ఆన్​లైన్ గేమ్స్..ప్రాణాలు తీస్తున్నయ్

ఆన్​లైన్ గేమ్స్..ప్రాణాలు తీస్తున్నయ్
  • ఆటలకు బానిసలుగా మారుతున్న యువత 
  • చివరకు అప్పులపాలై ఆత్మహత్యలు.. రాష్ట్రంలో ఇటీవల పెరిగిన ఘటనలు
  • ఆన్ లైన్ జూదంలో తెలంగాణ సెకండ్ ప్లేస్.. స్పోర్ట్స్ బెట్టింగ్​లో టాప్ 

హైదరాబాద్, వెలుగు: ఓ యువకుడు జాబ్​ కోసమని హైదరాబాద్​వచ్చాడు. ఇంట్లో వాళ్లకు జాబ్ చేస్తున్నానని చెప్పి, రూమ్ లోనే ఉంటూ ఆన్​లైన్ గేమ్​లకు అలవాటు పడ్డాడు. అదికాస్తా వ్యసనంగా మారి.. ఒకట్రెండు లక్షలు కాదు ఏకంగా రూ.2 కోట్లు పోగొట్టుకున్నాడు. మొత్తం అప్పులు తీసుకుని ఆటలు ఆడాడు. ఇదికాస్తా ఇంట్లో తెలిసి ఉన్న ఆస్తులన్నీ అమ్మినా ఆ అప్పు తీరలేదు. చివరకు ఆ యవకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నెల కిందట జరిగిందీ ఘటన. ఇదొక్కటే కాదు.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఇటీవల చాలా జరిగాయి. ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు అప్పులు చేసి ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. తండ్రి వడ్లు అమ్మగా వచ్చిన డబ్బులు పోగొట్టి ఓ కొడుకు ప్రాణాలు తీసుకున్నారు. గర్ల్​ఫ్రెండ్​ నగలను కుదువపెట్టిన మరో యువకుడు.. ఆ డబ్బులన్నీ ఆన్​లైన్​ గేమ్స్ లో  పోగొట్టుకున్నాడు. ఇట్ల వేలాది మంది యువకులు ఆన్​లైన్​ గేమ్స్ కు బానిసలుగా మారి ఆగమైపోతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. మనకు తెలుస్తున్నవి, బయటకు వస్తున్నవి కొన్నేనని.. ఇంకా బయటకు రాని ఘటనలు వేలల్లో ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. 

విద్యార్థులు, చిరుద్యోగులే కాదు.. సాఫ్ట్​వేర్ ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్ కూడా ఆన్​లైన్​ గేమ్స్​ను సరదాగా ప్రారంభించి బానిసలుగా మారుతున్నారు. ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. ఆన్​లైన్ జూదంలోకి దిగుతున్న వాళ్లలో సగం మంది 20 నుంచి 29 ఏండ్లలోపు వాళ్లే ఉంటున్నారు. మరోవైపు రమ్మీ, క్యాసినో వంటి ఆన్​లైన్​ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఎక్కువగా ఆడుతున్నది మహారాష్ట్ర తర్వాత మన రాష్ట్రంలోనే కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా గ్యాంబ్లింగ్​ గేమ్స్​ ట్రాఫిక్​లో 15.9 శాతం మహారాష్ట్ర నుంచి రికార్డ్​అవుతుంటే.. తెలంగాణ నుంచి 9.9 శాతం నమోదవుతున్నట్టు ఇటీవల ‘సెవెన్ జాక్​పాట్స్’ రిపోర్టులో వెల్లడైంది. ఇక స్పోర్ట్స్​ బెట్టింగ్​లోనైతే తెలంగాణే టాప్​లో ఉండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మన రాష్ట్రం నుంచే ఎక్కువగా ఆన్​లైన్​లో స్పోర్ట్స్ ​బెట్టింగ్ కాస్తున్నట్టు ఆ రిపోర్ట్​ తేల్చింది. దేశవ్యాప్తంగా స్పోర్ట్స్​బెట్టింగ్ ట్రెండ్స్​ను తీసుకుంటే.. అత్యధికంగా తెలంగాణ నుంచే 22 శాతం మంది బెట్టింగ్​లకు పాల్పడుతున్నట్టు వెల్లడైంది.

రెండు మూడేండ్ల సందే ఎక్కువైనయ్.. 

ఈ రెండు మూడేండ్లలోనే ఆన్​లైన్​ గేమింగ్, బెట్టింగ్​ యాప్స్​ వందల్లో పుట్టుకొచ్చాయి. రమ్మీ, పోకర్​వంటి పేకాట గేమ్స్​తో పాటు లూడో, క్రికెట్, పబ్జీ వంటి ఆటలతో గేమింగ్​ యాప్స్​ను తీసుకొస్తున్నారు. తొలుత కొన్ని కాయిన్లు ఫ్రీ అని చెప్పి యువతను ఆకర్షిస్తున్న యాప్స్.. ఆ తర్వాత వారిని నిలువునా ముంచేస్తున్నాయి. నెమ్మదిగా గేమ్​కు అలవాటు చేసి.. వదల్లేనంతగా బానిసలుగా మార్చేస్తూ డబ్బులు కొల్లగొడ్తున్నాయి. ముఖ్యంగా రమ్మీ, పోకర్​వంటి ఆటలకే జనాలు ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. దానికితోడు క్రికెట్​ బెట్టింగ్ యాప్​లూ ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి.

ఐపీఎల్, వరల్డ్ కప్, ఇండియా ఆడే మ్యాచ్​లతో పాటు ఐఎస్ఎల్ (ఫుట్​బాల్), పీబీఎల్ (బ్యాడ్మింటన్​) వంటి టోర్నీలకు జోరుగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ అంతా ఓపెన్​గానే జరుగుతున్నాయి. నిజానికి రాష్ట్రంలో వీటిపై నిషేధం ఉన్నా.. కొందరు యువకులు ఇతర మార్గాలను వెతుక్కుని మరీ ఆన్​లైన్​బెట్టింగ్స్ పెడుతున్నారు. కొన్నిసార్లు పెట్టిన డబ్బులకు ఎక్కువొస్తున్నా.. నష్టపోతున్నది అంతకంటే ఎక్కువగానే ఉంటున్నది.

యాప్స్ అంబాసిడర్లు స్టార్లే.. 

కొన్ని ఆన్​లైన్​గేమింగ్, బెట్టింగ్ యాప్స్ బహిరంగంగానే ప్రకటనలు ఇస్తున్నాయి. బెట్టింగ్​కు యువత అలవాటు పడేలా స్పోర్ట్స్, సినిమా స్టార్లను పెట్టుకుని ప్రచారం చేయిస్తున్నాయి. అంతెందుకు ఐపీఎల్, ఐఎస్​ఎల్, పీబీఎల్ వంటి టోర్నీలకు ఆ ఆన్​లైన్​గేమింగ్, బెట్టింగ్ యాప్స్ స్పాన్సర్లుగానూ వ్యవహరిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని యువతను ఆకట్టుకుని.. వాళ్ల నుంచి ఏటా రూ.వేల కోట్లు దండుకుంటున్నాయి. ఓ రిపోర్ట్​ ప్రకారం మన దేశంలో ఆన్​లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్​మార్కెట్​ వాటా 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.4,200 కోట్లు అని తేలింది. ఈ ఆర్థిక సంవత్సరం అది మరింత పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, అమెరికాలతో పోలిస్తే మన దేశంలో ఆన్​లైన్ గ్యాంబ్లింగ్, గేమింగ్ మార్కెట్ 38 శాతం రేటుతో వృద్ధి చెందుతున్నదట.

ఈ కేసులను సైబర్​క్రైమ్స్​లో కలిపేస్తున్నరు.. 

రాష్ట్రంలో ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ వల్ల ఎంతమంది ప్రభావితమవుతున్నారని చెప్పడానికి సరైన గణాంకాలు లేవు. వేలల్లో ఘటనలు జరుగుతున్నా కొన్ని మాత్రమే పోలీసుల వరకు వెళ్తున్నాయి. అయితే ఆ కేసులను సైబర్ క్రైమ్స్ జాబితాలో కలిపి వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో పేకాటపై నిషేధం ఉంది. ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే పోలీసులు వెళ్లి అరెస్ట్​ చేస్తున్నారు. కానీ ఆన్​లైన్​ లో రమ్మీ, పోకర్, క్యాసినో వంటి వాటిపై మాత్రం సర్కారు ఎలాంటి చర్యలను తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఆన్​లైన్​ గేమ్స్​కు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బెట్టింగ్ నిర్వహించే ఆన్​లైన్​ గేమ్స్​ను బ్యాన్​ చేస్తామని తెలిపింది. ఆన్​లైన్ గేమ్స్ యాప్స్​పై రివ్యూ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పింది.