జ్వరాలతో గురుకులాల్లో ఐదుగురు విద్యార్థులు మృతి

జ్వరాలతో గురుకులాల్లో ఐదుగురు విద్యార్థులు మృతి
  • ఆసిఫాబాద్​ జిల్లాలో 15 రోజుల్లో గురుకులాలు, హాస్టళ్లలో ఐదుగురు మృతి

ఆసిఫాబాద్, వెలుగు: గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్న పిల్లలు జ్వరాలతో పిట్టల్లా రాలుతున్నా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ప్రజాప్రతినిధుల్లో కనీసం చలనం కలగడం లేదు. గడిచిన  15 రోజుల్లో కుమురం భీం ఆసిఫాబాద్​జిల్లాలో​ఐదుగురు  స్టూడెంట్స్​చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కానీ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ఘటనలపై కనీసం ఒక రివ్యూ కూడా నిర్వహించలేదు. స్టూడెంట్లు ఎందుకు జ్వరాల బారిన పడ్తున్నారు? జ్వరంతో చనిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మిగిలిన విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉంది? లాంటి వివరాలు తెలుసుకుని సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడ్తున్నారు. ‘ఇలాంటి ఎమ్మెల్యేలు, అధికారులు ఉండి ఎందుకు?’ అంటూ విమర్శిస్తుండడంతో శుక్రవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఒక్కరు బయటకు వచ్చి మొహం చూపించారు.

తమ పిల్లలను బాగా చదివించాలనే ఆశతో తల్లిదండ్రులు గురుకులాలు, హాస్టళ్లలో చేర్పిస్తే అక్కడ సమస్యలే దిక్కవుతున్నాయి. అనారోగ్యానికి గురైతే సకాలంలో పట్టించుకునేవారు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 15 రోజుల్లో ఆసిఫాబాద్​ జిల్లాలోని వెల్ఫేర్​హాస్టళ్లలో చదువుతున్న ఐదుగురు స్టూడెంట్లు జ్వరాలు, ఇతర వ్యాధులతో మృతిచెందారు. ఆగస్ట్ 24న పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు ఆశ్రమ గిరిజన పాఠశాలలో టెన్త్ చదువుతున్న రాజేశ్(15), ఆగస్ట్ 28న సిర్పూర్ టిలోని కాగజ్ నగర్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ గోమాసే అశ్విని, ఆగస్ట్ 29న తిర్యాణి ఆశ్రమ స్కూల్ లో ఆరో తరగతి స్టూడెంట్ రమేశ్(12), ఆగస్ట్ 31న ఆసిఫాబాద్ లోని బూరుగూడ గిరిజన బాలికల డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజ్ లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న లావుడ్య సంగీత(19) , ఈ నెల 7న కాగజ్ నగర్ లోని కేజీబీవీలో 8వ తరగతి స్టూడెంట్​నగోసే ఐశ్వర్య(13) చనిపోయింది. పెద్దసంఖ్యలో స్టూడెంట్లు జ్వరాలబారిన పడి ఆసుపత్రులపాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల్లో స్పందన కరువైంది. అనారోగ్యంతో ఏకంగా ఐదుగురు స్టూడెంట్లు చనిపోయినా ఇప్పటివరకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుగానీ, ఎమ్మెల్సీగానీ,  జడ్పీ చైర్​పర్సన్​గానీ  హాస్టళ్లను సందర్శించలేదు. మృతుల కుటుంబాలకు సైతం కనిపించకుండా ముఖం చాటేస్తున్నారు. ఈక్రమంలో లీడర్ల తీరుపై సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు స్టూడెంట్ల మృతిపై విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. మరణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. 

కదిలిన కోనప్ప.. 
‘హాస్టళ్లలో మరణ మృదంగంపై ముఖం చాటేసిన ఎమ్మెల్యే’, ‘కనీసం పరామర్శకు రాని ఎమ్మెల్యే ఎందుకు?’, ‘సాలు అప్పా.. సెలవు అప్పా.. ఓ కోనప్పా’ అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ప్రశ్నించారు. దీంతో దిగివచ్చిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాగజ్ నగర్ కస్తూర్బా గాంధీ బాలికల బడిలో చదువుతూ జ్వరంతో చనిపోయిన నగోసే ఐశ్వర్య తల్లిదండ్రులను శుక్రవారం అంకుశాపూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. ఐశ్వర్య తండ్రి శంకర్ కు 10 రోజులలోపు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, త్వరలో ఎక్స్ గ్రేషియా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రూ.  10వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఎవరికోసం ఈ లీడర్లు?

ఐదుగురు స్టూడెంట్స్ చనిపోయినా జిల్లా ప్రజాప్రతినిధులు కనీసం హాస్టళ్లకు వెళ్లి పరిశీలించలేదు. మృతుల కుటుంబీకులను పలకరించలేదు. వీరంతా ఎవరికోసం పని చేస్తున్నట్లు? స్టూడెంట్ల మృతికి హాస్టల్​సిబ్బంది కారణమైతే వారిపై చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈ దిశగా లీడర్లు చొరవ తీసుకోవాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధుల్లో ఇప్పటికైనా చలనం రావాలి. అధికారులు, లీడర్లు హాస్టళ్లపై పర్యవేక్షణ పెంచాలి. అవసరమైతే హాస్టళ్లలో బస చేయాలి. 

- దుర్గం దినకర్, సీపీఐ లీడర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి