కోచింగ్ లేకున్నా జాబ్ కొట్టొచ్చు

కోచింగ్ లేకున్నా జాబ్ కొట్టొచ్చు

గ్రూప్స్​ ఎగ్జామ్స్​ రాసే అభ్యర్థులు కోచింగ్ కు వెళ్తేనే ఉద్యోగం వస్తుందని, తెలుగు అకాడమీ బుక్స్​ లోనే స్టడీ మెటీరియల్ అంతా ఉంటుందనుకోవడం అపోహ మాత్రమేనని .. టీఎస్​పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్​ ఘంటా చక్రపాణి అన్నారు. గ్రూప్​ వన్​ సిలబస్​ మొత్తం ఇప్పుడు ఆన్ లైన్​ లో డిజిటల్ రూపంలో, యూట్యూబ్ చానల్స్​ లో విస్తృతంగా  అందుబాటులో ఉంది.. వాటిని సరిగ్గా ప్రిపేర్​ అయితే సరిపోతుందని.. అభ్యర్థులకు తన సలహాలు సూచనలను అందించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011లో 310 పోస్టులతో గ్రూప్​ 1 నోటిఫికేషన్​ ఇచ్చారు. అప్పటి వరకు అదే భారీ నోటిఫికేషన్​. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక లైఫ్​ టైం ఆపర్చునుటీలాగా ఒకేసారి 503 ఉద్యోగాలు వేశారు. పదేళ్లుగా గ్రూప్​ 1 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి చాన్స్.  గ్రూప్​ 1 సాధించడానికి షార్ట్ కట్ లు ఉండవు. క్వశ్చన్​ బ్యాంకులు ప్రిపరేషన్​ కు పనికి రావు. గతంలో ఇలాంటి క్వశ్చన్​ బ్యాంకులను నమ్ముకున్నవారు అందులో నుంచి ప్రశ్నలు రాకపోయేసరికి నిరాశచెందారు.  అందుకే సిలబస్ లోని అంశాలపై సంపూర్ణమైన అవగాహన ఉండాలి.

జనరల్ స్టడీస్​ ప్రిపేర్​ అవ్వండిలా.. 

దేశంలో సివిల్ సర్వీసెస్​ ఫౌండేషన్​ వేసినప్పుడు జాబ్స్​ ను రెండు రకాలుగా విభజించారు. దీని ప్రకారం ఉద్యోగులు జనరలిస్టులు, స్పెషలిస్టులు ఉంటారు. జనరలిస్టులు అంటే సాధారణ పరిపాలన శాఖలో ఉండేవారు. స్పెషలిస్టులు అనుకోండి ఇస్రో సైంటిస్టులు, ఇంకైదేనా రీసెర్చ్ ఫీల్డ్ లో అనుభవం ఉన్నవారు. అందుకే సాధారణ పరిపాలనలో ఉండే కలెక్టర్లు, గ్రూప్​ 1, గ్రూప్​ 2 క్యాడర్​ అధికారులకు జనరల్ స్టడీస్​ మీద అవగాహన ఎక్కువగా ఉండాలని యూపీఎస్సీగానీ, ఇతర ఉద్యోగ నియామక కమిషన్లు భావిస్తాయి. ఈ జనరల్ స్టడీస్​కు టెక్స్ట్ బుక్స్ తో సంబంధం లేదు. రోజూ పేపర్​ చదవడంతోపాటు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడం, నోట్​  చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. 

పరీక్షకు ఆర్నెళ్ల ముందు నుంచి జరిగే అంశాలే జనరల్​ స్టడీస్​ గా వస్తాయి. జనరల్ స్టడీస్​కు ఉన్న విస్తృతి దృష్ట్యా ప్రత్యేకంగా పుస్తకాలు కొను క్కొని చదవడం కంటే ఆరేడు నెలల న్యూస్​  పేపర్ ఆధారంగా నోట్స్​ తయారు చేసుకోవడం మంచిది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం, దావోస్ పర్యటనలో జరిగిన ఒప్పందాలు, ఎంఓయూ చేసుకున్న సంస్థల్లో ప్రముఖ కంపెనీలు, జ్ఞానవాపి, హిజాబ్​  వివాదంలాంటి అనేక అంశాలపై ప్రశ్నలడిగే అవకాశం ఉంటుంది. ఇవి కూడా  తేదీ ఎప్పుడు, ఎక్కడ జరిగిందనిస్ట్రెయిట్ క్వశ్చన్స్​ ఉండవు. ప్రశ్నలు లాజికల్​గా ఉంటాయి కాబట్టి ప్రతి అంశంపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. ప్రతి అంశానికి సంబంధించిన కాన్సెప్ట్, బ్యాక్ గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. వీటిని ప్రాతిపదిక చేసుకుని జనరల్​ స్టడీస్​కు ప్రిపేర్​ కావాలి. అన్ని ఉద్యోగ పరీక్షల్లో జనరల్ స్టడీస్​ ఉన్నప్పటికీ.. ఉద్యోగ స్థాయిని బట్టి ప్రశ్నల సరళిలో మార్పు ఉంటుంది. 

ఆన్​లైన్​లో విస్తృత సమాచారం.. 

ఫంక్షన్ హాళ్లలో నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లకు వేలాది మంది అభ్యర్థులు అటెండ్ అవుతున్నారు. కోచింగ్ కు వెళ్లేవాళ్లంతా పోటీ ఇస్తారనుకోవడం పొరపాటే. చాలా కోచింగ్ సెంటర్ల లో చెప్పేందుకు మెటీరియలే లేదు. నోటిఫికేషన్లకు వాళ్లు కూడా ప్రిపేర్​ గా లేరు. దీంతో వాళ్లలో కొందరు పరీక్షను వాయిదా వేయించాలనే ఆందోళనలు చేయిస్తున్నారు. పరీక్షను వాయిదా వేయడం వల్ల అభ్యర్థులకే నష్టం జరుగు తుంది. వాయిదా వేస్తున్న కొద్దీ జనరల్ స్టడీస్ కు సంబంధించిన ప్రశ్నల విస్తృతి పెరుగుతుంది. కోచింగ్​కు వెళ్లకపోయినా ఇంట్లో పుస్తకాలు చదివి జాబ్ కొట్టొచ్చు.  ప్రిలిమ్స్​ కు అయితే కోచింగ్ అవసరమే లేదు. ఆన్ లైన్​ లో విస్తృతంగా సమాచారం, ఆర్టికల్స్, పుస్తకాలు దొరుకుతున్నాయి. ప్రొఫెసర్​ నాగేశ్వర్​ లాంటి వారి  యూట్యూబ్ చానల్స్​లో, టీశాట్​లో  లెస్సెన్స్​ ఉన్నాయి. డిజిటల్ ఫార్మెట్ లో చాలా సమాచారం ఆన్ లైన్​లో అందుబాటులో ఉంది. కానీ మాకు మార్కెట్ లో ​ స్టడీ మెటీరియల్ దొరకడం లేదని, తెలుగు అకాడమీ పుస్తకాలే కావాలి, అవి లేకపోతే చదవలేం అనడం అవగాహనా  రాహిత్యమే అవుతుంది.  

ఎస్సీ, బీసీల మధ్యే పోటీ.. 

గతంలో ఓపెన్​ కేటగిరీకి చెందిన అభ్యర్థులు బాగా చదువుతారని, రిజర్వేషన్​ ద్వారా వచ్చే అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తుందనే అభిప్రాయం ఉండేది. కానీ ఈడబ్ల్యూఎస్​ రిజర్వే షన్​ అమల్లోకి వచ్చాక విడుదలైన సివిల్స్​ ఫలితాల్లో  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ  అభ్యర్థుల  కటాఫ్​ మార్కుల కంటే ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థుల కటాఫ్​ తక్కువగా రావడం చూశాం. అంటే పోటీ పరీక్షల్లో ఓపెన్​ కేటగిరీ అభ్యర్థుల కంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నారనే విషయం అర్థమవు తోంది. గ్రూప్1 పరీక్షలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ 95 శాతం రిజర్వేషన్ స్థానికులకు కేటాయించలేదు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టంలో మార్పులు చేయడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. 

ఇంటర్వ్యూ ఉంటే బాగుండేది.. 

హయ్యర్ లెవల్​ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఆఫీసర్​, అన్ని రకాల జ్యూడిషియరీ పవర్స్​ కలిగిన ఒక జిల్లా మెజిస్ట్రేట్​కు విచక్షణాధికారులు ఉంటాయి. ఇలాంటి పవర్స్​ కలిగిన అధికారిని పర్సనాలిటీ అసెస్ మెంట్ లేకుండా సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకే సివిల్ సర్వీసెస్​ లో ఇంటర్వ్యూను తప్పనిసరి అంశంగా పెట్టారు. మిగతా రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఈ విషయంలో గవర్నమెంట్ పునరాలోచన చేస్తే బాగుంటుంది.

పోటీపడేది 10 వేల మంది లోపే.. 

గ్రూప్​ 1కు  మూడు లక్షల అప్లికేషన్లు దాటడంలో ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరూ కాంపిటీటివ్​ ఎగ్జామ్​ కు అర్హుడనే భావనతో ఉన్నారు. వాస్తవానికి ఏదైనా జాబ్ కు అప్లై చేసే ముందు ఆ జాబ్ కు తాను అర్హుడినా, కాదా అనే సెల్ఫ్​ అసెస్​ మెంట్ చేసుకోవడం లేదు. డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకుంటున్నారు. దాంతోనే అసలు సమస్య. అందరిలో సీరియస్​ నెస్​ ఉండడం లేదు. వాస్తవానికి మూడున్నర లక్షల మందిలో సీరియస్​ గా ప్రిపేర్​ అయ్యేవాళ్లు పది వేలకు మించరు. ప్రిలిమ్స్​ లో టిక్​ పెట్టడమే కదా అనే ఆలోచనతో అప్లై చేస్తే అయిపోతుందనుకునేవాళ్లే ఎక్కువ.  

కరెంట్​ ఎకానమీపై ఫోకస్​.. 

ఎకానమీలో ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నలు ఉంటాయి. ఈ బడ్జెట్​ లో  ఏముంది. ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిగాయనే అంశాల కోసం బడ్జెట్లపై అవగాహన ఉండాలి. వచ్చే 
ఐదేళ్లలో  జీడీపీ లక్ష్యమెంత ?  దావోస్​ లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ? తెలంగాణకు సంబంధించి ఎన్ని ఎంఓయూలు జరిగాయి. అందులో ముఖ్యమైన ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఏవేవి అనే అంశాలపై  ప్రశ్నలు రావొచ్చు.  ఐటీ సెక్టార్, పారిశ్రామిక రంగ అభివృద్ధి గురించి అడగొచ్చు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కొన్ని పుస్తకాల్లో దొరక్కపోవచ్చు. 

ఘంటా చక్రపాణి

టీఎస్ పీఎస్సీ మాజీ ఛైర్మన్