అటెండర్ల ఫింగర్​ప్రింట్​తో డాక్టర్ల అటెండెన్స్

అటెండర్ల ఫింగర్​ప్రింట్​తో  డాక్టర్ల అటెండెన్స్

 

  • బయోమెట్రిక్‌‌ ట్యాంపర్ చేసి.. డ్యూటీలకు డాక్టర్లు డుమ్మా!
  • అటెండర్ల ఫింగర్​ప్రింట్​తో  డాక్టర్ల అటెండెన్స్ 
  • 56 మందికి నోటీసులు చర్యలకు అడ్డొస్తున్న లొసుగులు

హైదరాబాద్, వెలుగు: డ్యూటీలకు డుమ్మా కొట్టేందుకు కొంతమంది ప్రభుత్వ డాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డాక్టర్లు కరెక్ట్​గా డ్యూటీలకు రావడం లేదని బయోమెట్రిక్‌‌, ఫేస్‌‌ రికగ్నైజేషన్ అటెండెన్స్ మెషీన్​లు పెడితే.. వాటిని కూడా ట్యాంపర్ చేస్తున్నారు. ఇలా ఇల్లీగల్​గా డ్యూటీలు ఎగ్గొడుతున్న 56 మంది డాక్టర్లకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. అలాగే, ఆ శాఖ మంత్రి హరీశ్‌‌రావు సూచనతో వైద్య విధాన పరిషత్‌‌(వీవీపీ) పరిధిలోని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కమిషనర్ డాక్టర్ అజయ్‌‌కుమార్ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు, మధ్యాహ్నం ఒంటి గంటకే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నారు.

బయోమెట్రిక్ అటెండెన్స్‌‌లో మాత్రం డ్యూటీ హవర్స్‌‌ తర్వాతే వెళ్తున్నట్టు రికార్డు అవుతోంది. కమిషనర్​గజ్వేల్ హాస్పిటల్‌‌ విజిట్‌‌కు వెళ్లగా.. 80 శాతం మంది డాక్టర్లు డ్యూటీలో లేరు. కానీ, అటెండెన్స్‌‌ మాత్రం అందరూ ప్రజెంట్​గా రికార్డు అయింది. దానిపై ఎంక్వైరీ చేయగా.. డాక్టర్లు బయోమెట్రిక్​ మెషీన్​ను ట్యాంపరింగ్ చేస్తున్నట్టు తేలింది. బయోమెట్రిక్ యంత్రాల్లో వేలిముద్రలు రిజిస్టర్ చేసేటప్పుడే, డాక్టర్లకు బదులు వారి అటెండర్ల వేలి ముద్రలు రిజిస్టర్ చేయించి, వారితోనే రోజూ అటెండెన్స్ వేయిస్తున్నట్టు కమిషనర్ గుర్తించారు. ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్‌‌ను ట్యాంపర్ చేసేందుకు ఫోన్‌‌లో దిగిన ఫొటోలను వినియోగిస్తున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఫొటోతో రిజిస్టర్ చేయించుకుని, రోజూ అటెండర్లతో ఆ ఫొటో ద్వారా అటెండెన్స్ వేయించుకుంటున్నారు. ఇలా ట్యాంపరింగ్ చేస్తూ వారాల తరబడి డ్యూటీలకు డుమ్మా కొట్టిన వారు కూడా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

అవినీతే ఆసరాగా..

డాక్టర్ల అటెండెన్స్‌‌, పనితీరును పరిశీలించాల్సిన హాస్పిటళ్ల సూపరింటెండెంట్లే డ్యూటీ హవర్స్‌‌లో ప్రైవేటు ప్రాక్టీస్ చేయడం, అవినీతికి పాల్పడడం వంటి అంశాలు డుమ్మా డాక్టర్లకు కలిసొస్తున్నాయి. తమ అటెండెన్స్ చీటింగ్‌‌ను బయటపెడితే, హాస్పిటల్‌‌లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను బయటపెడుతామని సూపరింటెండెంట్లు, ఆర్‌‌‌‌ఎంవోలను డాక్టర్లు బ్లాక్‌‌మెయిల్ చేస్తున్నారు. దీంతో వారు సైలెంట్‌‌గా ఉంటున్నారు. హాస్పిటల్‌‌ డైట్‌‌, సానిటేషన్ కాంట్రాక్టర్ల వద్ద సూపరింటెండెంట్లు, ఆర్‌‌‌‌ఎంవోలు నెలవారీగా కమీషన్లు తీసుకుంటున్నారు. ఈ కమీషన్ల వ్యవహారాన్ని ఆధారాలతో సహా దొరకబుచ్చుకున్న కొంత మంది డాక్టర్లు, వారిని బ్లాక్‌‌మెయిల్ చేసి డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రమేయం, డాక్టర్స్ అసోసియేషన్లు అడ్డంకిగా మారాయని అధికారులు చెబుతున్నారు. హాస్పిటల్స్‌‌లో పెద్ద సంఖ్యలో డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండడం కూడా డుమ్మా డాక్టర్లకు కలిసొస్తుంది.