బిట్​కాయిన్​ క్రాష్​.. ఒక్క రోజే రూ. 10 లక్షలు డౌన్‌

బిట్​కాయిన్​ క్రాష్​.. ఒక్క రోజే రూ. 10 లక్షలు డౌన్‌
  • చైనా బ్యాన్​తో బిట్​కాయిన్​ క్రాష్​
  • ఒక్క రోజే రూ. 10 లక్షలు డౌన్‌
  • రూ. 73 లక్షల కోట్లు తగ్గిన క్రిప్టో మార్కెట్ క్యాప్‌
  • 35 శాతానికి పైగా పడిన ఎథరమ్‌, డోజ్‌ కాయిన్‌

న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు చైనా పెద్ద షాక్ ఇచ్చింది.గ్లోబల్‌గా రెండో అతిపెద్ద ఎకానమీ అయిన చైనా, బుధవారం క్రిప్టో పేమెంట్లను బ్యాన్ చేసింది. దీంతో ఒక్క సెషన్‌లోనే క్రిప్టోలు 30 శాతానికి పైగా క్రాష్​ అయ్యాయి. పాపులర్ క్రిప్టోలు  బిట్‌కాయిన్‌, ఎథరమ్‌, డోజ్‌ కాయిన్‌లు కొన్ని నెలల కనిష్టాలకు పడ్డాయి. క్రిప్టో పేమెంట్లను అంగీకరించమని గత వారం టెస్లా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే క్రిప్టోల పతనం స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు. క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ క్యాప్‌ బుధవారం రూ. 73 లక్షల కోట్లు పతనమైంది. పాపులర్ క్రిప్టో కరెన్సీ  బిట్‌‌‌‌కాయిన్ బుధవారం 30 శాతం క్రాష్ అయ్యింది. ఈ ఒక్క సెషన్‌‌లోనే బిట్‌‌కాయిన్ విలువ  సుమారు14 వేల డాలర్లు(రూ. 10 లక్షలు) పడడం గమనార్హం. 43,744 డాలర్ల వద్ద ఓపెన్‌‌ అయిన ఈ క్రిప్టో కరెన్సీ, 30,261 డాలర్ల (రూ. 22 లక్షల) వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. తిరిగి కోలుకొని 34 వేల డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌లో 64,829 డాలర్ల (రూ. 47.32 లక్షల) వద్ద బిట్‌‌కాయిన్ ఆల్‌‌టైమ్‌‌ హైని టచ్‌‌ చేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆ రేటు నుంచి 50 శాతానికి పైగా పతనమైంది. ఎథరమ్‌‌ కూడా 35 శాతానికి పైగా పడి 1,922 డాలర్ల (రూ. 1.45 లక్షలకు) పడింది. తిరిగి కోలుకొని 2,400 డాలర్ల (రూ. 1.75 లక్షల) వద్ద ట్రేడవుతోంది.  డోజ్‌‌కాయిన్‌‌  40 శాతానికి పైగా క్రాష్ అయ్యి  0.21 డాలర్ల (రూ. 15.33) ను తాకింది. తిరిగి కోలుకొని 0.32 డాలర్ల (రూ. 23.36 ) వద్ద ట్రేడవుతోంది. గత కొంత కాలంగా క్రిప్టో కరెన్సీలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌‌ క్యాప్‌‌ను కూడా ఈ ఇండస్ట్రీ అందుకొంది. కాగా క్రిప్టో ట్రాన్సాక్షన్లకు సంబంధించి ఎటువంటి సర్వీస్‌లను అందించకూడదని ఫైనాన్షియల్ సంస్థలను చైనా సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఆదేశించింది. డిజిటల్‌ ట్రేడింగ్ మార్కెట్‌ను కంట్రోల్ చేయడానికి చైనా ఈ నిర్ణయం తీసుకుంది. క్రిప్టో ట్రేడింగ్‌పై ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఈ బ్యాన్ కింద బ్యాంకులు, ఆన్‌లైన్ పేమెంట్స్‌ కంపెనీలు కస్టమర్లకు  రిజిస్ట్రేషన్‌, ట్రేడింగ్‌, క్లియరింగ్‌, సెటిల్‌మెంట్‌ వంటి క్రిప్టో కరెన్సీ రిలేటెడ్‌ సర్వీస్‌లను ఆఫర్ చేయకూడదు.  ఇండివిడ్యువల్స్ వీటిని హోల్డ్‌ చేయడంపై  బ్యాన్ లేదు.

క్రిప్టోల కోసం కమిటీ
దేశంలో క్రిప్టో కరెన్సీలను పూర్తిగా బ్యాన్ చేయడంపై ప్రభుత్వం వెనకడుగేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్‌‌ చెయిన్ టెక్నాలజీని సరియైన రీతిలో వాడుకునేందుకు మార్గాలను వెతకాలని, క్రిప్టోలను కరెన్సీల కంటే డిజిటల్‌‌ అసెట్స్‌‌గా రెగ్యులేట్ చేయాలని చూస్తోంది. దీని కోసం ఓ ఎక్స్‌‌పర్ట్స్‌‌ ప్యానెల్‌‌ను ఏర్పాటు చేయనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలను పూర్తిగా బ్యాన్‌‌ చేయాలని 2019 లో  మాజీ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్‌‌ గార్గ్‌‌  నాయకత్వంలోని కమిటీ ప్రభుత్వానికి రికమండ్ చేసింది. ఈ రికమండేషన్స్ ప్రస్తుత పరిస్థితులకు సరిపోవని ఎనలిస్టులు చెబుతున్నారు. పూర్తిగా బ్యాన్ చేయడం కంటే సమర్ధవంతంగా ఎలా వాడుకోవాలో చూడాలని పేర్కొన్నారు. రిజర్వ్‌‌ బ్యాంక్ తీసుకొస్తున్న డిజిటల్‌‌ రూపాయిపై కూడా ఈ కమిటీ పని చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘సుభాష్ గార్గ్‌‌ కమిటీ ఇచ్చిన రికమండేషన్స్‌‌ అవుట్‌‌ డేట్ అయ్యాయనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్యాన్ కంటే క్రిప్టోలను సమర్ధవంతంగా వాడుకునే మార్గాలను వెతుకుతోంది’ అని పేర్కొన్నాయి. ప్రస్తుతానికి కమీటి ఏర్పాటు ప్రారంభ దశలో ఉంది. ఇంకా అధికారికంగా ఎటువంటి నిర్ణయాలు బయటకు రాలేదు. దేశంలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పెరుగుతుండడాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ గమనిస్తోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. దీనికి సంబంధించి  క్రిప్టో, బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో  ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌‌‌‌ చర్చలు జరిపారు. బ్యాన్ విధించడం కంటే క్రిప్టో కరెన్సీలను రెగ్యులేట్‌‌ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.