Love : అట్లయితేనే ప్రేమించండి.. లేకపోతే అస్సలు ప్రేమించొద్దు.. బీ కేర్ ఫుల్

Love : అట్లయితేనే ప్రేమించండి.. లేకపోతే అస్సలు ప్రేమించొద్దు.. బీ కేర్ ఫుల్

ప్రేమ అంటే... 'ఒకరిపై మరొకరికి అధికారం ఉంటుంది' అనుకుంటే పొరపాటు, అంగీకారం ఉండాలి. గౌరవం, కేరింగ్, బాధ్యత, షేరింగ్... లాంటివి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి. అలాగే ఒకరిలో ఉన్న మంచి, చెడు, బలాలు, బలహీనతలను మరొకరు స్వీకరించాలి. భావోద్వేగాలను పంచుకోవాలి. డిమాండ్లు పనికిరావు. స్పష్టంగా మాట్లాడాలి. సినిమాలు, షికార్లు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ చేయడం.. లాంటివన్నీ ప్రేమలో కామన్. పనుల్లో సాయం చేయాలి. 

‘నాలుగు రోజులు కలిసి తిరిగి, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం' అని ఫ్రెండ్స్ అందరికీ చెప్పి, నెల తిరక్క ముందే విడిపోతున్న ప్రేమికులు ఉన్నారు. అలాగే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా నిలబడి, కలిసి ఉంటున్న జంటలూ ఉన్నారు. తేడా ఏంటంటే... ప్రేమలో నిజాయితీ ఉండడమే. ఒకరిపై మరొకరికి నమ్మకం, మంచి అభిప్రాయం ఉండటం. ఇద్దరి మధ్యా ఆకర్షణే కాకుండా, అంతకు మించిన మానసిక పరిపక్వత ఉండడం. అందుకే ప్రేమకు కావాల్సింది మంచి వ్యక్తిత్వం. అర్థం చేసుకునే మనసు, ప్రేమించిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని వెంటనే అంచనా వేయలేకపోవచ్చు కానీ, తర్వాత ఎవరు ఎలాంటి వాళ్ల తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నాకే ప్రేమను కొనసాగించాలా, వద్దా అని కచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రేమకు వ్యక్తిత్వాన్ని మించిన విలువ మరొకటి లేదు. 

సంతోషం

ప్రేమికులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారని చెప్పలేం. కానీ సంతోషంగా ఉండటానికే ప్రయత్నించాలి. ప్రేమలో అలకలు, తగాదాలు, బతిమాలడం... అన్నీ ఉంటాయి. అయితే ఇద్దరి మధ్య ప్రేమ బలంగా ఉన్నప్పుడు చిన్నచిన్న సమస్యలు ఏమీ చేయలేవు. ఒకరు దిగులుగా ఉన్నప్పుడు మరొకరు ఓదార్పు ఇవ్వాలి.
సంతోషంగా ఉంచడానికి ట్రై చెయ్యాలి. టైం కేటాయించాలి. ప్రేమలో సంతోషంగా ఉండటం అనేది ప్రేమికుల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకరికి నచ్చినట్లు మరొకరు.. నడుచుకోగలిగితే, సొంత ఆలోచనలతో పాటు ఎదుటి వాళ్లను తమలాగా చూడగలిగితే ఆ ప్రేమ సంతోషంగా ఉంటుంది. చిన్నచిన్న అభినందనలు. భరోసా ఇవ్వటం.. లాంటివి ప్రేమికులను సంతోషంగా ఉంచుతాయి. 

ఎవరికి వాళ్లే..

ప్రేమ ప్రయాణం మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నా ఇష్టాలేంటి? నా అభిప్రాయాలేంటి? ప్రేమ గురించి నాకున్న ఆలోచనలు కరెక్టేనా? నాది ప్రేమా, ఇష్టమా, ఆకర్షణా? ఎదుటి వాళ్లు నా నుంచి ఏమి కోరుకుంటున్నారు? నా ప్రేమలో నిజాయితీ ఉందా? నేను ఇష్టపడే వాళ్లు ఎంతవరకు సరైన వాళ్లు? ప్రేమను ఇవ్వడంలో, తీసుకోవడంలో నా ఆలోచనలు ఎలా ఉన్నాయి? నేను ప్రేమించే వాళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకవేళ బ్రేకప్ అయితే పాజిటిస్ గా తీసుకోగలనా? చిన్నచిన్న తడబాట్లు, పొరపాట్లు జరిగితే తట్టుకొని ముందుకు వెళ్లగలనా? అవసరం అయితేనా అభిప్రాయాలు మార్చుకోగలనా? అవతలి వాళ్లు కూడా మార్చుకుంటారా? లాంటి ప్రశ్నలను ఎవరికి వాళ్లు వేసుకోవాలి. వీటికి సరైన సమాధానాలు వస్తే ప్రేమలో రాబోయే సమస్యలను అధిగమించొచ్చు. 

కుటుంబాలతో కనెక్ట్

ప్రేమలోకి ఎంటర్ అయ్యాక, కచ్చితంగా కొన్ని కండీషన్స్ పాటించాల్సిందే. ఒకరికోసం ఒకరు టైం కేటాయించాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వాలి. ఏది మంచి, ఏది చెడు? ఏది ఉపయోగం, ఏవి ఇబ్బంది. కలిగిస్తాయి? అన్నింటిని కలిసి నిర్ణయించుకోవాలి. ఒక్కసారి లవ్ లోకి ఎంటర్ అయ్యాక ఎగ్జిక్ట్ అవుదామంటే అంత ఈజీ కాదు. చిన్నచిన్న గొడవలు వస్తే సరిదిద్దడానికి, చక్కబెట్టడానికి కుటుంబ సభ్యుల సహాయం ఉండాల్సిందే. అందుకే ప్రేమికులు కుటుంబాలకు దూరం కాకుండా చూసుకోవాలి. చిన్నచిన్న గ్యాప్లు పూర్తి చేసి, అవసరాలప్పుడు అక్కున చేర్చుకుంటారు అమ్మానాన్నలు.  

బ్రేకప్ కు సిద్ధమా? 

'ఇంతకాలం ప్రేమించుకున్నాం. ఇప్పుడు వద్దనిపిస్తుంది. నువ్వు నచ్చడం లేదు. విడిపోదాం' అని ఇద్దరిలో ఏ ఒక్కరు చెప్పినా స్వీకరించే మానసిక ధైర్యం అవతలి వాళ్లకు ఉండాలి. ప్రేమ బలవంతంగా ఒప్పించేది కాదు. మనస్ఫూర్తిగా ఇచ్చేది. మనస్ఫూర్తిగా తీసుకునేది. ఇద్దరిలో ఏ ఒక్కరు బ్రేకప్ చెప్పినా కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించవచ్చు. కానీ, బలవంతంగా వెంటపడకూడదు. మానసికంగా హింసించడం, శారీరక దాడులు చేయడం నేరమే అవుతుంది.. మెసేజ్లు, వీడియోలు, ఫొటోలు పంపి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి క్రైం మెంటాలిటీ ఉన్న వాళ్లు చేసేపని. కాబట్టి  ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత దూరం అవడమే మంచిది. అందుకే, ప్రేమించే ముందే.. విడిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగని విడిపోవడానికే ప్రేమించే పరిస్థితి ఉండకూడదు.