బంగ్లాదేశ్​లో అవామీలీగ్ పార్టీపై నిషేధం

బంగ్లాదేశ్​లో అవామీలీగ్ పార్టీపై నిషేధం

బంగ్లాదేశ్​ మాజీ ప్రధాని షేక్ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్ పార్టీని నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం మే 12న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం 2009 నాటి ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని సవరించడం ద్వారా ఈ నోటిఫికేషన్​ను వెలువరించింది. 2009 నాటి ఉగ్రవాద వ్యతిరేక చట్టంలో ఏ సంస్థనూ కూడా నిషేధించే ఏర్పాట్లు లేవు. దాన్ని సవరించడం ద్వారా అవామీలీగ్, దాని అనుబంధ, సోదర సంస్థలన్నింటినీ నిషేధించడానికి మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం వీలు కల్పించుకున్నది. 

దీంతోపాటు అవామీలీగ్ పార్టీ, దాని నాయకులపై ప్రత్యేక ట్రిబ్యునల్ విచారణ పూర్తయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్​ప్రభుత్వ నిషేధాన్ని తాము అంగీకరించడం లేదని, తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని అవామీ లీగ్ ఈ ప్రకటనకు ముందు రోజు స్పష్టం చేసింది. దీంతో యూనస్ ప్రభుత్వం రాత్రికి రాత్రే ఒక ఆర్డినెన్స్ ద్వారా టెర్రరిజం వ్యతిరేక చట్టాన్ని సవరణ చేసింది. 

స్థాపన

1949, జూన్ 23న తూర్పు పాకిస్తాన్​లోని ఢాకాలో తూర్పు పాకిస్తాన్ అవామీ ముస్లిం లీగ్​ను స్థాపించారు. ఈ పార్టీ స్థాపనలో మౌలానా అబ్దుల్ హమీద్ ఖాన్  బాషా, ముజిబుర్ రెహమాన్ ముఖ్యమైన పాత్ర పోషించారు. 

లక్ష్యం

పాకిస్తాన్ పాలనలో తూర్పు బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాడటం, ప్రాదేశిక స్వయం ప్రతిపత్తిని సాధించడం ఈ పార్టీ ముఖ్య లక్ష్యాలుగా ఉండేవి. 

స్వాతంత్య్ర పోరాటం
​​​

షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో అవామీలీగ్ బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించింది. 1970 ఎన్నికల్లో అవామీలీగ్ ఘన విజయం సాధించినా, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారాన్ని అప్పగించకపోవడంతో 1971లో స్వాతంత్ర్య యుద్ధం జరిగింది. 

స్వాతంత్య్రం తర్వాత

1971లో బంగ్లాదేశ్​ స్వాతంత్ర్యం పొందిన తర్వాత అవామీలీగ్ దేశాన్ని పాలించిన తొలి పార్టీగా అవతరించింది. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్​ మొదటి ప్రధాన మంత్రి అయ్యారు.