బీజేపీ బలపడే కొద్దీ.. కేసీఆర్‌‌కు చెమటలు పడుతున్నయ్

బీజేపీ బలపడే కొద్దీ.. కేసీఆర్‌‌కు చెమటలు పడుతున్నయ్

అందుకే భారత్ బంద్‌‌కు మద్దతిచ్చారు: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతున్న కొద్దీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో రైతుల ధర్నాలపై ఇప్పటివరకు స్పందించని ఆయన.. గ్రేటర్ లో బీజేపీ గెలవడంతో ఒక్కసారిగా నిద్రలేచి భారత్ బంద్ కు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్ వచ్చిన ఆయన.. బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణలో బీజేపీ బలపడే కొద్దీ.. కేసీఆర్ కు చెమటలు పడుతున్నయి. అందుకే రాత్రికి రాత్రి బంద్ కు మద్దతు ప్రకటించారు. బంద్ లో పాల్గొనాలని టీఆర్ఎస్ క్యాడర్ కు పిలుపునిచ్చారు’ అని అన్నారు.

తమ ఆందోళనలో రాజకీయ పార్టీలను అనుమతించబోమని రైతులు స్పష్టంగా చెప్తున్నా.. విపక్షాలు ఇందులో దూరి రైతులను భ్రమలో ఉంచాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రులు రైతులతో చర్చిస్తున్నారని, త్వరలోనే పరిష్కారం వస్తుందని అన్నారు. గతంలో ఇలాంటి చట్టాలు ఉండాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు సోనియా,  రాహుల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..  ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని, దీనికి వారు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల మేలు కోరి ఈ చట్టం తీసుకొస్తే.. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు.  మధ్యప్రదేశ్‌కు వడ్లు అమ్మడానికి వస్తే అరెస్టు చేస్తానని తాను ఎప్పుడూ అనలేదన్నారు. రీసైకిల్ చేసి అమ్మేవారిని ఉద్దేశించి తాను ఆ కామెంట్స్ చేసినట్టు చెప్పారు. రైతులు తాము  పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు.