పాక్ మంత్రి ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ నిరసనలు

 పాక్ మంత్రి ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలని బీజేపీ నిరసనలు

దేశవ్యాప్తంగా బీజేపీ నేతల ఆందోళనలు మిన్నంటాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ప్రధాని మోడీ‭పై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. బీజేపీ కార్యకర్తలు పాక్‌ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ, ముంబై సహా అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ‘గుజరాత్ కసాయి’ అంటూ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరమని.. దీనికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు బీజేపీ కార్యకర్తలు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం దగ్గర పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి.. పాకిస్తాన్ డౌన్ డౌన్, బిలావల్ భుట్టో జర్దారీ క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు.

బీజేపీ నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాక్ రాయబార కార్యాలయం వైపు ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేయగా వాటిని ఛేదించుకుని ఎంబసీ వైపు బీజేపీ కార్యకర్తలు పరుగులు తీశారు. నిరసనలు ఉద్రిక్తంగా మారడంతో.. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. 

న్యూయార్క్‌ వేదికగా బిలావల్‌ చేసిన వ్యాఖ్యలను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ గట్టిగా తిప్పికొట్టారు. పాక్‌ మంత్రి తన అసహనాన్ని స్వదేశంలో ఉన్న ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా పెంచి పోషిస్తున్న సూత్రధారుల వైపు మళ్లిస్తే బాగుంటుందని సూచించారు. ఒసామాబిన్‌ లాడెన్‌ను అమరవీరుడని కీర్తిస్తూ లఖ్వి, హఫీజ్‌ సయీద్‌, మసూద్‌ అజర్‌, దావుద్‌ ఇబ్రహీం వంటి అసాంఘిక శక్తులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా పాక్‌ను విమర్శించారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన 126 మంది ఉగ్రవాదులు, 27 ఉగ్రవాద సంస్థలు గల దేశం ప్రపంచంలో మరొకటి ఉండదని బాగ్చీ అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పాక్‌ ‘ఉగ్రవాద కేంద్రం’గా మారిందంటూ గురువారం న్యూయార్క్‌లోని ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ పరోక్షంగా ఎండగట్టారు. దీనికి స్పందనగా బిలావల్‌ ‘గుజరాత్‌లో ఊచకోతకు కారకుడు (బుచర్‌ ఆఫ్‌ గుజరాత్‌)’గా మోడీని దూషించారు.