ఆసియా వర్శిటీ ర్యాంకింగ్స్ రిలీజ్..టాప్ 50లో రెండే

ఆసియా వర్శిటీ ర్యాంకింగ్స్ రిలీజ్..టాప్ 50లో రెండే

లండన్‌‌: ఆసియాలోని అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో ఇండియన్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సైన్స్‌‌ (బెంగళూరు) టాప్‌‌ 30లో స్థానం సంపాదించింది. టైమ్స్‌‌ హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ గురువారం విడుదల చేసిన ‘ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌‌ 2019’ లో 29 స్థానంలో నిలిచింది. గతేడాది స్థానాన్ని నిలబెట్టుకుంది. టాప్‌‌ 50లో ఐఐటీ ఇండోర్‌‌ చోటు దక్కించుకుంది. టాప్‌‌ 100లో ఐఐటీ బాంబే, రూర్కీ రెండూ 54వ స్థానంలో, జేఎస్‌‌ఎస్‌‌ అకాడమీ ఆఫ్‌‌ హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ అండ్‌‌ రీసెర్చ్‌‌ 62, ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌ 76, ఐఐటీ కాన్పూర్‌‌ 82, ఐఐటీ ఢిల్లీ 91వ స్థానంలో ఉన్నాయి. మొత్తంగా 27 ఆసియా దేశాలు ర్యాంకింగ్‌‌లో పాల్గొన్నాయి. 417 వర్సిటీలు లిస్టులో చోటు సంపాదించాయి. గతేడాది నేషనల్‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌ సింగపూర్‌‌ టాప్‌‌ ర్యాంకును దక్కించుకోగా ఈసారి ఆ వర్సిటీని వెనక్కి నెట్టి చైనాకు చెందిన సింగువా వర్సిటీ టాప్‌‌ వన్‌‌ స్థానం దక్కించుకుంది. హాంకాంగ్‌‌ వర్సిటీ ఆఫ్‌‌ సైన్స్‌‌ అండ్‌‌ టెక్నాలజీ మూడు, హాంకాంగ్‌‌ వర్సిటీ నాలుగు, పెకింగ్‌‌ వర్సిటీ ఐదో స్థానంలో ఉన్నాయి. జాబితాలో ఎక్కువ వర్సిటీలున్న దేశంగా జపాన్‌‌ రికార్డు సృష్టించింది. ఆ దేశం నుంచి 103 వర్సిటీలు చోటు సంపాదించాయి. తర్వాతి స్థానంలో చైనా, ఇండియా ఉన్నాయి. చైనా నుంచి 72 వర్సిటీలు (గతేడాది 63), ఇండియా నుంచి 49 వర్సిటీలు (గతేడాది 42) చోటు దక్కించుకున్నాయి. తొలిసారి మలేసియా టాప్‌‌ 40లో నిలి చింది. యూనివర్సిటీ ఆఫ్‌‌ మలేసియా 8 స్థానాలు మెరుగుపరుచుకొని 38వ స్థానం సంపాదించింది. ఈసారి చైనా అత్యుత్తమ ఫలితాలు సాధించిందని.. జపాన్‌‌, దక్షిణ కొరియాలోని ముఖ్యమైన వర్సిటీలు కూడా మెరుగైన పనితీరు కనబరిచాయని టైమ్స్‌‌ హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌‌ చీఫ్‌‌ నాలెడ్జ్‌‌ అధికారి ఫిల్‌‌ బాటి చెప్పారు.