- రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ పూర్తి: భట్టి
- స్విచాన్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి
- గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు పనుల్లో జాప్యం
నల్గొండ, వెలుగు: వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులోని అన్ని యూనిట్లలోనూ విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి బుధవారం దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్‌కు ఆయన స్విచాన్ చేశారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పవర్ ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందన్నారు. 50 శాతం దేశీయ బొగ్గు, 50 శాతం విదేశీ బొగ్గును వాడాల్సి ఉండగా.. గత ప్రభుత్వం మొత్తం దేశీయ బొగ్గునే వాడటం వల్ల ఎన్జీటీ క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్జీటీ అనుమతులు తీసుకుని, పనుల్లో వేగం పెంచామన్నారు. ప్రాజెక్టుకు 2015లో శంకుస్థాపన జరిగిందని, 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాల్సి ఉండగా.. సకాలంలో పనులు కాక ఆర్థిక భారం పెరిగిందన్నారు.
Also Read:-ప్రపంచంలోని ప్రతి డివైజ్‌లో.. మేడిన్ ఇండియా చిప్
కాంగ్రెస్ వచ్చాకే పనుల్లో వేగం..
కాంగ్రెస్‌ప్రభుత్వ చొరవతోనే ఆయిల్ సింక్రనైజేషన్ వరకు పనులు జరిగాయని, ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు 3 యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు మార్చి 31 నాటికి రైల్వే పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి రూ.6.35కే యూనిట్ విద్యుత్తు అందిస్తామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పూర్తయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా పెరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు పరిహారంతో పాటు ఉద్యోగాలు ఇస్తామన్నా రు. నిర్వాసితుల కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలి..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌తోపాటు, పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎంకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వైటీపీఎస్‌లో సబ్ కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు కూడా చెల్లించాలని, ట్రాన్స్ ఫార్మర్లు, సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి ప్లాంటుకు అవసరమైన ఆర్ అండ్ బీ రోడ్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. వెంటనే ఎస్ఈని పంపి పనులు ప్రారంభించేలా చూస్తానన్నారు. భూములు ఇచ్చినవారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామన్నారు.