బీజేపీ ఒరిజినల్.. కేసీఆర్ డూప్లికేట్ : జేపీ నడ్డా

బీజేపీ ఒరిజినల్.. కేసీఆర్ డూప్లికేట్ : జేపీ నడ్డా

సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ లో జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ లో నడ్డా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని కామెంట్ చేశారు.

వెల్ నెస్ సెంటర్ల పేర్లను బస్తీ దవాఖానాలుగా మార్చేసిండు

‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్ నెస్ సెంటర్ల పేర్లను బస్తీ దవాఖానాలుగా కేసీఆర్ మార్చేసిండు.. ఒరిజినల్ ను డూప్లికేట్ గా మార్చడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య..  డూప్లికేట్ ఎవరో , ఒరిజినల్ ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు..’’ అని నడ్డా పేర్కొన్నారు. ‘‘సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరగాలని కేసీఆర్ భావించడు.. ఎందుకంటే ఆయన ఓవైసీతో చేతులు కలిపాడు’’ అని అన్నారు.

విమోచన దినోత్సవాన్ని జరిపి తీరుతం

రజాకార్ల అరాచకాలను ప్రపంచానికి తెలియజేసేందుకు సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేం ఘనంగా జరిపి తీరుతమని స్పష్టం చేశారు. రూ.3,106 నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ కాగితానికే పరిమితమైందన్నారు. ‘‘కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలిగేది బీజేపీ మాత్రమే. కుటుంబవాదాన్ని వ్యతిరేకంచే వాళ్లంతా తెలంగాణలో బీజేపీతో కలిసిరావాలి’’ అని నడ్డా పిలుపునిచ్చారు.

‘‘బండి సంజయ్ పాదయాత్ర ఇంతటితో ముగియలేదు. మరో విడత యాత్ర మాత్రమే ముగిసింది. దాన్ని ఇంకా కొనసాగిస్తం. ఇంటింటికి , ఊరూరికి వెళ్తం. ప్రజలను చైతన్యం చేస్తం. త్వరలోనే తదుపరి దశ  పాదయాత్ర తేదీలను ప్రకటిస్తం’’ అని నడ్డా వెల్లడించారు.