బంకర్​ రియల్​ ఎస్టేట్

బంకర్​ రియల్​ ఎస్టేట్

అమెరికాలో జోరందుకున్న ‘అండర్​గ్రౌండ్​’ బిజినెస్​

మనసులో ఉండే భయం ఎంత పనైనా చేయిస్తుంది. ఎంతైనా ఖర్చు పెట్టిస్తుంది. ఎన్ని జాగ్రత్తలైనా తీసుకునేలా చేస్తుంది. ఉదాహరణకు, హెల్త్​ ఇన్సూరెన్స్​నే తీసుకుందాం. భవిష్యత్తులో ఏదైనా రోగం వస్తే ఎట్ల అన్న ఆలోచన హెల్త్​ ఇన్సూరెన్స్​ను తీసుకునేలా చేస్తుంది. అది భయం కావొచ్చు, ముందుచూపు కావొచ్చు.. కారణం ఏదైతేనేం. ఆ విషయాన్ని పక్కనపెడదాం. అసలు విషయానికొద్దాం. ప్రకృతి నానాటికీ విషమిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా విపత్తులు విరుచుకుపడుతున్నాయి. సైబర్​ ఎటాక్​లు ఎక్కువయ్యాయి. టెర్రర్​ ఎటాక్​లు పెచ్చుమీరుతున్నాయి. దేశంలోపలే యుద్ధాలు, ఆందోళనలు పెరిగాయి. మానవాళికి కొత్త కొత్త ముప్పులు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ తప్పించుకునేదెలా? అవన్నీ ఒకేసారి మీదపడితే మనిషి అనేవాడు మిగులుతాడా? అని భయం.. ఆ భయంతోనే సరికొత్త ‘రియల్​ ఎస్టేట్​’ బిజినెస్​ అమెరికాలో జోరందుకుంది. అదే ‘బంకర్​ రియల్​ ఎస్టేట్​’ అలియాస్​ కాండోమినియం. విలయం ముప్పు మాట దేవుడెరుగు, ఆ ముప్పు భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు రియల్​ వ్యాపారులు. వాళ్లను ముందుండి నడిపిస్తున్నది లారీ హాల్​ అనే వ్యాపారి. ఏంటా కాండోమినయం, దాని లెక్కేందో కథేందో తేల్చేద్దాం.

భూమి లోపల 15 అంతస్తులు. విశాలమైన గదులు. స్విమ్మింగ్​పూల్స్​, సానా (స్టీమ్  బాత్​ – ఆవిరి స్నానం చేసే గదులు), సినిమా థియేటర్లు, షూటింగ్​ నేర్చుకునే సెంటర్లు, జిమ్ములు, రెస్టారెంట్లు.. ఒక్కటేంటి బయట మామూలు రియల్​ ఎస్టేట్​ వెంచర్లలో ఉండే సౌకర్యాల కన్నా ఎక్కువ సౌలతులున్నాయి అందులో. అమెరికా సైన్యం ఒకప్పుడు వాడిన న్యూక్లియర్​ మిసైల్​ వాల్ట్​ (అణు క్షిపణులను దాచి ఉంచే చోటు)ను విలాసవంతమైన కాండోమినియంగా మార్చేశారు హాల్​. దానికి ఆయన చెప్పే కారణం ఒక్కటే.. భవిష్యత్తులో ఎదురయ్యే ప్రకృతి విలయాలను తట్టుకుని మనిషి అనే ఓ జీవి బతకాలంటే ఇలాంటి నివాసయోగ్యమైన బంకర్లు అవసరం అని. నిజానికి అమెరికన్లు ఇప్పుడే కాదు, కోల్డ్​ వార్​ (ప్రచ్ఛన్న యుద్ధం) టైం నుంచే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఆ యుద్ధం టైంలో తమను తాము కాపాడుకోవడానికి ఇలాంటి బంకర్ల వైపే మొగ్గు చూపారు. 2000వ సంవత్సరం నాటికి అది వాళ్ల మెదళ్లలో మరింత నాటుకు పోయింది. మారుతున్న వాతావరణం, టెర్రర్​ ముప్పు, సైబర్​ దాడులు, పౌర యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు తదితర ముప్పుల భయంతో బంకర్ల బాట పడుతున్నారు. అదిప్పుడు కోట్ల డాలర్ల బిజినెస్​గా మారిపోయింది.

మిలటరీ అండర్​గ్రౌండ్​ వాల్ట్​లే

కోల్డ్​ వార్​ టైంలో అమెరికా సైన్యం అణు బాంబులు, ఇతర యుద్ధ సామగ్రిని దాచుకోవడానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి దేశంలో అండర్​ గ్రౌండ్​ వాల్ట్​లు కట్టింది. కన్సాస్​, నెబ్రాస్కా, ఓక్లహోమా, న్యూ మెక్సికో వంటి ప్రాంతాల్లో వాటిని నిర్మించింది. యుద్ధం అయిపోయాక ఆ బంకర్లన్నీ ఖాళీ అయ్యాయి. పాడుపడిపోతున్నాయి. ఇప్పుడు ఆ వాల్ట్​లే రియల్​ వ్యాపారులకు బాగా ఉపయోగపడుతున్నాయి. బంకర్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం హాల్​ అలాంటి 12 అపార్ట్​మెంట్లను ‘హాల్స్​ సర్వైవల్​ కాండో’ పేరిట కన్సాస్​లో కట్టారు. 2011లో సుమారు ₹9.28 కోట్ల (13 లక్షల డాలర్లు)తో ఆ వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదలుపెట్టిన కొన్ని నెలలకే కట్టిన అన్ని యూనిట్లు అమ్ముడుపోయాయని ఆయన చెబుతున్నారు. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదని, జనాల ప్రాణాలు కాపాడుతున్నామని అంటారాయన. హాల్​ కాండోలో సేవలు కావాలనుకునేవాళ్లు నెలకు 2600 డాలర్లు (సుమారు ₹1.85 లక్షలు) కట్టాల్సిందే. దానికి తగ్గట్టే సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఫ్రెష్​ గాలి వచ్చేలా ఎయిర్​ ఫిల్టర్లు, ఎలక్ట్రికల్​ గ్రిడ్​, నీళ్ల అవసరాల కోసం ఓ పెద్ద మంచినీళ్ల బావి, కరెంట్​ పోతే డీజిల్​ జనరేటర్లున్నాయి. ఒకవేళ అవీ పనిచేయకపోతే బ్యాకప్​గా విండ్​ టర్బైన్లతో తయారు చేసే కరెంట్​ను ఇచ్చేందుకు బ్యాటరీ బ్యాంకులను ఏర్పాటు చేశారు. ఈ బంకర్​లోకి వెళ్లే దారికి పెట్టిన గేటు బరువే 16 టన్నులు. ప్రభుత్వమే అండర్​ గ్రౌండ్​ వాల్ట్​లు అమ్ముతున్నప్పుడు వ్యాపారం చేసుకుంటే తప్పేంటని హాల్​ ప్రశ్నిస్తున్నారు. 9/11 దాడుల తర్వాత హాల్​ ఈ సరికొత్త బంకర్లకు ప్లాన్​ వేశారు. కోట్లు ఖర్చు పెట్టి మిలటరీ కట్టిన ఆ వాల్ట్​ను కేవలం 3030 డాలర్లకే ఓ వ్యక్తికి మిలటరీ అమ్మేసింది. అతడి నుంచి 2008లో 3 లక్షల డాలర్లకు (సుమారు రూ.2.14 కోట్లు) కొన్నాడట హాల్​.

విమర్శకులు.. మద్దతుదారులు

ఈ ప్రాజెక్టులను విమర్శించేటోళ్లూ ఉన్నారు, వాటికి మద్దతు పలికేవాళ్లూ ఉన్నారు. ‘‘సెక్స్​ కన్నా భయం ఎక్కువ వ్యాపారం చేస్తది” అని యూనివర్సిటీ ఆఫ్​ కన్సాస్​ ఏంత్రపాలజీ (మనిషిని చదివే సబ్జెక్ట్​) ప్రొఫెసర్​ జాన్​ డబ్ల్యూ హూప్స్​ అంటున్నారు. 2012లో ప్రపంచం అంతమైపోతుందన్న ఓ పుకారును ఏళ్లతరబడి స్టడీ చేసిన ఆయన, అదంతా ఒట్టిదేనని తేల్చారు. జనానికి లేని భయాన్ని పుట్టిస్తే, ఇప్పుడు కడుతున్న బంకర్లతో సహా దేన్నైనా ఇట్లే అమ్మేయొచ్చని అన్నారు. కొందరు జనాలు మాత్రం బంకర్లు కడితే తప్పేంటని ఈ సరికొత్త ఆలోచనకు వంత పాడుతున్నారు. పెనుముప్పు పొంచి ఉన్న సొసైటీ నుంచి దూరంగా వెళ్లి ఉండాలనుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. ఇంకో విషయం ఏంటో తెలుసా, ఇప్పటికే ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకుని కొత్త ఇన్సూరెన్స్​లూ పుట్టుకొస్తున్నాయి. అందులో ఒకటి ఫార్టిట్యూడ్‌​ రాంచ్​ అనే ఓ కమ్యూనిటీతో ఇన్సూరెన్స్​ స్కీమ్​ వచ్చింది.

అమ్మేస్తున్నరు

ఏవన్​ కాస్మెటిక్స్​ అనే సంస్థ లాస్​వేగాస్​లో ఓ అండర్​ గ్రౌండ్​ బంకర్​ను కట్టింది. అధునాతమైన కిచెన్​, చెట్టు మొద్దులను కాల్చే ప్లేస్​లను ఏర్పాటు చేసింది. దానిని సుమారు ₹128 కోట్లకు (1.8 కోట్ల డాలర్లు)కు అమ్మకానికి పెట్టింది. 20 సెంచరీ కాసిల్స్​ అనే సంస్థ సాయంతో కన్సాస్​లోని ఓ జంట పాడుపడిన మిసైల్​ బంకర్లను అమ్ముతోంది. కొలరాడోలో లూప్​నెట్​ అనే సంస్థ ఆయుధాలను దాచే అండర్​గ్రౌండ్​ సొరంగాలను సుమారు 30 కోట్ల రూపాయలకు (42 లక్షల డాలర్లు) అమ్మకానికి పెట్టింది. కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్​ విసినో అనే రియల్​ ఎస్టేట్​ సంస్థ ఇండియానాలో ప్రభుత్వ స్థలాన్ని కొని వివోస్​ పేరిట అండర్​గ్రౌండ్​లో కోట కట్టేసింది. ఎట్ల అంటే అది ఓ ఫోర్​ స్టార్​ హోటల్​లో ఉండే సౌకర్యాలన్నీ అందులో ఉంటాయి. అంతేకాదు, సౌత్​ డకోటాలో ఒకప్పుడు ఆయుధాలను దాచిన 575 సెల్లార్లనూ కంపెనీ కొనేసింది.