
- నెల రోజుల్లో వారెంట్లన్నీ పరిష్కారం వివరాలు వెల్లడించిన
- సీపీ సుధీర్‌బాబు
ఉప్పల్, వెలుగు: రాచకొండ కమిషనరేట్‌లో ఒక్క నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) కూడా పెండింగ్‌లో లేకుండా చేసినట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. నెల రోజుల్లో ఎన్బీడబ్ల్యూ కేసులన్నీ పరిష్కరించినట్లు చెప్పారు. శుక్రవారం ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు నోటీసులు ఇచ్చినా గైర్హాజరు కావడంతో నిందితులపై ఎన్బీడబ్ల్యూ జారీ అవుతుందన్నారు. రాచకొండ కమిషనరేట్‌లో గతేడాది వరకు 1,088 ఎన్బీడబ్ల్యూ వారెంట్లు పెండింగ్‌లో ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 2,847కి పెరిగాయన్నారు.
వీటి పరిష్కారం కోసం 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, తెలంగాణతోపాటు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఉన్న నిందితులను గుర్తించి నెల రోజుల్లో 2,024 మందిని కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. మిగిలిన 823 మంది నిందితులను ప్రకటిత నేరస్తులుగా పరిగణిస్తూ కోర్టు ఆర్డర్స్ జారీ చేయాల్సి ఉందన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీస్ బృందాలకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. కమిషనరేట్ లోని డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.