- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భూమితో పాటు పర్యావరణ పరిరక్షణలో బయోచార్ కీలక భూమిక పోషిస్తోందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ తెలిపారు. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులోని నర్సరీలో బయోచార్ వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఉచిత శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పత్తి కట్టెలు, మొక్కజొన్న చొప్ప లాంటి పంట వ్యర్థాలు పెద్ద ఎత్తున లభిస్తాయన్నారు. ఇటువంటి పంట వ్యర్థాలను ఉపయోగించి బయోచార్ తయారు చేసే విధానంపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. బయోచార్ వినియోగంతో భూమికి పునరుజ్జీవం కల్పించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడిన వాళ్లం అవుతామన్నారు.
బయోచార్ వినియోగంతో నేలలు సారవంతం అవుతాయని తెలిపారు. భూమిలోనే పత్తి, మొక్కజొన్న చొప్పలను కాల్పడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతో పాటు భూమిలోని విలువైన పోషకాలు నాశనం అవుతున్నాయని వివరించారు. బయోచార్ను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు రైతులతో పాటు స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ శాఖ, పంచాయతీలు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పరశురాం కైలాస్ అఖరే బయోచార్ తయారీ విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ ప్రోగ్రాంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, పలు శాఖల ఆఫీసర్లు, రైతులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
అభ్యంతరాలు లిఖిత పూర్వకంగా తెలుపండి..
మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీల నేతలు గడువు లోగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని కలెక్టర్ జితేశ్ సూచించారు. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 అక్టోబర్ 1 నాటికి ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చామన్నారు. ఈనెల 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, 10న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల కమిషనర్లు శ్రీకాంత్, నాగరాజు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
