
- చైనాలో నేటి నుంచే ఆసియా గేమ్స్
- వంద మెడల్స్‌పై ఇండియా గురి
- బరిలో 655 మంది అథ్లెట్లు
- మొత్తం 45 దేశాల నుంచి 12 వేల క్రీడాకారుల పోటీ
- సోనీ నెట్‌వర్క్‌లో లైవ్
ఆసియా ఖండాన్ని ఊపేసే అతి పెద్ద క్రీడా సంబురం ఆసియా గేమ్స్ మళ్లీ వచ్చేసింది. 40 క్రీడల్లో 45 దేశాల నుంచి ఏకంగా 12 వేల పైచిలుకు అథ్లెట్లు బరిలో నిలిచిన ఆసియా గేమ్స్ ఈ రోజే మొదలవుతున్నాయి. పతకాల సెంచరీ కొట్టాలనే లక్ష్యంతో ఇండియా నుంచి ఈసారి రికార్డు స్థాయిలో 655 మంది అథ్లెట్లు బరిలో నిలిచారు. ఒలింపిక్, వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ నీరజ్ చోప్రా ఈ జంబో టీమ్‌ను నడిపించనున్నాడు. అతనితోపాటు తెలంగాణ బాక్సింగ్ క్వీన్ నిఖత్ జరీన్, వెయిట్ లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి, ఏపీ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, షట్లర్ సాత్విక్, టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న తదితరులు బంగారు పతకాలపైనే గురి పెట్టారు. వచ్చే ఏడాది పారిస్‌లో ఒలింపిక్స్ ఉండటంతో ఈ మెగా ఈవెంట్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ఆసియా’ను గెలిచి ఒలింపి క్స్‌లో పతకాల వేటకు వెళ్లేందుకు ఇండియన్స్ రెడీ అయ్యారు.
హాంగ్జౌ : ఒలింపిక్స్ తర్వాత అత్యధిక దేశాలు బరిలో నిలిచి పోటాపోటీగా నడిచే ఆసియా గేమ్స్‌కు రంగం సిద్ధమైంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా ఆసియా గేమ్స్ హంగామా శనివారం లాంఛనంగా మొదలవనున్నాయి. నాలుగేండ్లకోసారి జరిగే గేమ్స్ కరోనా కారణంగా ఈసారి ఏడాది ఆలస్యంగా వచ్చాయి. అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగే మెగా ఈవెంట్లో రికార్డు స్థాయి అథ్లెట్లతో బరిలోకి దిగుతున్న ఇండియా గత ఎడిషన్‌లో అత్యధికంగా గెలిచిన 70 (16 గోల్డ్, 23 సిల్వర్, 31 బ్రాంజ్) మెడల్స్ రికార్డును దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్యూచర్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న ఇండియా 2018 లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా టాప్5లోకి రావాలన్న కృత నిశ్చయంతో ఉంది. సియోల్‌లో జరిగిన 1986 ఎడిషన్ తర్వాత ఇండియా ఇప్పటిదాకా టాప్5లో నిలవలేదు. అయితే, 2021లో టోక్యో ఒలింపిక్స్ మెరుపులు ఇచ్చిన ఉత్సాహంతో ఈసారి పతకాల సెంచరీ కొట్టాలని బరిలోకి దిగుతోంది. గత ఎడిషన్‌లో 20 మెడల్స్ రాబట్టిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఈసారి 25 మెడల్స్‌తెస్తారన్న అంచనాలున్నాయి.
స్టార్లపై ఫోకస్
ఈ గేమ్స్ చరిత్రలో తొలిసారి ఇండియా నుంచి ఐదుగురు ఒలింపిక్ మెడలిస్టులు ఈసారి పోటీ పడనున్నారు. ఇందులో జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా, లిఫ్టర్ మీరాబాయి, రెజ్లర్ బజ్‌రంగ్ పునియా, బాక్సర్ లవ్లీనా, షట్లర్ పీవీ సింధు ఉన్నారు.. ఈ ఏడాది వరల్డ్ చాంపియన్స్ కూడా అయిన చోప్రా, లవ్లీనాతో పాటు మీరాబాయి నుంచి గోల్డ్ ఆశించొచ్చు. కానీ, ఫామ్ కోల్పోయిన సింధు, చాన్నాళ్లుగా పోటీలకు దూరంగా ఉన్న బజ్‌రంగ్ ఎంతదూరం వెళ్తారో చూడాలి. మెన్, విమెన్ హాకీ, కబడ్డీ, క్రికెట్ టీమ్స్‌తో పాటు చెస్, ఆర్చరీ ఈవెంట్ల నుంచి కూడా గోల్డ్ మెడల్స్ ఆశించొచ్చు. బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ కూడా గోల్డెన్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అయింది. షూటర్లు 2018లో 9 మెడల్స్ వచ్చాయి. ఈసారి ఆ మార్కు అందుకుంటే గొప్పే అనొచ్చు.
ఒలింపిక్స్‌ను మించిన పోటీ
గేమ్స్ చరిత్రలో అత్యధికంగా ఈసారి 45 దేశాల నుంచి 12వేల పైచిలుకు బరిలో నిలిచారు. 40 క్రీడలు, 61 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. దాంతో 2018లో 11 వేల మంది పాల్గొన్న రికార్డును హాంగ్జౌ గేమ్స్ బ్రేక్ చేస్తున్నాయి. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో 11 వేల మంది పాల్గొన్నారు.
11 వేల కోట్లు ఖర్చు
ఈ గేమ్స్ కోసం స్టేడియాల నిర్మాణం, సదుపాయాలకు నిర్వాహకులు దాదాపు 11 వేల కోట్లు ఖర్చు చేశారు. పోటీలు జరిగే మొత్తం 54 వేదికల్లో 14 వేదికలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటిలో మెయిన్ సెంటర్ అయిన హాంగ్జౌ ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ (80 వేల సీటింగ్) కమలం పువ్వు విచ్చుకున్నట్టుగా నిర్మించారు. దీన్ని ‘బిగ్ లోటస్’ అని, పక్కనే ముడుచుకునే పైకప్పుతో కూడిన టెన్నిస్ కాంప్లెక్స్ (10 వేల సీటింగ్) ను ‘బిగ్ లోటస్’ అని పిలుస్తున్నారు. గేమ్స్‌లో ఈ రెండూ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 3 ఆసియా గేమ్స్‌కు చైనా ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. ఇది వరకు 1990 (బీజింగ్), 2010 (గ్వాంగ్జౌ)లో గేమ్స్ జరిగాయి.
సా. 5.30 నుంచి ఓపెనింగ్ సెర్మనీ
ఇండియా టైమ్ ప్రకారం ఈ రోజు సాయంత్రం 5.30 నుంచి ఆసియా గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరై గేమ్స్‌ను లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. మార్చ్‌ఫాస్ట్‌లో షూటర్ లవ్లీనా, మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఇండియా ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరిస్తారు.
అరుణాచల్ ఉషు ప్లేయర్లకు ..వీసా ఇవ్వని చైనా
ఆసియా గేమ్స్‌లో పాల్గొనే అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఇండియా ఉషు ప్లేయర్లకు చైనా వీసా నిరాకరించింది. దీనికి నిరసనగా హాంగ్జౌకు తన అధికారిక పర్యటనను కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రద్దు చేసుకున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఎనిమిది మందితో కూడిన ఇండియా ఉషు టీమ్‌లో భాగమైన ముగ్గురు మహిళా ప్లేయర్లు న్వేమన్ వాంగ్సు, ఒనిలు టెగా, మెపుంగ్ లంగుకు వీసాగా కూడా పని చేసే గేమ్స్ అక్రెడిటేషన్ ఇవ్వలేదు.
దాంతో గురువారం రాత్రి హాంగ్జౌ వెళ్లిన ఉషు టీమ్‌తో ప్రయాణించకుండా ఇండియాలోనే ఉండిపోయారు. అరుణాచల్‌ను తమ భూభాగం అని చెప్పుకునే చైనా ఇండియా ప్లేయర్లకు వీసా నిరాకరించడాన్ని కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ ఖండించాయి. వీరికి వీసా ఇప్పించేందుకు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్‌తో కలిసి కృషి చేస్తున్నట్టు ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడు రణధీర్ సింగ్ తెలిపారు.