ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలి

ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలి

కరీంనగర్ టౌన్, వెలుగు:  ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని, సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ ​కలెక్టర్ కర్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​ 218 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వ్యయప్రయాసలకోర్చి ప్రజావాణికి వస్తుంటారని అన్నారు. మానకొండూర్ తహసీల్దార్ కు 27 దరఖాస్తులు రాగా మున్సిపల్ కార్పొరేషన్ కు 20, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 16, ఆర్డీఓ కార్యాలయానికి 12, మిగిలిన శాఖల మొత్తం 143 దరఖాస్తులు స్వీకరించామని కర్ణన్​తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డిఓ ఆనంద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

సిరిసిల్లలో 37 దరఖాస్తులు  

రాజన్న సిరిసిల్ల:  జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 37 ఫిర్యాదులు వచ్చాయని అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. అధికారులు స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించి సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అర్జీలను పెండింగ్ లో పెట్టొద్దని సూచించారు. కాగా దివ్యాంగుల శాఖను స్వతంత్ర శాఖగా కొనసాగించాలని ప్రజావాణిలో దివ్యాంగుల జిల్లా కన్వీనర్ రాములు, రాజేశ్,హరిప్రసాద్  కోరారు. వేములవాడ లో  మూసిఉన్న బెగ్గర్ హోంను తెరిపించాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల కమలాకర్ వినతిపత్రం అందించారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామసభ నాలుగేళ్ల నుంచి నిర్వహించడంలేదని ఆవునూర్ గ్రామస్తులు ఏనుగులు వేణు, జక్కుల యాదగిరి, బండ అశోక్, బండ రాజు, ఎల్లయ్య ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో  శ్రీనివాస్ రావు, పవన్ కుమార్, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు   తదితరులు  పాల్గొన్నారు.