ప్రతిపక్ష సభ్యులను కుక్కల్లా చూసిన్రు : అంబిక

ప్రతిపక్ష సభ్యులను కుక్కల్లా చూసిన్రు : అంబిక
  • మున్సిపల్  సమావేశంలో బీజేపీ మహిళా కౌన్సిలర్

నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్​ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష సభ్యులను కుక్కల్లా చూశారని బీజేపీ కౌన్సిలర్​ అంబిక ఆరోపించారు. మంగళవారం మున్సిపల్​ చైర్​పర్సన్​ గంధె అనసూయ అధ్యక్షతన జరిగిన మున్సిపల్​ సమావేశానికి ఎమ్మెల్యే పర్ణికారెడ్డి హాజరయ్యారు. మీటింగ్​కు వచ్చిన ఎమ్మెల్యేను కౌన్సిల్​ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్​ అంబిక మాట్లాడుతూ బీఆర్ఎస్​ పాలనలో ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులకు ఫండ్స్​ మంజూరు చేయలేదని, కనీసం పారిశుధ్య పనులు చేయలేదని, కుక్కల్లా అరుస్తరు, పోతరు అన్నట్లుగా చూశారన్నారు. 

భగీరథ నీళ్లు రావట్లేదని చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాలుగేండ్లుగా 12 మీటింగ్​లే నిర్వహించారని, 15 ఫైనాన్స్, ఎస్సీ, ఎస్టీ నిధులు ఖర్చు చేయకుండా పక్కదారి  పట్టించారని బీజేపీ కౌన్సిలర్​ రాఘవేదంర్​ ఆరోపించారు. తమ వార్డుల్లో అభివృద్ది జరగకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నామని బీజేపీ, కాంగ్రెస్​ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే మాజీ ఎమ్మెల్యే డెవలప్​ చేశారని బీఆర్ఎస్​ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా వార్డులను అభివృద్ధి చేసుకుందామని, ఇక నుంచి ప్రతి నెలా కౌన్సిల్  సమావేశం నిర్వహించాలని, తాను అన్ని సమావేశాలకు హాజరవుతానన్నారు. వచ్చే సమావేశం నాటికి 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫండ్స్, చేపట్టిన పనుల వివరాలు అందజేయాలన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేయని వార్డులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు.