రష్యాపై భారత్ ఆధారపడటం మాకు నచ్చట్లే

రష్యాపై భారత్ ఆధారపడటం మాకు నచ్చట్లే

వాషింగ్టన్: భారత్, రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడటాన్ని తాము ఏమాత్రం ప్రోత్సహించమని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడింది. ‘డిఫెన్స్ అవసరాల కోసం రష్యాపై భారత్ సహా ఏ దేశమూ ఆధారపడొద్దు. ఈ విషయంలో మా వైఖరిని స్పష్టంగా తెలియజేశాం. రష్యా మీద ఆధారపడటాన్ని మేం ఏమాత్రం ప్రోత్సహించబోం. అదే సమయంలో ఇండియాతో ఉన్న మా రక్షణ భాగస్వామ్యానికి విలువిస్తాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. ప్రాంతీయంగా భారత్ ఓ రక్షణ ఛత్రంలా పని చేస్తోంది. దాన్ని మేం విలువిస్తున్నాం’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ అన్నారు. 
 
2018లో భారత్ ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ సిస్టమ్స్ కొనుగోలు కోసం రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది. దీన్ని ట్రంప్ సర్కారు  వ్యతిరేకించినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు. పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇండియా ఈ విషయంలో ముందుకెళ్లింది. ఇదే ఎస్–400 వ్యవస్థల్ని కొనుగోలు చేసిన టర్కీపై యూఎస్ ‘కాట్సా’ ఆంక్షల్ని  ప్రయోగించింది. కాగా, ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా.. ఈ విషయంలో భారత్ వైఖరిపై అసంతృప్తిగా ఉంది. రష్యాతో భారత్ బంధాన్ని కొనసాగించడంపై అగ్రరాజ్యం విమర్శలు చేసింది. 

మరిన్ని వార్తల కోసం:

పాంటింగ్ ఉంటే అలా జరిగుండేది కాదు

ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్

ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం