విద్యార్థినులు ఉగ్రరూపం.. కుర్చీలు..స్థలం లేదంటూ విద్యాశాఖ అధికారి కారు ధ్వంసం

విద్యార్థినులు ఉగ్రరూపం..  కుర్చీలు..స్థలం లేదంటూ విద్యాశాఖ అధికారి కారు ధ్వంసం

బీహార్‌లోని వైశాలి మండలం మహ్నార్ గ్రామంలో  విద్యార్థినుల శివంగుల్లా మారారు. స్థానిక  బాలికల ఉన్నత పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థినిలు శివాలెత్తారు. తరగతి గదిలో కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవని రోడ్డుపై భైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కారును ధ్వంసం చేశారు. కారుపై  రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులకు, విద్యార్థినులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో  ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. ప్రస్తుతం విద్యార్థినిలు దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

మహ్నార్ బాలికల స్కూల్లో 2083 మంది  చదువుతున్నారు. వీరిలో కేవలం 600 మందికి  మాత్రమే కుర్చీలు ఉన్నాయి. మిగతా వారు కూర్చోవడానికి కుర్చీలు లేవు. స్థలం కూడా లేదు. కానీ స్థానిక విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కెకె పాఠక్  మాత్రం స్కూల్లో 75 శాతం హాజరు కావాలని ఆదేశించారు.  దీంతో పాఠశాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు వస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 12వ తేదీ 1250 మందికి పైగా బాలికలు పాఠశాలకు హాజరయ్యారు. అయితే తరగతి గదుల్లో స్టూడెంట్స్ కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో..విద్యార్థినుల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. 

స్కూల్లో కూర్చోవడానికి  స్థలం లేకపోవడం, కుర్చీలు కూడా లేకపోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  అయితే విద్యార్థినిలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసేందుకు  మహనార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అహల్య కుమారి అక్కడికి చేరుకున్నారు. ఆమె మాట కూడా విద్యార్థినులు వినలేదు. పైగా BEO కారుపై రాళ్లు రువ్వారు. ఇటుకలతో కారు అద్దాలను పగులకొట్టారు.  ఈ సమయంలో విద్యార్థినులు మహిళా పోలీసులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోయింది. ఓ మహిళా పోలీసుకు కూడా గాయాలయ్యాయి.