కేసీఆర్​పై బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్ ఫైర్

కేసీఆర్​పై బీజేపీ స్టేట్ చీఫ్​బండి సంజయ్ ఫైర్
  • అర్ధరాత్రి వరకు చలిలో ఉంచుతారా?
  • ఉద్యోగులు, టీచర్లకుసీఎం క్షమాపణ చెప్పాలి
  • ఉద్యోగులు ఆయనకు చుక్కలు చూపించడం ఖాయం
  • రాష్ట్ర కార్యవర్గంలో దీనిపై చర్చించి యాక్షన్​ ప్లాన్ రూపొందిస్తం
  • 317 జీవోపై ఓబీసీ మోర్చాప్రగతి భవన్​ ముట్టడికి యత్నం

హైదరాబాద్, వెలుగు: స్పౌజ్ బదిలీలు చేపట్టాలని మహిళా టీచర్లు పిల్లలతో కలిసి ప్రగతి భవన్​ను ముట్టడిస్తే.. కేసీఆర్ సర్కార్ వారి పట్ల రాక్షసంగా వ్యవహరించిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. లంచాల కోసమే 13 జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ బదిలీలు ఆపేశారని ఆరోపించారు. 317 జీవో సహా ఉద్యోగులు, టీచర్ల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామన్నారు. మంగళవారం మహబూబ్​నగర్​లో జరిగే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగ, టీచర్లు ఏమైనా దొంగలా, దేశ ద్రోహులా.. వారిని స్టేషన్ లో అర్ధరాత్రి దాకా చలిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ఫామ్​హౌస్, ప్రగతిభవన్ లో ఉన్న కేసీఆర్ కనీసం వాళ్లను పిలిచి మాట్లాడలేదు. వారి సమస్యను పరిష్కరించాలనే సోయి లేకుండా రాక్షసానందం పొందుతున్నాడని ధ్వజమెత్తారు.

సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు

రాష్ట్రంలో పాలన చూస్తుంటే సకల జనుల సమ్మె నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయని సంజయ్ చెప్పారు. ఇక నుంచి ఉద్యోగులు, టీచర్లు సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించడం ఖాయమని హెచ్చరించారు. ‘‘ ఏ కారణం లేకుండా 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను ఆపేశారు. స్థానికతకు ఇబ్బంది లేకుండా ఆ జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పనిచేసేందుకు రెడీగా ఉన్నామని ఉద్యోగ, ఉపాధ్యాయులు చెబుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదు. టీచర్లు, ఉద్యోగ వర్గాలు 317 జీవో వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. వారి కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో స్థానికత కోసం మళ్లీ ఉద్యమించే దుస్థితి ఏర్పడింది. ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉంటుందా’’ అని సంజయ్​ ప్రశ్నించారు.

317 జీవోకు 34 మంది బలి

‘‘కేసీఆర్ దుర్మార్గంగా తీసుకొచ్చిన 317 జీవో వల్ల 34 మంది చనిపోయారు. 2 వేల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలే ఇయ్యట్లేదు. స్కూళ్లల్లో అటెండర్లు, స్కావెంజర్లు లేరు. టీచర్లే స్కూళ్లను శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతి దాన్ని కేంద్రంతో పోల్చుకుంటున్న కేసీఆర్ సర్కార్.. డీఏలు ఎందుకు ఆపారు. హెల్త్ కార్డులు ఎందుకు పనిచేయడం లేదు’’ అని సంజయ్ ప్రశ్నించారు.

ఉద్యోగులకు ఎన్నాళ్లీ వేధింపులు

మొదటి తారీఖు నాడు జీతాలు, పెన్షన్ ఇయ్యకుండా ఉద్యోగులను ఇలా ఎన్నాళ్లు వేధిస్తారని సంజయ్ ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలుజేసి జీతాలియ్యలేని స్థితికి తీసుకెళ్లారని విమర్శించారు. పీఆర్సీని సకాలంలో అమలు చేయకపోవడంవల్ల ఉద్యోగులు 21 నెలలు నష్టపోయారని చెప్పారు. టీచర్ల మీద, వారి కుటుంబ సభ్యుల మీద, చిన్న పిల్లల మీద జరిపిన దాడులను, అరెస్టులను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కేసీఆర్ బేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 317 జీవోను సవరించి భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ రాత పరీక్షలన్నీ తప్పుల తడకగా నిర్వహించారని, తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినా ఈ సర్కార్ అమలు చేయట్లేదన్నారు. అభ్యర్థుల తరఫున బీజేపీ, యువ మోర్చా పలు ఆందోళనలు చేసిందన్నారు.

కేసీఆర్ పాలనలో ఎవరికీ రక్షణ లేదు

‘టీచర్లు ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తుంటే మానవత్వం లేకుండా ఈడ్చుకుపోతారా? సీఎంకు అంత అహంకారమెందుకు? ప్రజలు కూడా దీన్ని ఖండిస్తున్నారు. అయినా సీఎంలో స్పందన లేదు” అని సంజయ్ ఫైర్ అయ్యారు. టీచర్ల అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి రెవెన్యూ ఉద్యోగి చొరబడటాన్ని మీడియా ప్రస్తావించగా.. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరికీ రక్షణ లేకుండాపోయిందన్నారు. నడిరోడ్డుపై మర్డర్లు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంతసేపు రాజకీయాలు తప్ప మరొకటి లేదని విమర్శించారు.

మహబూబ్ నగర్​లో ఇయ్యాల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్/మహబూబ్​నగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మహబూబ్ నగర్ లో మంగళవారం జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ ఇన్ చార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ ను సిద్ధం చేయడం, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న 9 వేల కార్నర్ మీటింగ్ సక్సెస్ కోసం ఎలాంటి ప్లాన్ చేయాలనే దానిపై చర్చించనున్నారు. పార్లమెంటరీ ప్రవాస్ యోజన, బైక్ ర్యాలీలు జరుగుతున్న తీరుపైనా చర్చించనున్నారు. వచ్చే నెల 13న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానుండడంతో సికింద్రాబాద్  పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు జన సమీకరణపైనా డిస్కస్  చేయనున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఏడున్నర గంటలకు రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ కు సునీల్ బన్సల్ తో పాటు పార్టీ ఆఫీసు బేరర్లందరూ హాజరయ్యారు. 

రాబోయే 3 నెలల కార్యాచరణపై చర్చ

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎస్సీ,-ఎస్టీ, -బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులు, రాష్ట్రానికి ప్రత్యేకంగా మంజూరు చేసిన పనులు, చేపడుతున్న కార్యక్రమాలపై  మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా స్టేట్ మెంట్ విడుదల చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఎన్నికలకు 9 నెలలు మాత్రమే సమయం ఉన్నందున ప్రతి 3 నెలలకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తొలి మూడు నెలలు (ఏప్రిల్ 6లోపు) సంస్థాగత నిర్మాణం (బూత్ కమిటీల నిర్మాణం) పూర్తి చేయాలని, ఆ తరువాత వాటిని యాక్టివ్ చేయాలని, ఆ తరువాత మండల స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించుకున్నారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి సోషల్ మీడియా ఇన్‌‌చార్జీలను గుర్తించి వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయించారు.