Asian Games 2023: ఫోర్లు, సిక్సర్ల సునామీ.. ఏషియన్‌ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం

Asian Games 2023: ఫోర్లు, సిక్సర్ల సునామీ.. ఏషియన్‌ గేమ్స్‌లో మరో విధ్వంసకర శతకం

ఏషియన్‌ గేమ్స్ ముగిసేలోపు.. అంతర్జాతీయ క్రికెట్‌లోఅగ్రశ్రేణి జట్లు నెలకొల్పిన పలు రికార్డులు కనుమరుగయ్యే వకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం నేపాల్ జట్టు సృష్టించిన ఫోర్లు, సిక్సర్ల సునామీ మరవక ముందే మరోసారి అలాంటి ఇన్నింగ్స్ చోటుచేసుకుంది. ఈసారి మలేషియా జట్టు అందుకు కారణమైంది. ఆ జట్టు ఓపెనర్ సయ్యద్‌ అజీజ్‌.. ప్రత్యర్ధి థాయ్‌లాండ్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 56 బంతుల్లో 13 ఫోర్లు, 9 సిక్సర్లతో సాయంతో126 పరుగులు చేశాడు. 

అజీజ్‌తో పాటు ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ముహమ్మద్‌ అమీర్‌ (55; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విరన్‌దీప్‌ సింగ్‌ (30 నాటౌట్‌; 12 బంతుల్లో 4 సిక్సర్లు) కూడా విజృంభించడంతో మలేషియా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. అజీజ్‌ సెంచరీ అంతర్జాతీయ టీ20ల్లో 12వ ఫాస్టెస్ట్‌ సెంచరీ కాగా.. మలేషియా జట్టు స్కోర్‌ అంతర్జాతీయ టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్‌.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన మలేషియా 268 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. లక్ష్య ఛేదనలో థాయ్‌లాండ్‌ 74 పరుగులకే కుప్పకూలింది. దీంతో మలేషియా జట్టు 194 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అక్టోబర్ 3న ఇండియా- నేపాల్ మ్యాచ్

ఆసియా క్రీడల్లో భారత జట్టు అక్టోబర్ 3న నేపాల్‌తో తలపడనుంది. భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహిస్తున్నాడు.