పిల్లల దగ్గరికే స్కూళ్లు

పిల్లల దగ్గరికే స్కూళ్లు

స్కూల్‌కు వెళ్లే పిల్లలకు పాఠాలు చెప్పడానికి చాలామంది టీచర్లు ఉన్నారు. మరి  స్కూల్‌కు వెళ్లలేని పిల్లల సంగతేంటి? వాళ్లకూ గురువు కావాలి కదా! అందుకే స్కూల్‌నే వాళ్ల దగ్గరకు తీసుకొస్తామంటున్నారు ఈ టీచర్లు. పిల్లలకు చదువు చెప్పడం కోసం వీళ్లు పడే తపన చూస్తే ఎవరైనా శాల్యూట్​ కొట్టాల్సిందే. పశ్చిమ బెంగాల్‌‌లోని ముర్షిదాబాద్ జిల్లా బాబ్తా గ్రామానికి చెందిన ముప్ఫై ఏండ్ల బాబర్ తాను ఐదో తరగతి చదువుతున్నప్పుడే గురువుగా మారాడు. చిన్నప్పుడు అతి కష్టం మీద రోజూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న బాబర్.. బడికి వెళ్లే అవకాశం లేని పేద పిల్లలను చూసి చలించిపోయాడు.  అందుకే తాను స్కూల్లో ఉండగానే ఒక చిన్న స్కూల్‌‌ని మొదలుపెట్టి ‘యంగెస్ట్ హెడ్ మాస్టర్ ఆఫ్ ది వరల్డ్’ గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ‘ఆనంద్ శిక్షానికేతన్’ పేరుతో గ్రామంలోని పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్తున్నాడు.  పదిమంది స్టూడెంట్స్‌‌తో మొదలైన ఈ స్కూల్‌‌లో ప్రస్తుతం  వెయ్యిమంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు.   

పాడైపోయిన వస్తువులతో సైన్స్​ పాఠాలు

ఐఐటీ కాన్పూర్‌‌‌‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకున్న అరవింద్ గుప్తా.. అనుకోని విధంగా టీచర్ అయ్యాడు. సైన్స్‌‌ను ఎంతో ఇష్టపడే ఈయన పిల్లలు సైన్స్ సబ్జెక్ట్‌‌ను బట్టీ పట్టడం చూసి వాళ్లకు ఎలాగైనా సైన్స్ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు.  పాడైపోయిన వస్తువులతో సైన్స్ ప్రయోగాలు చేస్తూ పిల్లల మనసు దోచుకుంటున్నాడు. తన క్రియేటివిటీతో సైన్స్‌‌ను ఒక సరదా సబ్జెక్ట్‌‌గా మార్చేశాడు. అగ్గిపుల్లలు, పాత న్యూస్ పేపర్లు, పాడైపోయిన సైకిల్ టైర్లు, పారేసిన ప్లాస్టిక్ సీసాలు, టెట్రాప్యాక్ డబ్బాలతో క్రియేటివ్ సైన్స్ ప్రయోగాలు చేసి సైన్స్‌‌ను పిల్లలకు దగ్గర చేశాడు. సైన్స్ నేర్చుకునేందుకు ఖరీదైన పరికరాలు,  కోచింగ్ సెంటర్లు అక్కర్లేదని, సరదాగా ఆటల రూపంలో ఎన్నో సైన్స్ విషయాలు నేర్చుకోవచ్చని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ‘అరవింద్‌‌ గుప్తా టాయ్స్‌‌’ పేరుతో వెబ్‌‌సైట్‌‌ ఏర్పాటు చేసి12 భాషల్లో సైన్స్ పాఠాలు చెప్తున్నాడు.

వెనకడుగు వేయని విమలా టీచర్

83 ఏళ్ల విమలా కౌల్.. స్కూల్ టీచర్‌‌‌‌గా రిటైర్ అయ్యాక కూడా తన వృత్తిని వదల్లేదు. గవర్నమెంట్ స్కూల్స్‌‌లో సరైన చదువు అందుబాటులో లేదని గమనించి తానే  ‘గుల్దస్తా’ పేరుతో చిన్న స్కూల్‌‌ను  మొదలుపెట్టి ఉచితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌ అందిస్తోంది.

చదువు వచ్చినా, రాకపోయినా హాజరు ఉంటే చాలు వాళ్లని పాస్‌‌ చేసి పై తరగతులకు పంపించే విధానాన్ని చూసి విమల ఎంతగానో బాధపడింది. ఈ పద్ధతిని మార్చాలనుకుంది. ఢిల్లీలోని చౌపాలిలో ఐదుగురు పిల్లలతో ‘గుల్దస్తా’ స్కూల్ మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆ స్కూల్‌‌లో150 మంది పిల్లలు చేరారు. ఇంతలో  పిల్లల గోల భరించలేకపోతున్నామని ఇరుగుపొరుగు వాళ్లు గోల చేయడంతో లోకల్ కమ్యూనిటీ సెంటర్‌‌లో పాఠాలు చెప్దామనుకుంది. కానీ కమిటీ సభ్యులు దానికి ఒప్పుకోలేదు. చేసేదేమీ లేక కాలనీ పార్కులో పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. చుట్టు పక్కల వాళ్ల నుంచి మళ్లీ గొడవ చేయడంతో ఆ స్కూల్ మూడు పార్కులు మారాల్సి వచ్చింది. అలా మున్సిపల్‌‌ పార్కులో దాదాపుగా పదేండ్లకు పైగా స్కూల్‌‌ను నడిపించింది. ఆమె కష్టాన్ని చూసి ఒక ఎన్జీవో నాలుగు గదుల అద్దె భవనాన్ని స్కూల్ కోసం గిఫ్ట్‌‌గా ఇచ్చింది. అంత వయసులో ఇన్ని కష్టాలు ఎదురైనా స్కూల్ విషయంలో ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఆమె స్కూల్‌‌లో చదువుకున్న పిల్లలు ప్రస్తుతం పేరున్న కాలేజీల్లో సీట్లు సాధిస్తూ.. టాపర్లుగా నిలుస్తున్నారు.

సైకిల్ గురూజీ

ఉత్తరప్రదేశ్‌‌లోని లక్నోకు చెందిన ఆదిత్య కుమార్‌‌ను అందరూ  ‘సైకిల్ గురూజీ’ అని పిలుస్తుంటారు. ఈయన రోజూ 60 నుంచి 65 కిలోమీటర్ల దూరం సైకిల్‌‌పై వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్తాడు. ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే చాలు, అక్కడే ఆగి వాళ్లకి పాఠాలు చెప్తాడు. అది రోడ్డు పక్కన కావచ్చు. పార్క్ కావచ్చు. పాఠాలు చెప్పడానికి ప్లేస్‌‌తో పని లేదంటాడు ఆదిత్య. ఆయన సైకిల్‌‌పై వెళ్తుంటే మురికివాడల్లోని పిల్లలు ఆపి మరీ పాఠాలు చెప్పించుకుంటారు. అలా ఆదిత్య కుమార్.. లక్నోలో మురికివాడల్లో ఉండే పిల్లలకు 1995 నుంచి పాఠాలు చెప్తున్నాడు. 

ఆన్​లైన్​లో లెసన్స్​..

బెంగాల్‌‌కు చెందిన రోషిణి ముఖర్జీకి చిన్నతనం నుంచి టీచర్ కావాలని కోరిక ఉండేది. పీహెచ్‌‌డీ చేసి టీచింగ్‌‌లో అడుగుపెడదామనుకుంది. తండ్రి చనిపోవడంతో చదువు ఆపేసి ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. కానీ టీచర్ కావాలనే ఆమె ప్యాషన్ తనను నిద్రపోనివ్వకపోవడంతో ఉద్యోగం వదిలి,  ఆన్‌‌లైన్ ఎడ్యుకేషన్ పోర్టల్ స్టార్ట్ చేసింది. ఫిజిక్స్‌‌లో మాస్టర్ డిగ్రీ చేసిన రోషిణి 2011లో ‘ఎగ్జామ్ ఫియర్ డాట్‌‌కామ్’ అనే ఆన్‌‌లైన్ వెబ్‌‌సైట్‌‌ను మొదలుపెట్టింది. వీడియోల ద్వారా మ్యాథ్స్, ఫిజిక్స్,  కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను ఉచితంగా చెప్తోంది.  9 నుంచి12 వతరగతి వరకూ అన్ని సైన్స్‌‌ సబ్జెక్టులు ఇందులో ఉంటాయి. ఇప్పటివరకూ ఇందులో ఐదు వేలకు పైగా వీడియోలు అప్‌‌లోడ్ చేసింది రోషిణి. ఈ వెబ్‌‌సైట్‌‌కు సుమారు లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఉచితంగా రకరకాల సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు. ‘రోషిణి టీచర్ వల్ల ఎగ్జామ్స్ అంటే  భయం పోయింద’ని వాళ్లు చెప్తుంటారు.

‘సూపర్’ టీచర్ ఆనంద్

తనకు మంచి టాలెంట్, చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ పేదరికం వల్ల అది కుదరలేదు. అందుకే తనలాంటి పేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశాడు ఆనంద్.  డబ్బు పెట్టి చదువుకోలేని స్టూడెంట్స్‌‌కు ఐఐటీ,- జేఈఈ కోచింగ్‌‌ను ఫ్రీగా అందిస్తున్నాడు. 2000వ సంవత్సరంలో మొదలు పెట్టిన ఈ ప్రోగ్రామ్.. ఇప్పటికీ సక్సెస్‌‌ఫుల్‌‌గా నడుస్తోంది. కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐఐటీల్లో చదువుతున్నారు. ఎంతోమంది జీవితాలను మార్చిన ఈ ‘సూపర్’ గురువుకు ఎన్నో అవార్డులు వచ్చాయి. సత్కారాలు జరిగాయి. ఆనంద్ జీవితం ఆధారంగా ‘సూపర్ 30’ పేరుతో సినిమా కూడా వచ్చింది. రీసెంట్‌‌గా ఆనంద్‌‌కు ‘గణిత రత్న’ అవార్డు కూడా దక్కింది.