డబుల్ బెడ్రూం సైట్లలో వెయ్యికి పైగా ఇండ్లు ఖాళీగానే..

డబుల్ బెడ్రూం సైట్లలో వెయ్యికి పైగా ఇండ్లు ఖాళీగానే..

హైదరాబాద్, వెలుగు: సిటీ​లోని స్లమ్​ ఏరియాల్లో ఇప్పటికే పంపిణీ చేసిన డబుల్​బెడ్రూం సైట్లలో మిగిలిన వాటిని లబ్ధిదారులకు కేటాయించడం లేదు. ఇప్పటి వరకు 24 ప్రాంతాల్లో ఇండ్లను ప్రారంభించగా.. ఇందులో 14  ప్రాంతాల్లో కొన్నింటిని ఎవరికీ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. అర్హులైన వారిని గుర్తించి వాటిని అందజేస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా ఆ పని జరగడం లేదు. వీటికోసం లబ్ధిదారులు ఏండ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాగా అధికార పార్టీకి సంబంధించివారికి వీటిని అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

1,336 ఇండ్లు ఖాళీగానే..

ఐడీఎఫ్​సీ కాలనీ, ఎరుకల నాంచారమ్మ బస్తీ, చిత్తారమ్మ బస్తీ , సింగం చెరువు తండా, నాచారం, కిడికి బూద్ ఎలిసా,  సయ్యద్ సాబ్ కా బాడా, జియాగూడ, కట్టెలమండి, గోడేకీ ఖబర్, లంబాడీ తండా, వనస్థలిపురం, గాంధీనగర్,​ కంటోన్మెంట్​లోని సాయిరాం నగర్, అంబేద్కర్ నగర్,  పొట్టి శ్రీరాములు నగర్, జీవైరెడ్డి నగర్, గొల్ల కొమురయ్య కాలనీ, బన్సీలాల్​పేటలోని జీవైఆర్ కాంపౌండ్, చంచల్ గూడ పిల్లి గుడిసెలు, కట్ట మైసమ్మ  సిల్వర్ కాంపౌండ్, బన్సీలాల్​పేట్(సీసీనగర్), ఖైరతాబాద్​లోని ఇందిరా నగర్ ప్రాంతాల్లో 4,892 డబుల్​ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. అయితే, వీటిలోని చాలా ప్రాంతాల్లో కొన్ని ఇండ్లను పంపిణీ చేయకుండా అలాగే ఉంచారు. అత్యధికంగా జియాగూడలో 267 ఇండ్లు ఖాళీగా ఉండగా, అంబేద్కర్ నగర్, గాంధీనగర్, వనస్థలిపురం, గోడేకీ ఖబర్, బన్సీలాల్​పేట్, పిల్లి గుడిసెలు, కట్టమైసమ్మ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి.  ఇలా మొత్తం కలిపి 1,336 ఇండ్లను కేటాయించకుండా ఖాళీగానే ఉంచారు.

అధికారులు, నేతల నిర్లక్ష్యం..

స్లమ్​ ఏరియాల్లో తమ ఇండ్లను ఖాళీ చేయించి డబుల్​ బెడ్రూం ఇండ్లను ఇవ్వడం లేదంటూ లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరేండ్లుగా అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఖాళీగా ఉన్న వాటిని అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని ఇండ్లను ప్రారంభించిన సమయంలో చెప్పిన నేతలు.. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కొన్ని నెలల కిందట కట్టెలమండిలోని డబుల్ ​బెడ్రూం ఇండ్ల తాళాలను పగులగొట్టి లబ్ధిదారులు వాటిల్లోకి వెళ్లారు. కాగా పోలీసుల సాయంతో అధికారులు వారిని ఖాళీ చేయించారు. ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ వద్దకు బాధితులు వెళ్లగా.. తొందరలోనే ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ వారికి ఇండ్లను అందించలేదు. ఇక ఇదే అదునుగా భావిస్తున్న కొందరు మోసాలకు పాల్పడుతున్నారు.  ఇండ్లు ఇప్పిస్తామని పేదల నుంచి రూ. వేలు, లక్షల్లో దండుకుంటున్నారు. ముఖ్యంగా జియాగూడలో ఇలాంటి మోసాలు బయటపడుతున్నాయి.

కిరాయి కట్టలేకపోతున్నం..

ప్రస్తతం ఉంటున్న ఇంటికి కిరాయి కట్టలేకపోతున్నం. ఖాళీగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇండ్లను తమకు ఇస్తామని చెప్పి ఇంకా ఇయ్యలేదు. ఇక్కడి ఇండ్లను ప్రారంభించి ఏడాది అవుతున్నా ఇంకా కేటాయించడం లేదు. వాటిని తొందరగా కేటాయిస్తే బాగుంటుంది. 
- మహేశ్, కట్టెలమండి

ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి

లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన ఇండ్లను మిగతా వారికి అందించే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అప్పటివరకు మేం ఇండ్లు కేటాయించలేం. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయంతీసుకుంటారు. ఎవరైనా డబ్బులకు డబుల్ ​బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని చెప్తే నమ్మొద్దు.  
- వెంకటేశ్వర్లు, ఆర్డీవో, హైదరాబాద్ జిల్లా