కాలువ నీళ్లు కష్టమే.. నడిగడ్డలో ప్రాజెక్టులన్నీ ఖాళీ

కాలువ నీళ్లు కష్టమే.. నడిగడ్డలో ప్రాజెక్టులన్నీ ఖాళీ
  •     ఇక బోర్లు, బావుల కిందే రబీ సాగు
  •     త్వరలోనే ఆఫీసర్ల నుంచి క్లారిటీ వచ్చే ఛాన్స్

గద్వాల, వెలుగు: నడిగడ్డలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో రబీ పంటలకు కాలువ నీళ్లు కష్టమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇరిగేషన్  ఆఫీసర్లు నీటి నిల్వలపై రిపోర్టు ఇచ్చి ఈసారి నీళ్లు ఇవ్వలేమని చెప్పడంతో, రైతులకు అవగాహన కల్పించేందుకు అగ్రికల్చర్  ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. త్వరలో జరిగే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

నడిగడ్డలోని జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ లో సరైన నిల్వలు లేకపోవడంతో సాగు నీరు ఇవ్వలేమని ఆఫీసర్లు చెబుతున్నారు. వానాకాలం పంటను కాపాడుకునేందుకే ఈ ఏడాది ఖరీఫ్ లో వార బందీ కింద సాగునీరు ఇచ్చారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద అసలే నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది.

నెట్టెంపాడు ప్రాజెక్టులోని అతి పెద్ద రిజర్వాయర్  అయిన ర్యాలంపాడు బుంగలు పడ్డా, రిపేర్లు చేయించకపోవడంతో నాలుగు టీఎంసీలకు గాను 2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుతున్నారు. వానాకాలం పంటకే నీళ్లు అయిపోవడంతో ప్రస్తుతం 0.6 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెట్టెంపాడు కింద రబీకి నీళ్లు ఇవ్వలేమని స్పష్టంగా చెబుతున్నారు. ఆర్డీఎస్  ఆయకట్టుకు నీరు ఇవ్వాలని తుమ్మిళ్ల లిఫ్ట్  స్టార్ట్ చేసినా, దాని కింద రిజర్వాయర్లు నిర్మించకపోవడంతో వానాకాలంలోనే సగం పంటలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. తుంగభద్ర నదిలో నీటి లెవెల్  తగ్గిపోవడంతో నీళ్లు అందించలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

రెండేండ్లుగా రిపేర్లు చేస్తలే..

నెట్టెంపాడు లిఫ్ట్​లో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రిజర్వాయర్​కు బుంగలు పడి రెండేండ్లవుతున్నా రిపేర్లు చేయకపోవడంతో 2 టీఎంసీలు మాత్రమే నీటిని నిల్వ చేస్తున్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో జూరాల నుంచి నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది. సకాలంలో రిపేర్లు చేయకపోవడంతో1.36 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జూరాల ప్రాజెక్టులో 5 టీఎంసీలు ఉండగా, తాగునీటికి మాత్రమే సరిపోతాయని అంటున్నారు. ఇక తుంగభద్రలో నీటి నిల్వలు లేకపోవడం, రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టకపోవడంతో ఆర్డీఎస్ రైతులకు కష్టాలు తప్పడం లేదు. 

త్వరలో ఐఏబీ మీటింగ్..

ఇదిలాఉంటే త్వరలో ఇరిగేషన్  అడ్వైజరీ బోర్డ్  మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆ మీటింగ్ లో నీటి విడుదలపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, అయితే నీటి నిల్వలు తక్కువగా ఉన్న మాట వాస్తవమేనన్నారు. నెట్టెంపాడు లిఫ్ట్  పరిధిలోని ఆయకట్టుకు రబీలో నీరు ఇవ్వలేమని, ఈసారి రబీలో క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని ఇరిగేషన్​ ఈఈ​వెంకటేశ్వరరావు తెలిపారు. 

3 లక్షల ఎకరాలపై ఎఫెక్ట్..

జూరాల ప్రాజెక్టు కింద 1.02 లక్షల ఎకరాలకు, ఆర్డీఎస్ కింద 84,500 ఎకరాలకు, నెట్టెంపాడు కింద 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ర్యాలంపాడు రిజర్వాయర్  రిపేర్లు చేయకపోవడంతో ఈసారి రబీలో పూర్తిగా నీళ్లు ఇవ్వలేమని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆర్డీఎస్​ కింద రైతులు కూడా ఆశలు వదులుకున్నారు.

జూరాల కింద నీళ్లు వస్తాయని భావించినా అధికారులు నీటి నిల్వలు లేవని చెబుతుండడంతో ఈ మూడు ప్రాజెక్టుల కింద 3 లక్షల ఎకరాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. తాగునీటి అవసరాల కోసం జములమ్మ రిజర్వాయర్  వరకు కాలువలకు నీళ్లిస్తే 12 వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉందంటున్నారు.