హిందీ స్టేట్స్ అన్నీ గోమూత్ర రాష్ట్రాలే! : సెంథిల్ కుమార్

హిందీ స్టేట్స్ అన్నీ గోమూత్ర రాష్ట్రాలే! : సెంథిల్ కుమార్
  • బీజేపీ అక్కడ మాత్రమే గెలుస్తది: సెంథిల్ కుమార్
  • దక్షిణాదిలో అధికారం కలగానే ఉంటది
  • పవర్ కోసం కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు
  • లోక్​సభలో డీఎంకే ఎంపీ వివాదాస్పద కామెంట్లు
  • తీవ్రంగా ఖండించిన బీజేపీ లీడర్లు

న్యూఢిల్లీ: హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందని, అక్కడ మాత్రమే పార్టీ బలంగా ఉందని, ఆ స్టేట్స్​ను గోమూత్ర రాష్ట్రాలు అని డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ అన్నారు. సౌత్ ఇండియాలోని ఏ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేదని విమర్శించారు. గోమూత్ర రాష్ట్రాలంటూ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్నది. ఇటీవల మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, రాజస్థాన్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీన్ని ఉద్దేశిస్తూ డీఎంకే సభ్యుడు సెంథిల్ కుమార్ లోక్​సభలో ఈ కామెంట్లు చేశారు. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళలో బీజేపీ అధికారంలోకి రావడంలేదని సెంథిల్ విమర్శించారు. భవిష్యత్తులో కూడా సౌత్ ఇండియాలో బీజేపీ అధికారంలోకి రాదనితేల్చి చెప్పారు. హిందీ మాట్లాడే రాష్ట్రాలను గో మూత్రంతో పోల్చడంపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దక్షిణాదిని గుప్పిట్లో తీసుకునేందుకు కుట్ర

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం లోక్​సభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. జమ్మూ కాశ్మీర్​కు సంబంధించిన రెండు బిల్లులపై చర్చలో భాగంగా డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ మాట్లాడారు. ‘‘తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూస్తే బీజేపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఈ రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి రాలేదు. మీరు అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొత్తం దక్షిణాదిని మీ అధీనంలోకి తీసుకోవాలని మీరు కలలు కంటున్నారు. అది ఎప్పటికీ నెరవేరదు..’’ అని సెంథిల్ కుమార్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా కొందరు నేతలు నార్త్ ఇండియా.. సౌత్ ఇండియా అంటూ కామెంట్లు చేశారు. దేశాన్ని విభజిస్తూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో డీఎంకే లీడర్ నార్త్ ఇండియాలోని రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలతో పోల్చినట్లు తెలుస్తున్నది.

వరదల్లో డీఎంకే కొట్టుకుపోతది: అన్నామలై

ఎంపీ సెంథిల్ కుమార్ కామెంట్లపై బీజేపీ లీడర్లు తీవ్రంగా స్పందించారు. నార్త్ ఇండియన్స్ అంటే ఇండియా కూటమికి ప్రేమ లేదని మండిపడ్డారు. ఇండియా కూటమిలోని డీఎంకే లీడర్ అవమానకర రీతిలో మాట్లాడటాన్ని సమర్థిస్తారా? అంటూ రాహుల్ గాంధీని లీడర్లు ప్రశ్నించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై మాట్లాడారు. ‘‘వర్షంలో చెన్నై మునిగిపోయిన విధంగానే అహంకార డీఎంకే పార్టీ కూడా మునిగిపోతుంది. డీఎంకే పతనానికి అహంకారమే కారణమవుతుంది. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఇటీవల వరకు కర్నాటకలో కూడా బీజేపీ అధికారంలో ఉన్న విషయాన్ని డీఎంకే నేత బహుశా మరిచిపోయారు. ఇలాంటి కామెంట్లను కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సమర్థిస్తారా..?”అంటూ అన్నామలై ప్రశ్నించారు.

ప్లకార్డులు తేవొద్దు: స్పీకర్

లోక్ సభలోకి సభ్యులు ప్లకార్డులు పట్టుకుని వస్తుండటంపై స్పీకర్ ఓం బిర్లా సీరియస్ అయ్యారు. కొత్త పార్లమెంట్​లో ఇదేంటని ప్రశ్నించారు. డిగ్నిటీ, డిసిప్లేన్ పాటించాల ని సూచించారు. బీఎస్పీ సభ్యుడు డానిశ్ అలీ హంగ్ తన మెడ చుట్టూ ప్లకార్డు పెట్టుకుని బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్లకార్డు లతో సభ్యుల నిరసనను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. బయటపెట్టేసి రావాలని స్పీకర్ కోరినా పట్టించుకోలేదు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.