మెదడులేని దద్దమ్మలు.. తెలివిలేని జోకర్‌‌‌‌గాళ్లు.. పాక్‌‌ ఆర్మీని ఉద్దేశించి అసదుద్దీన్‌‌ ఒవైసీ సెటైర్‌‌‌‌

మెదడులేని దద్దమ్మలు.. తెలివిలేని జోకర్‌‌‌‌గాళ్లు..  పాక్‌‌ ఆర్మీని ఉద్దేశించి అసదుద్దీన్‌‌ ఒవైసీ సెటైర్‌‌‌‌

న్యూఢిల్లీ: వాళ్లు కనీసం సరైన ఫొటోను కూడా బహూకరించలేని జోకర్లని పాకిస్తాన్‌‌ ఆర్మీనుద్దేశించి ఎంఐఎం చీఫ్‌‌ అసదుద్దీన్‌‌ ఒవైసీ సెటైర్‌‌‌‌ వేశారు. భారత్‌‌పై విజయం సాధించామంటూ 2019లో చైనావాళ్లు చేసిన సైనిక విన్యాసానికి సంబంధించిన ఫొటోను పాక్‌‌ ఆర్మీ చీఫ్‌‌ అసిమ్‌‌ మునీర్‌‌‌‌.. వాళ్ల ప్రధాని షరీఫ్‌‌కు బహూకరించారని అసద్‌‌ గుర్తుచేశారు. ప్రధానికి ఇస్తున్న ఫొటో ఏంటోకూడా తెలియని ఆ మెదడులేని మూర్ఖులు భారత్‌‌తో పోటీపడాలని కలలు కంటున్నారని అసద్‌‌ ఎద్దేవా చేశారు. 

విదేశాల్లో పర్యటిస్తున్న భారత ఎంపీల బృందంలో ఉన్న ఒవైసీ మంగళవారం కువైట్‌‌లో ఏర్పాటు చేసిన ఇండియన్‌‌ కమ్యూనిటీతో భేటీ అయ్యారు. ‘‘మనం చిన్నతనంలో నకల్‌‌ కర్నేకే లియే అకల్‌‌ చాహియే అని వినేవాళ్లం. అంటే కాపీ కొట్టాలన్నా కాస్త తెలివి ఉండాలని అర్థం. పాకిస్తాన్‌‌ పనికిమాలినోళ్లకు ఆ తెలివికూడా లేదు”అని అసద్‌‌ అన్నారు. పాక్‌‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని, భారత్‌‌పై విజయం సాధించామని తప్పుడు ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.