టికెట్లు రాక వీళ్లు.. ప్రత్యర్థులు తేలక వాళ్లు.. నియోజకవర్గాల్లో ఇంకా ఊపందుకోని ప్రచారం

టికెట్లు రాక వీళ్లు.. ప్రత్యర్థులు తేలక వాళ్లు.. నియోజకవర్గాల్లో ఇంకా ఊపందుకోని ప్రచారం
  • టికెట్లు రాక వీళ్లు.. ప్రత్యర్థులు తేలక వాళ్లు
  • నియోజకవర్గాల్లో ఇంకా ఊపందుకోని ప్రచారం
  • కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఎవరికి వచ్చే చాన్స్​ ఉందో ఆరా తీస్తున్న బీఆర్ఎస్​ క్యాండిడేట్లు
  • క్లారిటీ వస్తేనే ప్రచార వ్యూహాలు
  • అభ్యర్థుల బలాబలాలపైనే గెలుపు అవకాశాలు
  • ఆశావహులతో సమానంగా టెన్షన్ పడుతున్న అధికార పార్టీ అభ్యర్థులు

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ ఇంకా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోలేదు. టికెట్లు ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ ఆశావహులు పూర్తి స్థాయిలో జనాల్లోకి పోవడం లేదు. అక్కడక్కడ గ్రామాల్లోకి వెళ్లినా మొక్కుబడిగా ప్రచారం చేసి వస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థులు ఎవరో తేలకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల్లోనూ స్తబ్దత ఏర్పడింది. ఎన్నికల షెడ్యూల్  వచ్చే ముందు వారం, పది రోజులపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో  ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు.. షెడ్యూల్ రాగానే ఒక్కసారిగా రిలాక్సయ్యారు. ప్రత్యర్థులను బట్టి ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గాల్లో పెద్దగా ఎన్నికల హడావుడి కనిపించడం లేదు. 

ప్రత్యర్థుల కదలికలపై బీఆర్ఎస్ అభ్యర్థుల నిఘా

ఇతర పార్టీల్లోని తమ ప్రత్యర్థుల కదలికలపై బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థులు నిఘా పెట్టారు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ నుంచి అభ్యర్థులు ఖరారు కానప్పటికీ.. టికెట్ఆశిస్తున్న ఆశావహులు రోజూ ఎవరెవరని కలుస్తున్నారు, ఎవరెవరితో సంప్రదింపులు చేస్తున్నారు వంటి విషయాలను తమ మనుషుల ద్వారా ఆరా తీయిస్తున్నారు.  కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఎవరికి వచ్చే అవకాశముందంటూ తమ అనుచరులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయా పార్టీల్లో ఉండే తమ సన్నిహితులతోపాటు మీడియా ప్రతినిధుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి  ఎవరికి టికెట్ వస్తే తమ గెలుపు ఈజీ అవుతుంది, ఎవరికి వస్తే టఫ్​ ఫైట్ ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్  అభ్యర్థులు కూడా తమ ప్రత్యర్థుల  విషయంలో టెన్షన్ కు లోనవుతున్నారు.   

రానోళ్లను బీఆర్ఎస్ లోకి లాగేందుకు ప్లాన్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ టికెట్ల కోసం ఒక్కో నియోజకవర్గంలో 10  నుంచి 15 మంది వరకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే టికెట్ల ప్రకటన రాగానే టికెట్  రాని అసంతృప్తులకు తమ సర్కారు వస్తే నామినేటెడ్ పదవులు, ప్యాకేజీ అని ఎరవేసి తమ పార్టీలోకి లాగేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్లాన్  చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే రెబల్ గా పోటీ చేయించి ప్రత్యర్థి పార్టీ ఓట్లు చీలేలా చూడాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

ప్రత్యర్థుల బలమేంటి? బలహీనతలు ఏంటి ?

కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్న లీడర్ల బలం, బలహీనతలపై బీఆర్ఎస్ అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. గతంలో వారిపై ఉన్న కేసులు, ఆరోపణలకు సంబంధించిన చిట్టాను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రత్యర్థుల సామాజిక వర్గ ఓట్ల బలం, సొంతంగా ఎన్ని కోట్లు ఖర్చు చేయగలరు? వారి వెంట నిలబడే లీడర్లు ఎవరని బ్యాక్ గ్రౌండ్  చెక్  చేస్తున్నారు.  కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలోకి రాకముందే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు మొదలు పెట్టారు. గ్రామాల వారీగా పార్టీ నేతలను పిలిపించుకొని ప్రత్యర్థి ఓట్ల శాతాన్ని తెలుసుకుంటున్నారు. అలాగే వారికి ఆయా పార్టీల్లో సహకరించే లీడర్లు, సహకరించని లీడర్ల గురించి ఆరా తీస్తున్నారు.   

ఖర్చూ కారణమే.. 

ఎన్నికలకు మరో నెలన్నరకుపైగా ఉండడంతో ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెడితే ఖర్చు తడిసి మోపెడవుతుందని కూడా బీఆర్ఎస్ తోపాటు ఇతర పార్టీల లీడర్లు భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడే  ప్రచారం ప్రారంభిస్తే ప్రచార ర్యాలీకి జనాన్ని తీసుకొచ్చేందుకు, వారికి భోజనాలు పెట్టేందుకు, ఫంక్షన్  హాళ్ల బిల్లులకు రోజూ లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేగాక రోజూ ప్రచారంలో తిరిగే కార్యకర్తలు, లీడర్లను కూడా ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే దసరా తర్వాత ప్రచారం ప్రారంభించి, నోటిఫికేషన్ వచ్చాక క్యాంపెయిన్ ను ఉధృతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.