
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఐక్య పోరాటాలతో ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాల మెడలను వంచుదామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చాడు. బీసీ విద్యార్థి యువజనుల పోరుయాత్ర పేరుతో చేపట్టిన యాత్ర శుక్రవారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులు, నియామకాలు, నీళ్ల కోసం మలిదశ ఉద్యమంలో యువత ఆత్మార్పణ చేస్తే వచ్చిన తెలంగాణలో వారి బతుకులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. 12 లక్షల మంది స్టూడెంట్లకు రూ.3200 కోట్ల ఫీజు రీయింబర్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా ఎవరడిగారని హైదరాబాద్ మెట్రో నగరానికి రూ.6,200 కోట్లతో రెండో ప్రాజెక్టు చేపట్టారని ప్రశ్నించారు. ‘మన ఓటు మనమే వేసుకోవాలి.. మన పాలన మనమే చేసుకోవాలి’ అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ సామాజిక బాధ్యతతో యువతను మేల్కొపడానికే పోరు యాత్ర చేపట్టామని తెలిపారు. డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతినిధులు ఎన్నో రెట్లుగా వేతనాలు పెంచుకుంటే విద్యార్థులకు కనీసం రూ.1800 ఉపకార వేతనాన్ని కూడా మూడేళ్లుగా చెల్లించకపోవడం విచారకరమన్నారు. సమావేశంలో బీసీ సెంట్రల్ కమిటీ సభ్యులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ యువజన సంఘం నాయకులు శ్యామ్ కురుమ, ఓబీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యువత సంఘం కన్వీనర్ రమేశ్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జగదీశ్, పుష్ప నగేశ్‌యాదవ్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
క్రిస్మస్ గిఫ్టుల పంపిణీ
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ శుక్రవారం క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు, బట్టలు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు ప్రాధన్యత ఇస్తోందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, తదితరులు పాల్గొన్నారు.
ఆరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో సెలబ్రేషన్స్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు:పటాన్చెరు పట్టణ పరిధిలోని ఆరిజిన్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ స్టూడెంట్స్ వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. శాంటాక్లాజ్ వేషాలతో స్టూడెంట్స్ బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. స్కూల్ ప్రెసిడెంట్ తక్కెలపల్లి ప్రమోద్ కుమార్, టీచర్లు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు.
రైతుల నడ్డి విరుస్తున్న మోడీ సర్కార్
మెదక్/సిద్దిపేట/కంది/చేర్యాల, వెలుగు: కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ రైతుల నడ్డి విరుస్తోందని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పలుచోట్ల రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌లో మెదక్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డిలో టీఎస్ హెచ్‌డీసీ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తోపాటు ఆయా చోట్ల పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరితే చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాల కోసం కల్లాలు నిర్మిస్తే ఫండ్స్ ఇవ్వకుండా నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు.కేంద్రం కార్పొరేట్ల కొమ్ముకాస్తూ వారికి వేలకోట్ల రూపాయలు మాఫీ చేస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక బీజేపీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
సిద్ధిపేటరూరల్, వెలుగు : బైక్ ను కారు ఢీకొట్టడంతో ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాల స్టేజి వద్ద శుక్రవారం జరిగింది. చిన్నకోడూరు ఎస్సై శివానందం తెలిపిన ప్రకారం.. గుర్రాల గొంది గ్రామానికి చెందిన బెజగం లింగం గురువారం తన భార్య లత, పెద్ద కూతురు సంధ్య (22), చిన్న కుమారుడు యశ్వంత్‌తో కలిసి రామునిపట్లలోని తన బంధువుల ఇంటికి గురువారం రెండు బైక్‌లపై వెళ్లి శుక్రవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మల్యాల శివారులో ఎదురుగా వచ్చిన కారు యశ్వంత్, సంధ్య వెళ్తున్న బైక్ ను వేగంగా ఢీకొట్టింది. గాయపడిన వారిద్దరిని సిద్దిపేటలోని మురళి కృష్ణ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. సంధ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
జహీరాబాద్, వెలుగు : జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. పట్టణ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన ప్రకారం.. జహీరాబాద్ పట్టణం గడి మోహలాకు చెందిన మంగలి నర్సింలు(38) మొగుడంపల్లి చౌరస్తా వద్ద బైక్ పై వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న ట్రాక్టర్ సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా కుడి వైపునకు టర్న్ కావడంతో బైక్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో నర్సింలు అక్కడికక్కడే చనిపోయాడు. ఇదిలా ఉండగా జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ఇంద్ర ప్రస్తా కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి(50)ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. ఈ మేరకు రెండు ఘటనల్లో కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
నష్టపరిహారం చెల్లించాలని సీఎంకు పోస్టు కార్డులు
పాపన్నపేట, వెలుగు:మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో గతేడాది నీటిలో మునిగిన పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్‌కు రైతులు ఉత్తరాలు రాశారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా గ్రామంలో శుక్రవారం రైతులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకుడు కొండల్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది పంట మునిగిపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో 2005 జాతీయ విపత్తు చట్టం అమలులో ఉన్నా, ఎన్టీఆర్ఎఫ్ నుంచి ఏటా నిధులు అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ కనీసం నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతు స్వరాజ వేదిక జిల్లా కన్వీనర్ బాలరాజు, కో- కన్వీనర్ సామ్యూల్, కుర్తివాడ రైతులు ఈర్ల జగన్ రెడ్డి, పట్లోళ్ల నాగరాజు, నారాయణ పాల్గొన్నారు.
- మోడీ చెప్పిన అచ్చేదిన్ కార్పొరేట్లకే..
- కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్ కుట్టి
- ముగిసిన సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేట రూరల్, వెలుగు: అచ్చే దిన్ అంటూ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన మోడీ కార్పొరేట్ పాలన సాగిస్తున్నారని, అన్ని జాతీయ సంస్థలను కార్పొరేట్ దోస్తులకు దానంగా ఇస్తున్నారని కేరళ కార్మిక శాఖ మంత్రి శివన్ కుట్టి ఆరోపించారు. సిద్దిపేటలో మూడు రోజులపాటు నిర్వహించిన సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు శుక్రవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా రెడ్డి సంక్షేమ భవన్ నుంచి డిగ్రీ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం వ్యవహారంతో కార్మికులకు ఏ సంక్షేమాలు అందడం లేదన్నారు. కేరళలో అంగన్వాడీ వర్కర్లకు రూ.12 వేలు వస్తే యూపీలో రూ.4 వేలు వస్తున్నాయని, ‘ఇదేనా సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ అంటే’ అని విమర్శించారు. వ్యవసాయ రంగం పడిపోవడం వల్ల కోట్లాది ప్రజలు కూలీలుగా వలసలు వెళ్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలను పడగొట్టాలని బీజేపీ చూస్తోందన్నారు. అంతకుముందు సీఐటీయూ రాష్ర్ట అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడుతూ పెరిగే ధరలకు అనుగుణంగా హమాలీ, సుతారి, బీడీ, లాంటి ఎనిమిది రంగాల కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మహాసభ తీర్మానించిందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ర్ట ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ర్ట కార్యదర్శులు భాస్కర్, రమ, సిద్దిపేట జిల్లా అధ్యక్షు కార్యదర్శి గోపాలస్వామి, ఎల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్, శశిధర్, అరవింద్ పాల్గొన్నారు.
విపత్తు నష్టం తగ్గిచేందుకే ఎన్డీఆర్ఎఫ్
మెదక్, వెలుగు: ఏదైనా ప్రమాదాం, విపత్తు జరిగినప్పుడు నష్టాన్ని తగ్గించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ముందుంటుందని మెదక్అడిషనల్కలెక్టర్ రమేశ్అన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రాణహాని, ఆస్తి నష్టం జరగకుండా తక్షణమే ఎలా స్పందించాలో అవగాహన కలిగించేందుకు శనివారం చిన్న శంకరంపేట్ మండల కేంద్రం లోని రాధ స్మెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నామని తెలిపారు. శుక్రవారం తన చాంబర్ లో హకీంపేట్ కు చెందిన తెలంగాణ రీజియన్ ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దామోదర్ సింగ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమావేశమై సహాయక చర్యలపై చర్చించారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్డీఓ సాయి రామ్, డీఎస్ ఓ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లక్ష్మి కుమారి, మత్స్య శాఖాధికారి రజిని, అగ్ని మాపక కేంద్రం అధికారి శ్రీశైలం, తూప్రాన్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మోహన్ ఉన్నారు.