బెట్టింగ్.. అప్పులతో అదృశ్యం పట్టుకొచ్చి అప్పగించిన పోలీసులు

బెట్టింగ్.. అప్పులతో అదృశ్యం  పట్టుకొచ్చి అప్పగించిన పోలీసులు

మిర్యాలగూడ, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగుల కోసం అప్పులు చేసి నష్టపోయిన ఓ వ్యక్తి 8 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. భార్య ఫిర్యాదు మేరకు సుమారు ఆరు నెలల పాటు గాలించిన పోలీసులు చివరికి అతడిని గుర్తించి బుధవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. టూటౌన్ ఎస్ఐ కృష్ణయ్య కథనం ప్రకారం..ఏపీలోని గుంటూరు జిల్లా గామాలపాడుకు చెందిన సాంబయ్యకు నల్గొండకు చెందిన అనూషకు మూడేండ్ల కింద పెండ్లయ్యింది. వీరు మిర్యాలగూడలోని హనుమాన్ పేటలో ఉంటున్నారు. అనూష ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాగా, సాంబయ్య రైస్ మిల్లులో ఆపరేటర్. సాంబయ్య ఆన్ లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేసి రూ.లక్షల్లో నష్టపోయాడు. దీంతో గతేడాది నవంబర్1న ఇంట్లోనే ఫోన్ వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఎన్నోచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతడి భార్య అనూష జనవరిలో టూటౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు అప్పటినుంచి వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అతడు హైదరాబాద్​లో ఉంటున్నట్టు తెలుసుకున్నారు. డ్రైనేజీ పనుల్లో గుంతలు తవ్వే పని చేస్తున్నట్టు గుర్తించారు. పెండ్లయిన సంగతి దాచి ఒంటరి వాడినని బిహార్​ కూలీలతో కలిసి ఉంటున్నాడు. కానీ,  ఆన్​లైన్​ బెట్టింగ్ పై మోజు తీరక ఆ వెబ్​సైట్లను రోజూ సెర్చ్​ చేస్తూ ఉండేవాడు. ఈ డేటాను సేకరించిన పోలీసులు హైదరాబాద్​లోని మునుగనూరు ఏరియాలో కనిపెట్టి  పట్టుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసును చేధించిన ఎస్ఐ కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ ​వెంకటేశ్వర్లునుసీఐ నరసింహారావు అభినందించారు.