వనరులున్నా.. పరిశ్రమలేవి?

వనరులున్నా..  పరిశ్రమలేవి?
  • భద్రాద్రికొత్తగూడెంలో ప్రతిపాదనలు, చర్చలకే పరిమితం
  •  స్థల సేకరణ వద్దే ఆగిన ఫుడ్ ప్రాసెసింగ్​ యూనిట్​
  •  పరిశ్రమల ఏర్పాటులో ఐటీడీఏ నుంచి కానరాని ప్రోత్సాహం!  
  •  కోల్​అనుబంధ పరిశ్రమ ఏర్పాటుపై దృష్టి సారించని ‘సింగరేణి’!
  •  ఇప్పుడు కాంగ్రెస్ ​ప్రభుత్వమైనా తగిన చర్యలు తీససుకోవాలని స్థానికుల విజ్ఞప్తి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వనరులు ఫుల్​ఉన్నా.. ఆ దిశగా అడుగులు మాత్రం పడడం లేదు. మూడేండ్ల కింద పాల్వంచలో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ ఏర్పాటుకు సంబంధించి ఆఫీసర్లు ల్యాండ్​ చూసి హడావుడి చేశారు. ఆ తర్వాత మరిచిపోయారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై గతంలో పలువురు కలెక్టర్లు, మంత్రులు ఇండస్ట్రియల్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లతో పలుమార్లు చర్చించిన దాఖలాలున్నాయి.  ప్రధానంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై డిస్కస్​ చేశారు. ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. 

ఇవన్నీ మాటలు, రికార్డులకే పరిమితమయ్యాయి. పినపాక, కరకగూడెం, చర్ల, అశ్వాపురం, దమ్మపేట, బూర్గంపహడ్​, ఇల్లెందు, ములుకలపల్లి, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో ఫుడ్​ ప్రాసెసింగ్​యూనిట్లు స్థాపించేందుకు మంచి అవకాశాలున్నట్టుగా పరిశ్రమల శాఖాధికారులు గుర్తించారు. కానీ  ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. 

ఎన్నో అవకాశాలు... 

జిల్లాలో మిర్చి, మామిడి, చింతపండుతో పాటు ఇతర పండ్ల తోటలు ఎక్కువగా ఉన్నాయి. 4వేల టన్నుల నుంచి 6వేల టన్నుల సామర్థ్యం కలిగిన 5 నుంచి 10 వరకు కోల్డ్​ స్టోరేజ్​లను దమ్మపేట, అశ్వారావుపేట, బూర్గంపహడ్​, జూలూరుపాడు, సుజాతనగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో  స్థాపించేందుకు  అవకాశం ఉందని పరిశ్రమల శాఖ గుర్తించింది. మామిడి, జీడి మామిడి సాగు దాదాపు 20వేల ఎకరాలకు పైగా ఉంది. మామిడి, జీడి మామిడి ప్రాసెసింగ్​ యూనిట్లను అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు ప్రాంతాల్లో రూ. 50లక్షలతో దాదాపు 5 నుంచి 10వరకు ప్రాసెసింగ్​ యూనిట్లు ఏర్పాటుకు అవకాశాలున్నాయి. 

జిల్లాలో ప్రస్తుతం మూడు పారాబాయిల్డ్​ రైస్​ మిల్లులున్నాయి. ఇంకా 20 నుంచి 25 వరకు రైస్​ మిల్లులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయి. అధిక సామర్థ్యం కలిగిన పారాబాయిల్డ్​ మిల్లులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన వనరులున్నాయి. 


జిల్లాలో దాదాపు 15లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి  జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో మూడు జిన్నింగ్​ మిల్లులు మాత్రమే ఉన్నాయి. రూ. 5 కోట్ల నుంచి రూ.6కోట్లతో మరో సుజాతనగర్, ఇల్లెందు, జూలూరుపాడు, టేకులపల్లి ప్రాంతాల్లో మూడు జిన్నింగ్​ మిల్లులు ఏర్పాటు చేసేందుకు అవకాశాలన్నాయి. 

ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి ప్రాంతాల్లో మొక్కజొన్న ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఉంది. జిల్లాలో ఆయా మండలాల్లో దాదాపు 4లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి అవుతోంది. 

రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో ఆయిల్​పామ్​ సాగవుతోంది. ఈ క్రమంలో పామాయిల్, కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. పామాయిల్​ రిఫైండ్​ ఆయిల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలతలున్నాయి. జీడి పప్పు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చాన్స్​ ఉంది. గత ప్రభుత్వాలు జిల్లాను పట్టించుకోకపోవడంతో వనరులున్నా ఉపయోగం లేకుండా పోయిందని, ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉన్న ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్​ ప్రభుత్వమైనా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

ఐటీడీఏ పట్టించుకోవాలె.. 

ఏజెన్సీలో అటవీ ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా స్మాల్​ స్కేల్​ ఇండస్ట్రీస్​​ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పరిశ్రమల స్థాపనకు కొంత ఇబ్బంది కలుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఏజెన్సీలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాల్సిన ఐటీడీఏ పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఆసక్తి గల గిరిజనులను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు ప్రోత్సాహకాలు  కల్పించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గవర్నమెంట్​ ల్యాండ్​ను గుర్తించి ఆ భూమిని లీజుతో పాటు సబ్సిడీతో కూడిన లోన్లను ఇస్తే చాలా మంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని పలువురు  చెబుతున్నారు.

సింగరేణి అనుబంధ పరిశ్రమల జాడేది..?


సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లెందుతో పాటు కొత్తగూడెం, మణుగూరు ఏరియాల్లో బొగ్గు గనులున్నాయి. ఒక్కొక్కటిగా మైన్స్​ మూతపడుతుండడంతో ఆయా ఏరియాలు రోజురోజుకూ బోసిపోతున్నాయి. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం కోల్​ అనుబంధ పరిశ్రమ ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇల్లెందులో సింగరేణి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు.