Kannappa Hard Drive: ‘కన్నప్ప’ సినిమా హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. అసలేం జరుగుతోంది..?

Kannappa Hard Drive: ‘కన్నప్ప’ సినిమా హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. అసలేం జరుగుతోంది..?

జూన్ 27న విడుదల కావాల్సిన ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. అనుమతి లేకుండా హార్డ్ డ్రైవ్ తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోకాపేటకు చెందిన విజయ్ కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబైలోని HIVE స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్లోని విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్శిల్ను మే 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు. 

అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్ డ్రైవ్ చరిత అనే యువతికి అప్పగించాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారు. రఘు, చరితలు ఇద్దరు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. ఎవరో చెప్తేనే రఘు, చరిత కలిసి ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌‌గా రూపొందించిన చిత్రం ‘కన్నప్ప’. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్ష య్ కుమార్, మోహన్‌‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. జూన్ 27న ‘కన్నప్ప’ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైంది.