వెస్టిండీస్‌‌‌‌తో టెస్ట్‌‌‌‌ : భారీ ఆధిక్యంలో ఆసీస్‌

 వెస్టిండీస్‌‌‌‌తో టెస్ట్‌‌‌‌ :  భారీ ఆధిక్యంలో ఆసీస్‌

పెర్త్‌‌‌: వెస్టిండీస్‌‌‌‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌‌‌‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. బ్యాటింగ్‌‌‌‌లో భారీ స్కోరు చేసిన కంగారూలు బౌలింగ్‌‌‌‌లోనూ దుమ్మురేపారు. పేసర్లు మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (3/51), కమిన్స్‌‌‌‌ (3/34) చెలరేగడంతో.. శుక్రవారం మూడో రోజు విండీస్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 98.2 ఓవర్లలో 283 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. 74/0 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన కరీబియన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో బ్రాత్‌‌‌‌వైట్‌‌‌‌ (64), టెగెనరైన్‌‌‌‌ చందర్‌‌‌‌పాల్‌‌‌‌ (51) హాఫ్‌‌‌‌ సెంచరీలు చేయగా, బ్లాక్‌‌‌‌వుడ్‌‌‌‌ (36), బ్రూక్స్‌‌‌‌ (33) పోరాడి విఫలమయ్యారు. స్పిన్నర్‌‌‌‌ నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఆసీస్‌‌‌‌ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 11 ఓవర్లలో 29/1 స్కోరు చేసింది. ఉస్మాన్‌‌‌‌ ఖవాజ (5) విఫలమైనా, డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌ (18 బ్యాటింగ్‌‌‌‌), లబుషేన్‌‌‌‌ (3 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. 315 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం కలుపుకుని ప్రస్తుతం ఆసీస్‌‌‌‌ 344 ఓవరాల్‌‌‌‌ లీడ్‌‌‌‌లో కొనసాగుతున్నది. కమిన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 

పాంటింగ్‌‌‌‌కు అస్వస్థత

ఈ మ్యాచ్‌‌లో కామెంట్రీ చెబుతున్న మాజీ ప్లేయర్‌‌ రికీ పాంటింగ్‌‌ అస్వస్థతకు గురయ్యాడు. లంచ్‌‌ బ్రేక్‌‌లో ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాంటింగ్‌‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికైతే మాజీ కెప్టెన్‌‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తున్నా.. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.