్న చైర్మన్, అనేక సందర్భాల్లో గందరగోళం మధ్యలో బిల్లులు ఆమోదం పొందినపుడు ఆవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా ఇలాంటివి చూస్తుంటే మరింత బాధ కలుగుతోందన్నారు. కళ్లముందు జరుగుతున్న ఘటనలపై నిస్సహాయత వ్యక్తం చేస్తూ.. తప్పనిసరి పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. కర్తవ్యాన్ని నిర్వహించడం చైర్మన్‌గా తన బాధ్యతని.. బాధ్యతలనుంచి వైదొలగడం తన నైజం కాదన్నారు.