డైటింగ్​లో ఇవి చాలా ముఖ్యమైనవి

డైటింగ్​లో ఇవి చాలా ముఖ్యమైనవి

బరువు తగ్గడం, ఫిట్​గా మారడం...గోల్ ఏదైతేనేం? డైటింగ్ చేస్తే చాలు అనుకుంటారు చాలామంది. డైటింగ్​లో చాలా రకాలున్నాయి. దాంతో వాటిలో ఏది పాటించాలనే కన్ఫ్యూజన్​ ఉంటుంది చాలామందికి. అయితే..కొందరు సోషల్​ మీడియాలో చూసి లేదా ఇన్​ఫ్లుయెన్సర్​ల మాటలు విని డైటింగ్ మొదలుపెడతారు. అవి తమ బాడీకి ఆరోగ్యానికి సరిపోతాయా? లేదా? అనేది ఆలోచించరు. ఇలా చేయడంవల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు న్యూట్రిషనిస్ట్​లు. అంతేకాదు ఆరోగ్యం దెబ్బతినకుండా బరువు తగ్గడానికి పనికొచ్చే డైటింగ్​ని ఎంచుకోవాలి.  డైటింగ్​ చేసే ముందు న్యూట్రిషనిస్ట్​ని లేదా డైటీషియన్ కలవాలి అంటోంది న్యూట్రిషనిస్ట్ సుజాత స్టీఫెన్. 

జంక్​ఫుడ్, నూనె, కొవ్వు ఎక్కువ ఉండే ఫుడ్ తినడంతో పాటు బింజే ఈటింగ్ (ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినడం) వల్ల బరువు పెరుగుతారు చాలామంది. దాంతో తక్కువ టైంలో బరువు తగ్గాలని జిమ్​లో చేరతారు. అయినా రిజల్ట్​ కనిపించకపోవడంతో డైటింగ్ మొదలుపెడతారు. ఇలాంటి వాళ్లలో ఆన్​లైన్​లో చూసి లేదా సెలబ్రిటీలు ఫాలో అయ్యే డైట్​లు అని కొన్ని డైట్​ ప్లాన్స్ చేస్తుంటారు కొందరు.  

ప్లానింగ్ ఉంటేనే...
ఈమధ్య ఇంటర్నెట్​లో, ప్రపంచవ్యాప్తంగా ​కొన్ని రకాల డైట్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో మెడిటెర్రేనియన్​, బ్లూ జోన్​ డైట్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటివి ముఖ్యమైనవి. అయితే, ఏ డైట్​ పాటించే ముందు అయినా... ఆ డైట్​ ఎంతవరకు సరిపోతుంది? ఎక్కువ రోజులు పాటించగలరా? లేదా? అనేది ఆలోచించుకోవాలి. అంతేకాదు ఆ డైట్​కి తగ్గట్టుగా టైం టేబుల్ వేసుకోవాలి. అలానే...ఏ డైట్​ అయినా ఎక్కువ రోజులు పాటిస్తేనే బరువు తగ్గుతారు. అలాకాకుండా రెండు మూడు వారాలకు ఆపేస్తే బరువు తగ్గకపోగా... ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఐదారు కిలోలు బరువు పెరిగినవాళ్లకు డైటింగ్​ బాగా ఉపయోగపడుతుంది. అన్ని డైట్​ప్లాన్స్​లో రిజల్ట్​ కనిపిస్తుంది. అయితే, ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే... అందరికీ ఒకేరకం డైట్​ ప్లాన్​ సెట్ కాదు.  అందుకని అరోగ్యం దెబ్బ తినకుండా బరువు తగ్గడానికి ఉపయోగ పడే డైట్స్​ ఫాలో కావాలి. వీటి వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు.  

ఇవి ముఖ్యమైనవి

కీటో డైట్– ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రొటీన్​ మోతాదుగా, ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి. నట్స్, గింజలు, అవకాడో, వెన్న, జున్ను, గుడ్లు, ఫ్యాట్​ ఉండే చేపలు, చికెన్ వంటివి ఈ డైట్​లో భాగం. ఈ డైట్​ పాటించేవాళ్ల శరీరం  కార్బోహైడ్రేట్స్ బదులు ఫ్యాట్స్​ని ఎనర్జీగా వాడుకుంటుంది. దీన్ని ‘కీటోసిస్’ అంటారు. ఈ డైట్​ వల్ల బరువు తగ్గడమే కాకుండా షుగర్, ఇన్సులిన్​ లెవల్స్ తగ్గుతాయి.  

లో కార్బ్ డైట్– అన్నం, బ్రెడ్, ఆలుగడ్డలు, బీన్స్, పాప్​కార్న్ వంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఎక్కువ తింటే తొందరగా బరువు పెరుగుతారు. అందుకని లో–కార్బ్​ డైట్​లో వీటి బదులు ప్రొటీన్, ఫ్యాట్​ ఉండే చేపలు, గుడ్లు, గ్లూటెన్ ఉండని పదార్థాలు, కూరగాయలు, పండ్లు, నట్స్​ వంటివి తినాలి. అయితే   డయాబెటిస్ ఉన్నవాళ్లు ఎక్కువ రోజులు ఈ డైట్​ పాటించలేరు. ఎందుకంటే...  ఈ డైట్ ఫాలో అయితే షుగర్​ కంట్రోల్​లో​ ఉండడం అటుంచి షుగర్​ లెవల్స్​ పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. 

మెడిటెర్రేనియన్ డైట్– ఈ మధ్య పాపులర్​ అయిన డైట్​లలో ఇదొకటి. మధ్యధరా సముద్రం పరీవాహ ప్రాంతం (గ్రీస్, ఇటలీ)లో ఉండేవాళ్లు ఈ డైట్​ చేస్తారు. వీళ్లు ఆకుకూరలు, కూరగాయలతో పాటు చేపలు, చికెన్, గుడ్లు, చీజ్​ వంటివి తింటారు. అయితే, ఈ డైట్​ అందరికీ సెట్​ కాదు. 

ప్లాంట్ బేస్డ్ డైట్– పూర్తిగా కూరగాయలు, పండ్లు, నట్స్, చిక్కుడు జాతి కూరలు మాత్రమే తింటారు. దీన్ని ‘వీగన్​ డైట్’ అంటారు. ఈ డైట్​ పాటించేవాళ్లకు హెల్దీ ఫ్యాట్స్​ అందుతాయి. కానీ,  విటమిన్–బి12, విటమిన్​–డి వంటి ముఖ్యమైన పోషకాలు అందవు. అందుకని డైట్​లో ప్రొటీన్ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. 

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్– వీళ్ల డైట్​లో అవకాడో, చేపలు, క్యాబేజీ, ప్రొ–బయాటిక్స్​, బీన్స్, గుడ్లు, నట్స్ వంటివి ఉంటాయి. ఇందులో 5 రకాలున్నాయి. దాదాపు 12 గంటలు ఫాస్టింగ్ ఉండి, మిగతా టైంలో తింటారు. వారంలో 5 రోజులు నార్మల్ డైట్ పాటించి మిగతా 2 రోజులు మాత్రం 500 నుంచి 600 లోపు క్యాలరీలు తీసుకుంటారు. వారానికి లేదా రెండు వారాలకోసారి ఒక రోజంతా ఫాస్టింగ్ ఉంటారు. రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేస్తారు. ఉదయం పూట పచ్చి కూరగాయలు, పండ్లు తిని రాత్రి పూట కడుపునిండా తింటారు. 

గుర్తుపెట్టుకోవాల్సినవి
కనీసం 3 నుంచి 6 నెలల దాకా డైట్ ప్లాన్​ పాటించాలి. అందుకని డైటింగ్​ మొదలుపెట్టే రోజు నుంచి ఆపేసే వరకు మానసికంగా బలంగా ఉండాలి. ఒకవేళ ఫుడ్ పడకున్నా,ఆరోగ్యం బాగుండకున్నా వెంటనే న్యూట్రిషనిస్ట్​ని కలవాలి. అవసరమైతే కొన్ని రోజులు బ్రేక్​ తీసుకోవాలి. అప్పుడప్పుడు చీట్​మీల్స్ ఓకే. కానీ తరచూ స్వీట్స్, చిప్స్​, ఫాస్ట్​ఫుడ్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. డైటింగ్​తో పాటు ఎక్సర్​సైజ్​ చేయడం మర్చిపోవద్దు. అనుకున్న బరువు తగ్గాక డైటింగ్ కంటిన్యూ చేయొద్దు. నెమ్మదిగా నార్మల్​ ఫుడ్ తీసుకోవాలి. 

వీళ్లు పాటించొద్దు
డయాబెటిక్​, షుగర్​ ఉన్నవాళ్లు, చాలా రోజులుగా మెడిసిన్స్ వాడుతున్నవాళ్లు డైటింగ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే.. డైటింగ్ వల్ల వీళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  గర్భం దాల్చాక, కాన్పు తర్వాత చాలామంది ఆడవాళ్లు బరువు పెరుగుతారు. వీళ్లు బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తే సరిపోను పోషకాలు అందవు. అందుకని బ్యాలెన్స్​డ్​ డైట్ తీసుకోవాలి. 

డాక్టర్​. సుజాత స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్, యశోద హాస్పిటల్స్​, హైదరాబాద్​.