పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకులు భీంసింగ్ ఇక లేరు

పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకులు భీంసింగ్ ఇక లేరు
  • నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీంసింగ్
  • రచయితగా, మానవ హక్కుల నేతగా సుపరిచితుడు
  • యాసిర్ అరాఫత్, సద్దాం హుస్సేన్, ఫిడెల్ కాస్ట్రో వంటి వారితో సన్నిహిత సంబంధాలు
  • కాంగ్రెస్ పార్టీతో రాజకీయ అరంగేట్రం

జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (JKNPP)వ్యవస్థాపకులు భీంసింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న భీంసింగ్ జమ్మూకశ్మీర్‌లోని జీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (మే 31న) తుదిశ్వాస విడిచారు. భీంసింగ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరు లండన్‌లో ఉంటున్నారు. మానవ హక్కుల నేతగా, రచయితగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సీనియర్ కార్యవర్గ సభ్యుడిగా భీంసింగ్ చాలామందికి సుపరిచితులు. భీం సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం వ్యక్తం చేశారు.

జమ్ము ప్రాంతంలో కీలక రాజకీయ నేతగా గుర్తింపు పొందిన భీంసింగ్ స్వస్థలం ఉధంపూర్ జిల్లా భుగ్టేరియన్ గ్రామం. లండన్ యూనివర్శిటీలో లా చదవిన ఆయన 1971లో లండన్ యూనివర్శిటీ యూనియన్ కు సెక్రెటరీగా ఎన్నికైన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన భీం సింగ్.. ఆ తర్వాత రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 1982లో జమ్మూకశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీని స్థాపించారు. జమ్మూకశ్మీర్‌కు 2002లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భీంసింగ్ పార్టీ నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరింది. 

1988లో ఉధంపూర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కుట్ర జరిగిందని న్యాయపోరాటం చేశారు. నాలుగేళ్ల తర్వాత అక్కడి విజేత భీంసింగేనని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. అప్పటికే ఆ దఫా లోక్ సభ రద్దయ్యింది. 1985లో ఆ రాష్ట్ర ప్రభుత్వం భీంసింగ్ ను అక్రమంగా జైల్లో పెట్టడంతో ఆయన శాసనసభ సభ్యత్వం రద్దయింది. అకారణంగా ఖైదు చేసినందుకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో భీంసింగ్ టూవీలర్ పై ప్రయాణించారు. పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, క్యూబా విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో, ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా నియంత గడాఫీ వంటి నాయకులతో భీంసింగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

ఇండియా విమెన్స్‌‌‌‌ టీటీ టీమ్‌‌‌‌లో శ్రీజకు ప్లేస్‌‌‌‌

హిస్టరీ ప్రశ్నల తీరు మారింది