బెంగళూరు హ్యాట్రిక్ విజయం

బెంగళూరు హ్యాట్రిక్ విజయం
  • 38 పరుగుల తేడాతో కోల్‌కతా చిత్తు
  • అదరగొట్టిన గ్లెన్ మ్యాక్స్ వెల్, డివిలియర్స్

చెన్నై: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐపీఎల్-14 సీజన్లో వరుసగా మూడు మ్యాచుల గెలుపుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి చేరుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచులో బెంగళూరు అన్ని విభాగాల్లో రాణించి కోల్ కతాను చిత్తు చేసింది. కెప్టెన్ కోహ్లి నిరాశ పరచినా గ్లెన్ మ్యాక్స్ వెల్, డివిలియర్స్ అదరగొట్టారు. బౌలర్లను ఊచకోత కోస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. మైదానంలో నలువైపులా యధేచ్చగా షాట్లు కొడుతూ బౌలర్లు, ఫీల్డర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్ లోనే చుక్కెదురైంది. ఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (5), ఆ వెంటనే వన్ డౌన్ బ్యాట్స్ మన్ రజత్ పాటిదార్(1) ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ కు పంపాడు. దీంతో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు తీవ్రంగా ఇబ్బందుల్లో పడిపోయింది. మ్యాక్స్ వెంట్ కు జత కలసిన పడిక్కల్ మెల్లగా సింగిల్స్.. అప్పుడప్పుడు ఫోర్లు కొడుతూ స్కోరు నిలకడగా ఉండేటట్లు చేశాడు. మూడో వికెట్ కు ఇద్దరూ కలసి 86 పరుగులు జోడించి ఊపుమీదున్న తరుణంలో 12వ ఓవర్ లో పడిక్కల్ ను ప్రిసిద్ధ్ బోల్తా కొట్టించాడు.  
మ్యాక్స్ వెల్, డివిలియర్స్ జోడీ దూకుడు
12 ఓవర్లకు 86/3 స్కోరుతో పడుతూ లేస్తూ సాగుతున్న బెంగళూరు రన్ రేట్ జోరందుకుంది. వీరి దూకుడుకు బ్రేక్ వేసేందుకు కోల్ కతా తీవ్రంగా శ్రమించింది. యధేచ్చగా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన మ్యాక్స్ వెల్, డివిలియర్స్ జోడీని విడగొట్టేందుకు 17వ ఓవర్లో హర్భజన్ బంతి తీసుకున్నాడు. అప్పటి వరకు బౌలర్లకు చుక్కలు చూపించిన మ్యాక్స్ వెల్ (78.. 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు)ను హర్భజన్ ఊరించే బంతితో వికెట్ తీసుకున్నాడు. దీంతో స్కోరు 148/4 గా ఉంది. ఇంక మిగిలింది మూడు ఓవర్లే. పట్టుబిగించిన కోల్ కతా ఆశలను వమ్ము చేస్తూ బౌలర్లను డివిలియర్స్ ఊచకోత కోశాడు. జేబీసన్ తో కలసి చివరి 18 బంతుల్లో 56 పరుగులు పిండుకున్నాడు. డివిలియర్స్ కేవలం 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన కోహ్లి, ఆ తర్వతా వన్ డౌన్ బ్యాట్స్ మెన్ నిరాశ పరచినా.. బెంగళూరు కోలుకుని  కోల్ కతా ముందు 204 పరుగులు చేసి కోల్ కతాకు భారీ టార్గెట్ నిర్దేశించింది. 
కోల్‌కతా తడబడుతూ..నెమ్మదిగా ఆడి రన్ రేట్ పెరగడంతో చేతులెత్తేసింది 
బెంగళూరు నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ కు  కేకేఆర్‌కు మంచి ఓపెనింగ్ తో ఆశలు రేకెత్తించింది. భారీ టార్గెట్ కావడంతో ఆచితూచి ఆడడం వల్ల మధ్యలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో స్కోరు రన్ రేట్ దారుణంగా పెరిగిపోయింది.  వికెట్లు త్వరగా కోల్పోవడంతో తదుపరి బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరిగింది. మరో వైపు బెంగళూరు బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివర్లో రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది.రసెల్ (31, 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (29, 23 బంతుల్లో  ఒక ఫోర్, 2 సిక్సర్లతో) టాప్ స్కోరర్లుగా నిలిచారు.  ఆఖరి ఓవర్లలో ఆండ్రూ రస్సెల్(31: 20 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌలర్లపై ఎదురుదాడి చేసినా అప్పటికే రన్ రేట్ దారుణంగా పెరిగిపోవడంతో  విజయానికి పూర్తిగా దూరమైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ ను బెంగళూరుకు సమర్పించుకుంది. ఆర్సీబీ బౌలర్లలో జేమిసన్ 3, చాహల్ 2 వికెట్లు పడగొట్టగా,  వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు.