కరోనాపై అవగాహనే అసలైన వ్యాక్సిన్

V6 Velugu Posted on May 18, 2021

కొవిడ్​ లక్షణాలకు రోజుకో సమస్య జతవుతోంది. ఆ లెక్కనే రోజుకో మందు కూడా సిఫార్స్​ చేస్తున్నారు. ఉన్న మందులు పనిచేయట్లేదని కొంతమంది అంటుంటే, కోలుకుంటున్నామని కొంతమంది అంటున్నారు. కొవిడ్​ భయం అందరిలోనూ ఉంది. కొవిడ్​ ప్రమాదకరమైనదే. కానీ అది అందరికీ కాదన్న నిజం మాత్రం చాలామందికి చేరడం లేదు. ఇప్పుడు కరోనా కంటే భయమే మహమ్మారిలా మారింది. కొవిడ్​ ఎన్ని రకాలుగా ఎఫెక్ట్​ చూపిస్తుందన్న అవగాహన ఉంటే ఈ భయం పోయినట్లే. ఈ మహమ్మారికి అవగాహనే వ్యాక్సిన్ అంటున్నారు డాక్టర్​ కె.ఎస్​. సోమశేఖర్​ రావు. 

కొవిడ్​ వస్తే భయపడొద్దు. అలాగని ఏమీ కాదని నిర్లక్ష్యం చేయొద్దు. కొవిడ్ పట్ల అలర్ట్​గా ఉండాలి. కొవిడ్​ అందరిలో ఒకేలా ఎఫెక్ట్ చూపట్లేదు. వయసు, ఫిజికల్​ ఫిట్​నెస్​, మెంటల్ కండిషన్​, లైఫ్​ స్టైల్, హెల్త్ ప్రాబ్లమ్స్​ని బట్టి కరోనా వైరస్​ మనిషిలో తన ప్రభావం చూపిస్తోంది. కాబట్టి కరోనా ఎలాంటి సమస్యలకు దారి తీస్తోంది. అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయో తెలుసుంటే కరోనాకు సరైన వైద్యం చేయించుకోవచ్చు. తేలికగా ఎదిరించొచ్చు. తొందరగా కోలుకోవచ్చు. ​మొత్తం కొవిడ్​ పేషెంట్స్​ వందమంది ఉంటే, వాళ్లలో కొవిడ్ నాలుగు రకాల ప్రభావం చూపిస్తుంది. 

ఏ లక్షణాలు లేనివాళ్లు (20 శాతం) 
వీళ్లకు కరోనా సోకి, పోయిన సంగతి కూడా తెలియదు.

మైల్డ్​ కొవిడ్​ లక్షణాలు (70 శాతం)
వీళ్లలో కరోనా వైరస్​ గొంతులోనే ఉంటుంది. ఊపిరితిత్తులకు వ్యాపించదు. నిమ్ము రాదు. బ్లడ్​ ఆక్సిజన్ లెవల్ 95 శాతం కన్నా తగ్గదు. కాబట్టి ధైర్యంగా ఉంటారు. పెద్దవాళ్లు, వేరే జబ్బులతో బాధపడేవాళ్లయితే తప్పకుండా డాక్టర్​ని కలవాలి. షుగర్​, కిడ్నీ, లివర్ ​, హార్ట్​, లంగ్స్, థైరాయిడ్​, హెచ్​ఐవీ లాంటి జబ్బులు ఉన్నవాళ్లు అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. 

కొద్దిపాటి అనారోగ్యం (7 శాతం) 
వీళ్లకు హాస్పిటల్లో ట్రీట్​మెంట్​ అవసరం. నీళ్లు, మజ్జిగ, ఎలక్ట్రాల్ వంటి పదార్థాలు తీసుకోవాలి. లక్షణాలను బట్టి డాక్టర్ సలహాతో మందులు వాడాలి. సొంత వైద్యం మంచిది కాదు. వేరే వ్యాధులతో బాధపడేవాళ్లు అవసరమైన టెస్ట్​లు చేయించు కోవాలి.  కరోనా సోకిన వారం రోజులకు ఈ స్టేజ్​కి చేరుకుంటారు. కొవిడ్​ బారినపడిన ఐదవ రోజు నుంచి 12వ రోజు మధ్య జబ్బు తీవ్రరూపం దాలుస్తుంది. ఇలాంటి వాళ్లకు సరైన ట్రీట్​మెంట్ ఇవ్వాలంటే కొవిడ్​ ఎప్పుడు స్టార్ట్​ అయిందో కచ్చితంగా తెలియాలి. అందుకోసం మైల్డ్​లెవల్​ సింప్టమ్స్​ ఎప్పుడొచ్చాయో గుర్తు తెచ్చుకుని, డాక్టర్​కి చెప్పాలి. బ్లడ్​ ఆక్సిజన్​ లెవల్​ (90 నుంచి 94 మధ్యకు ) పడిపోతే చెస్ట్​ సీటీ స్కాన్​ చేయించాలి. హాస్పిటల్​లో చేర్చాలి. డాక్టర్​ సలహాతో హిమోగ్రామ్​, సీఆర్​పీ,  ఐఎల్6, ఫెర్రిటిన్, డీ– డైమర్​ పరీక్షలు చేయించుకోవాలి. ఈ టెస్టుల ఆధారంగా జబ్బు తీవ్రతను అంచనా వేస్తారు. ఈ పరీక్షల్ని ప్రతి 48 గంటలకు ఒకసారి చేయిస్తే, రిజల్ట్​ను బట్టి మెడిసిన్స్​ డోస్​ మార్చుకుంటూ పోతారు. ఈ స్టేజ్​లో ఉన్నవాళ్లలో  ఐదు శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.  వీళ్లలో బ్లడ్​ ఆక్సిజన్​ శాతం 90కి పడిపోతుంది. 

సీరియస్​గా.. (3 శాతం) 
ఈ స్థితిలో స్టెరాయిడ్స్​ వాడాలి. ఆక్సిజన్​ తగినంత అందిస్తూ ఉండాలి. కిడ్నీ, లివర్​ ప్రాబ్లమ్స్​ ఉన్నవాళ్లకు రెమ్డిసివిర్​ ఇవ్వకూడదు. 
మోడరేట్​, తీవ్రమైన లక్షణాలతో జబ్బు చేసిన వాళ్లు నాలుగ్గంటలకు ఒకసారి ఆక్సీ మీటర్​తో బ్లడ్ ఆక్సిజన్​ లెవల్, పల్స్​ రేట్​ని చెక్​ చేసుకుంటూ ఉండాలి.  

షుగర్​ పేషెంట్స్ 
కొవిడ్​ వస్తే షుగర్​ పేషెంట్స్​ చాలా అలర్ట్​గా ఉండాలి. డాక్టర్​ని కచ్చితంగా కలవాలి. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలం జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్​, స్టిరాయిడ్స్​ వల్ల ఒక్కోసారి షుగర్​ విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్సులిన్​ డోస్​ పెంచాల్సి వస్తుంది. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత ఒక గ్లూకోమీటర్​ దగ్గర ఉంచుకుని, షుగర్​ లెవల్​ని చెక్​ చేసుకోవాలి.

టెన్షన్ వద్దు

  •   పాజిటివ్​ అని తేలగానే హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. 
  •   ఇంట్లోఉంటూ, మందులు తీసుకోవడానికే ప్రయత్నించాలి. అవసరమైతేనే హాస్సిటల్​లో చేరాలి. 
  •   ఆందోళన ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. కాబట్టి ధైర్యమే కొవిడ్​కు మందు. 
  •   ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఆక్సిజన్​ లెవల్ చెక్​ చేసుకోవాలి. ఇలా చేస్తే కొవిడ్ సీరియస్​నెస్​ను రెండు రోజుల ముందే కనిపెట్టవచ్చు. 
  •   ఊపిరితిత్తులు బాగా పాడయిపోయిన వాళ్లు జబ్బు తీవ్రంగా ఉన్న టైంలోనే కాకుండా తర్వాత కూడా ప్రాణాయామం లాంటి వ్యాయామాలు చేస్తుండాలి.

Tagged corona vaccine, coronavirus, corona precautions, corona tension, Corona fear, Awareness on the coronavirus, corona negligence

Latest Videos

Subscribe Now

More News