మహాలక్ష్మి స్కీమ్​ కింద ఆర్టీసీకి 374 కోట్లు

మహాలక్ష్మి స్కీమ్​ కింద ఆర్టీసీకి 374 కోట్లు
  • మహాలక్ష్మి స్కీమ్​ కింద ఆర్టీసీకి 374 కోట్లు
  • ఫైల్​పై తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క, పొంగులేటి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్​
  • బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం చేసిన డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, వెలుగు : ఆరు గ్యారంటీల్లోని రెండు గ్యారంటీలకు సంబంధించి నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సంతకం చేశారు. సెక్రటేరియెట్​లో గురువారం ఉదయం తన చాంబర్లో డిప్యూటీ సీఎం.. ఆర్థిక, ప్లానింగ్, ఎనర్జీ శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు కల్పిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని రూ.374  కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రూ.298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ మరో ఫైల్​పై సైన్​ చేశారు. తర్వాత విద్యుత్ సబ్సిడీ రూ.996 కోట్ల విడుదల ఫైలుపై సంతకం చేశారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కోసం రూ.75 కోట్లు వివిధ శాఖల మంజూరుకు సిఫార్సు చేసిన ఫైలుపై సైన్​ పెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పెషల్ సీఎస్​లు రామకృష్ణారావు, సునీల్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, హరిత తదితర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.