పొగమంచు, పొల్యూషన్ తో ఆస్తమా.. అలర్జీ

పొగమంచు, పొల్యూషన్ తో ఆస్తమా.. అలర్జీ

పొగమంచు, పొల్యూషన్ తో ఆస్తమా.. అలర్జీ
పెద్దవాళ్లతో పాటు పిల్లల్లోనూ ఈ సమస్యలు
ఎర్రగడ్డ చెస్ట్ ​హాస్పిటల్​లో పేషెంట్ల క్యూ

హైదరాబాద్, వెలుగు : సిటీలో రోజురోజుకు చలి ఎక్కువవుతోంది. దీంతో అలర్జీలు, ఆస్తమా లాంటి వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. పొగమంచు, పొల్యూషన్ కలిసి ఏర్పడే ఫాగ్ వల్ల చర్మ వ్యాధులు, లంగ్స్‌‌‌‌ సమస్యలు ఎక్కువవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఆస్తమా ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని, వారు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఈ తరహా సమస్యలతో చెస్ట్ హాస్పిటల్‌‌‌‌కు వెళ్తున్న వారి సంఖ్య రెట్టింపవుతోంది. అలర్జీ క్లినిక్‌‌‌‌తో పాటు గురు, శుక్ర, శనివారాల్లో చూసే స్పెషాలిటీ క్లినిక్ ఓపీకి కూడా పేషెంట్ల తాకిడి పెరిగిందని డాక్టర్లు చెప్తున్నారు.

చిన్నారులకు సీజనల్ ఇన్ ఫెక్షన్లు

ఉదయం పూట శివారు ప్రాంతాలు పొగమంచుతో నిండిపోతున్నాయి. దీనికి విపరీతమైన పొల్యూషన్ తోడవడంతో సిటిజన్లు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సీజన్​లో వైరస్ వ్యాప్తి తొందరగా జరిగి వైరల్ జ్వరాలతో పాటు జలుబు, తలనొప్పి, సైనస్ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నారుల్లో  అలర్జీలు వచ్చే అవకాశం ఉందని, అలర్ట్​గా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. సీజనల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, తలనొప్పి, చెవుల్లో నుంచి చీము రావడం, శ్వాస సంబంధిత సమస్యలతో హాస్పిటళ్లకు వెళ్తున్న పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. పెద్దవాళ్లు జలుబు, తలనొప్పి, ఆస్తమా, దమ్ముతో ఎక్కువగా వస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. 

జాగ్రత్త అవసరం..

మార్నింగ్‌‌‌‌, ఈవెనింగ్‌‌‌‌ ఏర్పడే ఫాగ్‌‌‌‌తో శ్వాస సంబంధిత సమస్యల బారిన పడుతున్నవారు ఎక్కువవుతున్నారు. ఆస్తమా, అలర్జీ సమస్యలతో బాధపడే చాలా మంది ట్రీట్​మెంట్​ కోసం ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్​కు క్యూ కడుతున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా పేషెంట్స్‌‌‌‌ అంతగా లేరని, ప్రస్తుతం పెరిగారని డాక్టర్లు పేర్కొంటున్నారు. చిన్న పిల్లల్లో స్కిన్‌‌‌‌ అలర్జీలు, ఫుడ్ వల్ల ఏర్పడే సమస్యలు, ఉబ్బసం వంటివి బయటపడుతున్నాయని, ఇవి ఎక్కువగా దుమ్ము, పొగ వల్ల వస్తున్నాయని చెప్తున్నారు. కాగా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

పేషెంట్ల సంఖ్య పెరిగింది

ఈ మధ్యకాలంలో ఆస్తమా, అలర్జీ కేసులు పెరిగాయి. దీంతో ఓపీకి వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అలర్జీ క్లినిక్‌‌‌‌తో పాటు సాధారణ ఓపీకి కూడా పేషెంట్ల తాకిడి ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడుతూ వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. వారికి మెడికేషన్ ఇచ్చి పంపిస్తున్నాం.
- డాక్టర్ నళిని, అలర్జీ క్లినిక్, చెస్ట్ హాస్పిటల్ 

వింటర్ మొదలైనప్పటి నుంచి..

వింటర్ మొదలైనప్పటి నుంచి రోజూ వారీ ఓపీ కేసులు పెరిగిపోయాయి. రోజుకు 1500కు పైనే ఓపీ ఉంటోంది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి పేషెంట్లు వచ్చి క్యూలైన్లలో ఉంటున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలకు ఏర్పాటు చేసిన వేర్వేరు బ్లాక్​లు నిండిపోతున్నాయి. వెదర్​లో మార్పులు, అధిక చలి వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లతో పేషెంట్లు హాస్పిటల్ బాట పడుతున్నారు.
‌‌‌‌‌‌‌‌- డాక్టర్  టి.శంకర్, సూపరింటెండెంట్, ఈఎన్టీ హాస్పిటల్, కోఠి