
ఢిల్లీ ఓటర్లు మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని దూరం పెట్టారు. 1998లో అధికారాన్ని పోగొట్టుకున్నాక మళ్లీ గెలవలేకపోయింది. ఈ 22 ఏళ్లలో లోక్‌సభ ఎన్నికల్లో మంచి విజయాలు దక్కించుకున్నా. అసెంబ్లీకి మాత్రం దూరంగానే ఉండిపోతోంది. అయితే, 2015లో జరిగిన ఎలక్షన్స్‌లో కేవలం మూడు సీట్లనే గెలుచుకున్న బీజేపీ ఈసారి 8 సీట్లకు ఎదిగింది. అలాగే, ఓట్ల శాతంకూడా పెంచుకోగలిగింది. పోయిన ఎన్నికల్లో 32 శాతం రాగా, ఈసారి 38.59 శాతం సాధించింది. వెయ్యి లోపల ఓట్ల మెజారిటీతో 27 సీట్లను పోగొట్టుకుంది. సిట్టింగ్ సీట్లలో ముస్తఫాబాద్ మినహా రోహిణి, కరవాల్నగర్లను నిలుపుకోగలిగింది. వీటితోపాటు ఆప్ చేతిలోని ఘోండా, గాంధీనగర్, రోహ్తాస్నగర్, విశ్వాస్‌నగర్, లక్ష్మినగర్, బదర్పూర్లను దక్కించుకుంది. బావన, కిరారీ, కృష్ణానగర్, పత్పర్గంజ్, షహద్రా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఇవన్నీ లోకల్ అంశాల ప్రాతిపదికగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగిందనడానికి సూచనలుగా చెబుతున్నారు ఎనలిస్టులు.
ప్లానింగ్‌లో ప్రాబ్లమ్
బీజేపీ పోయినేడాది లోక్‌సభ ఎన్నికల్లో 58 శాతం ఓట్లతో మొత్తం ఏడు ఎంపీ సీట్లనూ గెలిచేసింది. అప్పట్లో పాకిస్థాన్, మిలిటెన్సీ, పుల్వామాపై దాడి వంటి నేషనల్ ఇష్యూలతో బీజేపీ ఓట్లు అడిగింది. అదే వ్యూహంతో ఈసారికూడా ఓటర్ల దగ్గరకు వెళ్లడంతో దెబ్బ తిన్నట్లు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ ఇష్యూలపైనే ఫోకస్ పెట్టాల్సిందన్నారు. ఢిల్లీలో తూర్పు యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు దాదాపు 35 శాతం ఉంటారు. వీళ్లను పూర్వాంచల్ ప్రాంతం ఓటర్లుగా గుర్తిస్తారు. వీళ్లు గతంలో తూర్పు, ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లోనే ఉండేవారు. ఇప్పుడు దక్షిణ, ఔటర్ ఢిల్లీలకుకూడా వ్యాపించారు. ఆప్ చాలా జాగ్రత్తగా పూర్వాంచల్కి చెందినవాళ్లకు ఎక్కువ సీట్లు ఇచ్చింది. నరేలా, బురారీ, బద్లి, రిఠాలా, సుల్తాన్పూర్ మజ్రా, దేవ్లీ, అంబేద్కర్ నగర్, సంగ్రామ్ విహార్లతోపాటు ఈశాన్య ఢిల్లీలోని చాలాచోట్ల పూర్వాంచల్ వాళ్లనే నిలబెట్టింది.
ఒక్కసారే గెలిచింది!
1993లో జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మాత్రమే బీజేపీ గెలవగలిగింది. మదన్‌లాల్ ఖురానా తొలి సీఎం అయ్యారు. హవాలా స్కాంలో ఖురానా పేరు కూడా ఉండడంతో ఆయనను మార్చి సాహిబ్ సింగ్ వర్మను సీఏంగా కూర్చోబెట్టారు. వర్మ హయాంలో ఢిల్లీలో ఉల్లిగడ్డల ధర ఆకాశాన్నంటింది. దీంతో ఎన్నికలు మరో రెండు నెలలుండగా, ఆయననుకూడా మార్చేసి సుష్మా స్వరాజ్‌ని సీఎం చేశారు. ఈ ప్రయోగాలు ఢిల్లీ ఓటర్లలో అసంతృప్తికి దారి తీశాయి. కాంగ్రెస్ దీనిని వాడుకుని అధికారానికి రాగలిగింది. రెండో అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి వరుసగా మూడుసార్లు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పవర్ దక్కించుకుంది. 2013లో ఓడిపోయాక… ఇప్పటివరకు కాంగ్రెస్ కోలుకోలేదు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ నుంచి వీఆర్ఎస్ తీసుకుని కేజ్రీవాల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ 2013లో గెలిచి, కాంగ్రెస్ సహకారంతో అధికారానికొచ్చింది. కాంగ్రెస్ పెత్తందారీతనం నచ్చక కేవలం 48 రోజులకే కేజ్రీవాల్ రాజీనామా చేసేశారు. 2015లో జరిగిన ఎలక్షన్స్‌లో ఆప్ 67 సీట్లతో రికార్డు విజయం సాధించింది. అప్పట్లో బీజేపీ మూడు సీట్ల దగ్గర ఆగిపోయింది. ఈసారి ఎనిమిది సీట్లకు పెరిగి, ఓట్ల శాతం 38.59 శాతం సాధించింది.