
కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. కాసేపట్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. యెడ్యూరప్పను బీజేఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కర్ణాటక పార్టీ ఇంచార్జ్ మురళీధర్ రావు కూడా పాల్గొంటారు. తర్వాత పార్టీ ముఖ్య నేతలతో గవర్నర్ ను కలవనున్నారు యెడ్డీ. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యెడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. తర్వాత ఢిల్లీకి వెళ్తారాయన. ప్రధాని మోడీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షాను కలుస్తారు. యెడ్డీ ఢిల్లీ పర్యటన తర్వాతే ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు కానుంది.
ఆర్ఎస్ఎస్ నాయకుల ఆశీస్సులు తీసుకున్న యెడ్డీ
బెంగళూరులోని చాంరాజ్ పేట ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కు ఈ ఉదయం వెళ్లారు యెడ్యూరప్ప. సీనియర్ నేతల ఆశీస్సులు తీసుకునేందుకు అక్కడికి వచ్చానని చెప్పారు యెడ్డీ. ఢిల్లీ నుంచి పార్టీ ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాననీ.. ఆ తర్వాతే పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై… తీర్మాన ప్రతితో రాజ్ భవన్ కు వెళ్తామన్నారు యెడ్డీ.
ఇక విశ్వాసపరీక్షలో సంకీర్ణ సర్కారు కూలిపోవడంతో.. కర్ణాటకలో బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. బెంగళూరులో బీజేపీ మహిళా కార్యకర్తలు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. యడ్యూరప్పకు అభినందనలు తెలిపేందుకు ఆయన నివాసానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా వచ్చారు. ఇక ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు.. వాళ్ల తరపు లాయర్ ముకుల్ రోహత్గి సమక్షంలోనే తీర్పు ఇస్తామని ప్రకటించింది.